విజయవాడ: ఏపీ, తెలంగాణల్లో ఆదివారం జరగనున్న పీజీ వైద్య ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజు శుక్రవారం తెలిపారు. పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. హాల్ టికెట్, గుర్తింపు కార్డు మినహా పెన్, పెన్సిల్, వాచ్ సహా ఎటువంటివీ పరీక్ష హాల్‌లోకి అనుమతించబోమన్నారు. అలాగే ఉదయం 9.15 గంటల తర్వాత అభ్యర్థులను కూడా అనుమతించబోమన్నారు.
మొత్తం 13,442 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 44 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని, అదేరోజు సాయంత్రం ప్రాథమిక ‘కీ’ని విడుదల చేస్తామని, ‘కీ’పై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం మార్చి 7 తుది ‘కీ’ విడుదల చేస్తామన్నారు.