వండర్ ఎట్ సీ
అబ్బురపరచిననౌకాదళ విన్యాసాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : భారత తూర్పునౌకదళం తన యుద్ధపాటవాన్ని ఘనంగా ప్రదర్శించింది. నేవీ డే ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నం సముద్ర జలాల్లో మంగళవారం ‘డే ఎట్ సీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1,400మంది ప్రజలు, విద్యార్థులను యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ జలాశ్వపై సముద్రంలోకి తీసుకువెళ్లి యుద్ధ విన్యాసాలను ప్రదర్శించారు. యుద్ధాలు, తీవ్రవాదుల దాడులు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాల సమయంలో సముద్రం చిక్కుకున్నవారిని చేతక్ హెలికాప్టర్ల నుంచి నౌకాదళ సిబ్బంది ఎలా కాపాడేది ప్రదర్శించి చూపారు.
నాలుగు యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లపై నుంచి నౌకాదళ సిబ్బంది అబ్బురపరిచే రీతిలో యుద్ధ విన్యాసాలు ప్రదర్శించారు. ఈ విన్యాసాల్లో ఐఎన్‌ఎస్ జలాశ్వతోపాటు యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్ శివాలిక్, ఐఎన్‌ఎస్ సైహ్యాద్రి, ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ విభూతి, చేతక్, కమోవ్, హాక్ హెలికాప్టర్లు, మిగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాల్గొన్నాయి. శత్రుదేశాల జలాంతర్గాముల ఉనికిని ప్రత్యేక పరికరంతో గుర్తించి విధ్వంసం చేసే యుద్ధ విన్యాసం అందర్నీ ఆకట్టుకుంది.
భారత జలాల్లోకి ప్రవేశించే శత్రుదేశ నౌకలపై యుద్ధ విమానాల నుంచి ఎలా దాడి చేసేది ప్రదర్శించారు. వారి యుద్ధ విమానాలను క్షిపణుల ద్వారా నేలకూల్చడం, యుద్ధ నౌకలకు సముద్ర జలాల్లోనే ఇంధనం నింపడం, హాక్ యుద్ధ విమానాలు అతి తక్కువ ఎత్తులో అత్యంత వేగంతో చేసిన విన్యాసాలు ఆశ్చర్యచకితులను చేశాయి. నాలుగు యుద్ధ నౌకల నుంచి క్షిపణులతో ఒకేసారి లక్ష్యాలను ఛేదించడం అబ్బురపరచింది. ఈస్ట్రన్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ ఏబీ సింగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ విన్యాసాల్లో ఐఎన్‌ఎస్ జలాశ్వకు కెప్టెన్ టీవీఎన్ ప్రసన్న, ఐఎన్‌ఎస్ శివాలిక్‌కు కెప్టెన్ పురువీర్‌దాస్, ఐఎన్‌ఎస్ సహ్యాద్రికి కెప్టెన్ జ్యోతిన్ రానా, ఐఎన్‌ఎస్ శక్తికి కెప్టెన్ విక్రమ్ మీనన్, ఐఎన్‌ఎస్ విభూతికి లెఫ్ట్‌నెంట్ కమాండర్ వి.కాశిరామన్ సారథ్యం వహించారు.
యుద్ధనౌకల సందర్శనకు అవకాశం
విద్యార్థులు, ప్రజలకు యుద్ధ నౌకలను సందర్శించే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఈస్ట్రన్ ఫ్లీట్ కమాండర్ ఏబీ సింగ్ తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో విద్యార్థులు ఐఎన్‌ఎస్ డేగాలో యుద్ధ విమానాలను సందర్శించేందుకు అనుమతిస్తామన్నారు. సాధారణ ప్రజలను 22, 23 తేదీల్లో అనుమతిస్తామన్నారు. డిసెంబర్ 4న విశాఖపట్నం బీచ్‌లో నేవీ డే ప్రధాన వేడుకలు నిర్వహిస్తామని ఏబీ సింగ్ తెలిపారు. అందుకు ముందుగా డిసెంబర్ 2న రిహార్సల్స్ ఉంటాయన్నారు.