రెడ్ అలెర్ట్
ఎర్రమట్టి దిబ్బలపై ఎనలేని నిర్లక్ష్యం
బోర్డు లేదు.. గార్డూ లేడు..
ఎక్కడ చెత్త అక్కడే
అసాంఘిక కార్యకలాపాలు
దుస్థితిలో చరిత్రాత్మక ప్రాంతం
విశాఖపట్నం: సాగరతీరంలో గుట్టల కొద్దీ కుంకుమ రాశులు పోసినట్టు కనిపిస్తాయి. మధ్యమధ్య లో పచ్చదనంతో మేళవిస్తాయి. దేశవిదేశాల్లోని పర్యాటకు ల మదిని దోచుకున్నా యి. సుమారు పన్నెండు వేల ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. విశాఖ కీర్తిని, ప్ర తిష్టను ప్రపంచవ్యాపితంగా ఇనుమడింప చేసేందుకు తోడ్పడ్డాయి. గత ఏడాది జియో హెరిటే జ్ స్థలంగానూ గుర్తింపు తెచ్చుకున్నాయి. అంతటి విశిష్టత కలిగిన ఎర్రమట్టి దిబ్బలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కనీసం ఇవే ఎర్రమట్టి దిబ్బలు అని తెలిపే బోర్డు కూడా ఏర్పాటు చేసే వాడే లేడు. అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకునే వాడే లేడు. వాటిని సంరక్షించే నాథుడూ లేడు. విశాఖ పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు, అధికారులు ఈ ఎర్రమట్టి దిబ్బలను పేరు గొప్ప ఊరు దిబ్బ అనే స్థితికి తీసుకొస్తున్నారు. విశాఖలోని ఎర్రమట్టిదిబ్బలు లాంటివి ఆగ్నేయాసిలో తమిళనాడు, శ్రీలంకల్లో మాత్రమే ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించడానికి గొప్పగా ఎర్రమట్టి దిబ్బలను ప్రముఖంగా చూపిస్తుంటారు. సాగరతీరంలో ఉన్న వీటిని ఏటా వేలాది మంది ప ర్యాటకులు విదేశాల నుంచి కూడా వస్తుంటారు. కానీ ఇప్పుడక్కడ పరిస్థితి వేరుగా ఉంది.
సంబంధింత అధికారులు ఎర్రమట్టి దిబ్బలను గాలికొదిలేశారు. శుభ్రతను పట్టించుకోవడం మానేశారు. హుద్‌హుద్ తుపాన్‌కు విరిగిపడ్డ చెట్ల కొమ్మలను, ఇతర వ్యర్థాలను చాన్నాళ్లు అలాగే వదిలేశారు. పగలు, సాయంత్రం తేడా లేకుండా కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పర్యాటకులకు రక్షణకు పోలీసులు కూడా ఉండరు. అరకొరగా వస్తున్న పర్యాటకులు, సందర్శకులు దిబ్బలపైకి ఎక్కి, దిగడంతో సహజత్వాన్నీ, ఆకృతినీ కోల్పోతున్నాయి. ైగె డ్లను ఏర్పాటు చేయలేదు. ఎర్రమట్టిదిబ్బలు ఇవే అని తెలిపే ఒక్క బోర్డు కూడా లేదు. స్వచ్ఛందంగా బోర్డు ఏర్పాటుకు వివిధ సంస్థలు ముందుకొచ్చినా అధికారులు అనుమతించడంలేదు. రానున్న 15-20 ఏళ్లలో ఎర్రమట్టిదిబ్బల ఉనికికే ప్రమాదం ఏర్పడవచ్చని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రక్షణ కవచంలో ఉంచాలి
ఎంతో విలువైన వారసత్వ సంపదగా ఉన్న ఎర్రమట్టిదిబ్బలను కాపాడుకోవాలి. దిబ్బల సహజత్వాన్ని దెబ్బతీయకుండా తగు చర్యలు తీసుకోవాలి. పిక్నిక్‌లు, సినిమా షూటింగ్‌లను నిలువరించాలి. జియాలజిస్టులు దీనిని పర్యాటక ప్రాంతంగా చూడొద్దంటున్నారు. పర్యాటకుల్లో అవగాహన వచ్చేదాకా దిబ్బల చుట్టూ ఫెన్సింగ్ వేయిం చాలి. మట్టితో కట్టడాలు ని ర్మించాలి. సత్వరమే ఎర్రమట్టిదిబ్బలపై సర్వే పూర్తి చేయా లి. అక్కడ బోర్డు ఏర్పాటుతో పాటు వీటి విశిష్టతను తెలిపే సమాచారం ఉంచాలి.
-సోహన్ హటంగడి, పర్యావరణవేత్త.
ఎందుకిలా?
ఎర్రమట్టిదిబ్బలు ఎవరి అజమాయిషీలోనూ లేవు. జీవీఎంసీ, వుడా, ఆర్కియాలజీ, ఏపీటీడీసీ ఇలా ఎవరూ వీటి బాధ్యతను తీసుకోవడం లేదు. అప్పుడెప్పుడో ఏపీటీడీసీ ముందుకొచ్చినా విమర్శల నేపథ్యంలో అడుగు ముందుకు పడలేదు. గతంలో జీఎస్‌ఐ డెరైక్టర్ జనరల్ వీటిని సంరక్షించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాశారు. అయినా అతీగతీలేదు. దీంతో వీటి సంరక్షణను గాలికొదిలేశారు.