సైబీరియా అతిథులను కబళించిన పై-లీన్
సాక్షి, ఇచ్ఛాపురం: ఖండాంతరాలు దాటి.. వేల కిలోమీటర్లు ప్రయాణించి.. సిక్కోలు తీరం వచ్చిన ‘విదేశీ అతిథుల’ను పై-లీన్ పొట్టన పెట్టుకుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి గ్రామానికి సైబీరియా నుంచి వలసవచ్చిన సుమారు నాలుగు వేలకు పైగా పక్షులు శనివారం రాత్రి పెను తుపాను తాకిడికి మృతి చెందాయి.
సైబీరియా పక్షులు (నత్తగొట్టు పిల్లలు,కొంగ లు, సిలికాన్ పక్షులు) ఏటా జూన్, జూలై నెలల్లో సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వలస వస్తాయి. దాదాపు ఐదారు నెలలు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి అనంతరం తిరిగి తమ దేశాలకు వెళ్లిపోతాయి. ఏటా క్రమం తప్పకుండా వేల సంఖ్యలో వచ్చే ఈ పక్షులను ఆత్మబంధువులుగా భావించే స్థానికులు ఎంతో పదిలంగా సంరక్షిస్తారు. ఈ పక్షులను ఎవరూ వేటాడటం కానీ, పట్టుకుని అమ్మటం కానీ చేయరాదనేది ఊరి కట్టుబాటు. శనివారం రాత్రి తుపాను తీరం దాటే సమయంలో దాదాపు 220 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు దాదాపు నాలుగు వేల పక్షులు ప్రాణాలొదిలాయి.
కొన్ని పక్షులను ఇక్కడి నత్తగొట్టు పిల్లల సంరక్షణ కేంద్రంలో భద్రపరిచినా ప్రయోజనం లేకపోయింది. కాగా.. ఒంటికాలిపై నిలబడి తమ అందాలతో చూపరుల్ని ఆకర్షించే విదేశీ పక్షులు ఇక్కడి జంతువులకు ఆహారమైపోతున్నాయి. విపత్కర సమయాల్లో అటవీశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ఎన్నోమార్లు విజ్ఞప్తి చేస్తే చిన్న షెడ్ ఒకటి కట్టించారు తప్పితే వాటి సంరక్షణకు టవర్ నిర్మాణం చేపట్టలేదు. నెట్ తరహా రక్షణ ఉంటే ఇంత జరిగేది కాదని నిపుణులు చెప్తున్నారు.