
కాలభైరవుల కన్నెర్ర!
గుంటూరు పెద్దాసుపత్రికి రోజుకు
70 మందికి పైకా కుక్కకాటు బాధితుల రాక
పిచ్చికుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న పలువురు చిన్నారులు
వ్యాక్సిన్ వేసినా మృతి చెందిన మాచర్లకు చెందిన ఐదేళ్ల చిన్నారి పుష్పలత
మూఢనమ్మకాలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న ప్రజలు
గ్రామాలు, పట్టణాల్లో శునకాల బెడదను పట్టించుకోని అధికారులు
గుంటూరు : జిల్లాలో కుక్కకాటు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా గుంటూరు, మాచర్ల, తెనాలి వంటి ప్రాంతాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్)కి నిత్యం 70 మందికి పైగా కుక్కకాటు బాధితులు చికిత్స నిమిత్తం రావటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మాచర్ల, తెనాలి ప్రాంతాల్లో పిచ్చికుక్క కాటుకు గురైన అనేక మంది చిన్నారులు జీజీహెచ్‌లోని శిశు వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. చిన్నపిల్లలు కావడం ఎత్తు తక్కువగా ఉండటంతో కంటిపై, బుగ్గలపై, చెవులపై కుక్కలు కరవడంతో వైరస్ మెదడుకు త్వరగా చేరే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పది రోజుల క్రితం మాచర్ల పట్టణం 3వ వార్డుకు చెందిన పుష్పలత అనే ఐదేళ్ల చిన్నారిని పిచ్చికుక్క కరవడంతో జీజీహెచ్‌కి తరలించారు. వైద్యులు ఇమ్యునోగ్లోబిన్ వ్యాక్సిన్ వేశారు. మరో డోసు కోసం మళ్లీ రమ్మని చెప్పడంతో ఇంటికి వెళ్లిన చిన్నారి పిచ్చి కుక్కమాదిరిగా ప్రవర్తిస్తుండటంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు మళ్లీ జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే జ్వరాల ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగానే చిన్నారి మృతి చెందింది. కుక్క కరచిన వెంటనే గాయాన్ని నీటితో శుభ్రం చేసి వ్యాక్సిన్‌కు తీసుకురావాలని వైద్యులు తెలిపారు.
కుక్కకాటుకు గురై జీజీహెచ్‌లో చికిత్స పొందిన బాధితుల సంఖ్య నవంబరు నెలలో 1564, డిసెంబర్‌లో 1774, జనవరిలో ఇప్పటి వరకు 1420గా తేలింది. ఒక్క జీజీహెచ్‌లోనే ఇంత మంది చికిత్స పొందారంటే ఇక జిల్లా వ్యాప్తంగా ఎంత మంది ఉంటారో ఊహించుకోవచ్చు. పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడద తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు ... కుక్కకాటుకు గురైన వెంటనే గాయాన్ని సబ్బు నీటితో పలుమార్లు శుభ్రం చేయాలి. అయితే ప్రజలు మాత్రం కుక్క కరిచిన వారికి నీళ్లు తగలకూడదనే మూఢ నమ్మకంతో పసరుకట్లు కట్టడం వంటివి చేయడంతో వైరస్ వేగంగా శరీరంలోకి వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని శుభ్రపరిచి ప్రథమ చికిత్స చేయించి వైద్యులను సంప్రదిస్తే వ్యాక్సిన్‌ల ద్వారా సులభంగా చికిత్స చేయవచ్చని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ డోసులను డాక్టర్‌లు చెప్పిన సమయానికి వేయించుకోవాలని, ఆలస్యం చేస్తే వైరస్ మెదడుకు పాకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ముఖంపై కుక్క కరిచిన వారు వేగంగా ఆసుపత్రికి చేరుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని లేని పక్షంలో ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు.