మావయ్యల పై చూపించిన అభిమానమే నాపై చూపిస్తున్నారు
అమలాపురం టౌన్ :‘మీ రుణం తీర్చుకోలేను, మావయ్యలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌పై మీరు చూపించిన అభిమానమే నాపై చూపిస్తున్న తీరు జీవితాంతం గుర్తుంచుకుంటాను’ అని మెగా హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. ధరమ్‌తేజ్ హీరోగా నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రం యూనిట్ ఆదివారం సాయంత్రం అమలాపురం వచ్చింది. ఆ చిత్రం ప్రదర్శిస్తున్న రమా థియేటర్‌లో సందడి చేసింది. థియేటర్‌లో ప్రేక్షకులను, అభిమానులనుదే దశించి సాయిధరమ్‌తేజ్ మాట్లాడారు. ఆయనతోపాటు చిత్ర దర్శకుడు రవికుమార్ చౌదరి, నటుడు గబ్బర్‌సింగ్ శ్రీను కూడా మాట్లాడారు. చిత్ర కథానాయిక రెజీనా సందడి చేశారు.
ముందుగా ఈదరపల్లి వంతెన వద్ద ఆ చిత్ర యూనిట్ బస్సుకు చిరంజీవి అభిమానులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఊరేగింపుగా యూనిట్‌ను థియేటర్‌కు తోడ్కొని వచ్చారు. చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు నల్లా చిట్టిబాబు, ఏడిద శ్రీను, నల్లా నాయుడు, యర్రా నాగబాబు, నల్లా పవన్, ఆకుల రాము, పిండి రాజా, జంగా అబ్బాయి వెంకన్న తదితరులు హీరో సాయిధరమ్‌తేజను గజమాల, పూలకిరీటాలతో ఘనంగా సన్మానించారు. థియేటర్ వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అభిమానులు అసౌకర్యానికి గురయ్యారు.
ప్రేక్షకాదరణ పొందుతుందని తెలుసు : దిల్ రాజు
కాకినాడ సిటీ : ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందని ముందే ఊహించినట్టు దిల్ రాజు చెప్పారు. విజయోత్సవ యాత్రలో భాగంగా ఈ చిత్ర యూనిట్ కాకినాడకు వచ్చింది. హీరో సాయిధరమ్‌తేజ్, హీరోయిన్ రెజీనా, చిత్ర సమర్పకులు దిల్‌రాజు, దర్శకుడు రవికుమార్‌చౌదరి, నిర్మాతలు బన్నీవాసు, శ్రీహర్షిత్, సినీనటి హేమ, నటుడు ప్రభాస్‌శ్రీను పద్మప్రియ థియేటర్‌ను సందర్శించారు. ముందుగా థియేటర్ యాజమాన్యం అభిమానులతో కలిసి చిత్రయూనిట్‌కు బాణ సంచా, డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. మెగా ఫ్యామిలీ ప్రభావం ఉన్నప్పటికీ హీరో నటన, ప్రతిభ కామన్ ఆడియన్స్‌ను ఎంతో ఆకట్టుకుందని దిల్‌రాజు చెప్పారు. మంచి కథ, కథనాలతో నిర్మిస్తున్న చిత్రాల్లో పిల్లా నువ్వులేని జీవితం ఒక్కటన్నారు. హీరో సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ మేనమామల ప్రోత్సాహం తనకు స్ఫూర్తి ఇచ్చిందన్నారు. ప్రేక్షకులు ఆదరించడం చాలా ఆనందంగా ఉందని, కుటుంబ సమేతంగా చిత్రాన్ని చూస్తున్నారని చెప్పారు.
పాదగయ సందర్శన
పిఠాపురం : ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్ర యూనిట్ బృందం స్థానిక పాదగయ క్షేత్రాన్ని దర్శించుకుంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, చిత్ర హీరో సాయి ధరమ్‌తేజ, నిర్మాతలు బన్నీవాసు, ఆదిశెట్టి తదితరులు శ్రీకుక్కుటేశ్వరస్వామిని, శ్రీపురుహూతికా అమ్మవారిని, శ్రీరాజరాజేశ్వరీదేవిని, దత్తాత్రేయస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు.
రాజమండ్రిలో హల్‌చల్
రాజమండ్రి కల్చరల్ : గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్ర బృందం ఆదివారం స్థానిక గీతా అప్సరా థియేటర్‌లో హల్‌చల్ చేసింది. హీరో, హీరోయిన్లను చూడడానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హీరో సాయిధరమ్‌తేజ్, హీరోయిన్ రెజీనాలకు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. సాయి ధరమ్‌తేజ్ మాట్లాడుతూ మావయ్య (చిరంజీవి)తో కలిసి మదర్‌థెరిస్సా విగ్రహావిష్కరణకు రాజమండ్రి వచ్చానని, తర్వాత ఇప్పుడు వచ్చానన్నారు. గోదావరి అందచందాలంటే మావయ్యకు ఎంతో ఇష్టమని చెప్పారు. హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ చిత్రం విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి అందాలు తనను ఆకట్టుకున్నాయన్నారు. హీరోను గజమాలతో సత్కరించారు. అభిమానసంఘ నాయకులు ఏడిద బాబి, పడాల శ్రీనివాస్, వై.శ్రీను తదితరులు పాల్గొన్నారు.