
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని 29 భౌగోళిక వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తింపు పొందిన విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బల్ని ‘పచ్చ’ మాఫియా దోచేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే బఫర్ జోన్‌లోకి చొరబడి మరీ మట్టిని అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎర్ర మట్టి దిబ్బల తవ్వకాలపై స్పందించారు. ఎర్రమట్టి దిబ్బల్లో జరుగుతున్న విధ్వంసం వద్ద సెల్ఫీ తీసుకొని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులు. చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లోనే భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బల వద్ద పరిస్థితి ఇది. ప్రభుత్వ పెద్దల సహకారం స్థానిక నాయకుల మద్దతుతో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్ ఏలా ఉండబోతుందో ఇలా చెప్పకనే చెబుతున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులు, చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి 35 రోజుల్లో విశాఖలోని భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టిదిబ్బల పరిస్థితి ఇది. ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నాయకుల మద్దతుతోనే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇలా చెప్పకనే… pic.twitter.com/27R1dNyr7e
— Gudivada Amarnath (@gudivadaamar) July 17, 2024
ఇదిలా ఉండగా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎర్రమట్టి దిబ్బలపై పచ్చ మీడియా ఎన్నో అసత్య ప్రచారాలు చేసింది. చంద్రబాబు, పవన్.. ఇద్దరూ కలిసి అప్పట్లో నోటికొచ్చిన అబద్ధాల్ని ప్రజలపై రుద్దేశారు. వారసత్వ సంపదకి ముప్పు వాటిల్లుతోందంటూ గగ్గోలు పెట్టేశారు. అంతా నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నా అక్కడేదో ఘోరం జరిగిపోతోందంటూ నానా యాగీ చేసి నిజాలను ‘ఎర్రమట్టి’లో కప్పెట్టేశారు. సీన్ కట్‌చేస్తే.. ఇప్పుడు వారే అధికారం చెలాయిస్తున్నారు. ఇంకేముంది.. నిబంధనల్ని గాలికొదిలేసి మట్టి తవ్వకాలు జరుగుతున్నా.. ఏమో సార్.. మాకు కనబడదు.. అన్నట్లుగా ఉంది ఇప్పుడు వారిద్దరి తీరు.