
సాక్షి, చిత్తూరు: శ్రీకాళహస్తీశ్వరాలయంలో రేపటి నుంచి ముక్కంటి దర్శనానికి భక్తులకు అనుమతిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆలయ పరిపాలనా భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు(బుధవారం) ఆలయంలో స్వామి, అమ్మవార్లకు శాంతి అభిషేకాల తర్వాత ఉద్యోగులు, మీడియా ప్రతినిధులతో ట్రయల్ రన్ నిర్వహిస్తామని చెప్పారు. 11 నుంచి స్థానికులు దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. 12 నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆలయ ప్రవేశం కల్పిస్తామన్నారు.
ఆధార్ కార్డు తీసుకురావడంతో పాటు మాస్కు ధరించిన వారికే ఆలయ ప్రవేశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భక్తుల మధ్య క్యూలైన్లలో ఆరడగుల భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే దర్శనాలు ఉంటాయన్నారు. రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు అన్ని రకాల టికెట్లతో కలిపి మొత్తం గంటకు 300 మందికి మాత్రమే అనుమతిస్తామన్నారు. అర్జీత సేవలు, అభిషేకాలు, కల్యాణోత్సవం, హోమ పూజలు చేసుకోవడానికి భక్తులకు అనుమతి లేదని చెప్పారు. నిత్యాన్న ప్రసాదం, ఉచిత ప్రసాదం పంపిణీ నిలిపివేశామని వెల్లడించారు. తీర్థం, అర్చనలు రద్దు చేశామని తెలిపారు. వృద్ధులు, పది సంవత్సరాల లోపు పిల్లలకు ఆలయ ప్రవేశం లేదని ఈవో చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment