పక్కా ప్లాన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు పరిధిలోని విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. మొన్న ఇస్కాన్‌సిటీ పరిధిలో రూ.10 కోట్లు విలువజేసే కార్పొరేషన్ స్థలాన్ని కొందరు అమ్మి సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెలుగులోకి తీసుకురావడంతో కబ్జా బాగోతం బయటపడింది. తాజాగా నెల్లూరు శివారు ప్రాంతమైన జనార్దన్‌రెడ్డి కాలనీలో సుమారు రూ.5 కోట్లు విలువజేసే ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కార్పొరేషన్‌లోని ఓ బడా టీడీపీ నేత, అతని అనుచరులు పథకం వేశారు.
అయితే స్థానికులు అడ్డుకోవడంతో కబ్జా బాగోతం కాస్త బయటకు పొక్కింది. వివరాల్లో కెళితే... నగరంలోని 54వ డివిజన్ పరిధిలో సర్వే నంబర్ 2062/3లో సుమారు 2.50 ఎకరం ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా కాలనీ పరిధిలోనే మరో 2.50 ఎకరాలను సైతం ఆక్రమించుకునేందుకు పథకం పన్నినట్లు సమాచారం. అందులో భాగంగా ఇటీవల ఓ వ్యక్తి నాలుగు ప్లాట్లు వేసి విక్రయించారు.
అందులో ఒక ప్లాటులో రేకుల షెడ్డు కూడా నిర్మించారు. ఒక్కొక్కరుగా స్థలాలను ఆక్రమించుకుంటుండడంతో స్థానికులు అధికారులను కలిశారు. తాము ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాలు లేకుండా అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నామని, తమకు కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని పంచిపెట్టాలని పలుమార్లు కోరారు. అయితే అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రూ.5 కోట్లకు టెండర్
పెన్నా తీరం శ్మశాన వాటిక సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ముచేసుకునేందుకు టీడీపీకి చెందిన ముఖ్యనేత ఒకరు తెరవెనుక నుంచి మంత్రాంగం నడిపినట్లు విశ్వసనీయ సమాచారం. రెవెన్యూలోని ఓ అధికారి ద్వారా ఈ తంతంగాన్ని పూర్తి చేసి సొమ్ము చేసుకునేందుకు అనుచరులను రంగంలోకి దింపినట్లు తెలిసింది. ఒక్కొక్క ప్లాటును విక్రయించుకుంటూ సొమ్ముచేసుకునేందుకు పథకం వేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
అందులో భాగంగా ఆదివారం పచ్చ జెండాలు పాతినట్లు స్థానికులు చెపుతున్నారు. అదే విధంగా ప్రభుత్వ స్థలం అంతా హద్దులు ఏర్పాటు చేస్తుండడంతో విషయం తెలుసుకున్న స్థానికులు వారిని అడ్డుకున్నారు. తాము ఏళ్ల తరబడి ఉంటున్నామని, ప్రభుత్వ స్థలాన్ని మీకెవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్కసారిగా స్థానికులంతా గుమికూడా నిలదీయడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ప్రస్తుతం ఉన్న రేకుల షెడ్డును కూలదోయాలని, అదేవిధంగా హద్దులు చెరిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా స్థానికంగా ఉంటున్న హిజ్రాలు కొందరు రెవెన్యూ అధికారులను కలిసి ప్రభుత్వ స్థలాన్ని తమకు కేటాయించాలని కోరారు. ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాల కోసం అర్జీలు ఇచ్చిన పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో గౌరవంగా బతకాలంటే ప్రభుత్వ పథకాలు తమకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.