స్థలం ప్రైవేట్‌ది.. సోకు కార్పొరేషన్‌ది...
- ప్రైవేట్ స్థలంలో దర్జాగా రోడ్డు నిర్మాణానికి శ్రీకారం
- కార్పొరేషన్ చర్యతో విస్తుపోయిన స్థల యజమాని
- ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆగిన నిర్మాణ పనులు
చిట్టినగర్ : కంచే చేను మేసిన చందంగా అక్రమ ఆక్రమణలు అడ్డుకోవాల్సిన కార్పొరేషన్ అధికారులే ప్రైవేట్ స్థలాన్ని కబ్జా చేసేందుకు సిద్ధమయ్యాయి. ఏకంగా అక్కడ రోడ్డు నిర్మాణానికి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. పనులు ప్రారంభించేందుకు కూడా సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న స్థల యజమాని పనులను అడ్డుకోవడంతో చేసిన తప్పిదాన్ని గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. లంబాడీపేట రాజీవ్‌శర్మనగర్‌లో పోతిన ఆదినారాయణ, పోతిన వెంకటేశ్వరరావు 1983లో 2020 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు.
చుట్టుపక్కల భారీ భవనాలు నిర్మాణాలు జరిగాయి. ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందడంతో పోతిన ఆదినారాయణ స్థలంలో నుంచి రోడ్డు నిర్మాణం చేసేలా స్థానికులు పావులు కదిపారు. అధికార పార్టీ నేతలను ఒప్పించి గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ స్థలంలో రోడ్డు నిర్మించేలా కార్పొరేషన్‌లో ఫైల్ కదిలించారు. దీంతో సుమారు రూ.4 లక్షల అంచనాలతో 9 అడుగుల వెడల్పు, 180 అడుగుల పొడుగుతో రెండు వైపుల రోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రెండు రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా రోడ్డుసైడ్ డ్రైయిన్ నిర్మాణానికి గోతులు తీయడంతో పాటు రాత్రికి రాత్రి కంకరను తోలించారు. శుక్రవారం సాయంత్రం స్థల యజమాని ఆదినారాయణతో పాటు ఆయన కుమారుడు వెంకటేశ్వరరావుకు విషయం తెలియడంతో హుటాహుటిన స్థలం వద్దకు చేరుకున్నారు.
అసలు పనులు ఎవరి ఆమోదంతో చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల స్థలాలను కార్పొరేషన్ కబ్జా చేయడంతో వెంటనే అధికారులను ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. పనుల గురించి ఏఈ సుబ్రహ్మణ్యాన్ని ఫోన్‌లో ప్రశ్నించగా స్థానికుల డిమాండ్ మేరకు పనులు జరుగుతున్నాయని పొంతన లేని సమాధానమిచ్చారు. దీంతో విషయాన్ని సర్కిల్-1 ఈఈ ఉదయ్‌కుమార్‌కు వివరించారు. దీంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించిన ఆయన వెంటనే పనులను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి రోడ్డు నిర్మాణంతో పాటు రోడ్డుకు తమ కుటుంబీకుల పేరు పెట్టేందుకు కార్పొరేషన్‌తో పాటు స్థానిక నేతలకు భారీగానే డబ్బు ముట్టచెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
కార్పొరేషన్ అత్యుత్సాహం
పశ్చిమంలోని పలు డివిజన్లలో రోడ్డు నిర్మాణం కోసం ఎన్నో ప్రాంతాల వాసులు ఎదురు చూస్తుండగా కార్పొరేషన్ అధికారులు ఈ రోడ్డు నిర్మాణానికే ఎందుకు ఆసక్తి కనబర్చారో ప్రశ్నార్థకంగా మారింది. రోడ్డు నిర్మిస్తున్న స్థలం ప్రైవేట్ వ్యక్తులకు చెందినదేనని కార్పొరేషన్ రికార్డుల్లో ఉన్నప్పటికీ ఎవరి ప్రయోజనాల కోసం రోడ్డు నిర్మిస్తున్నారో వేయి డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
మాస్టర్ ప్లాన్ ప్రకారం కార్పొరేషన్ రోడ్డు ఉన్నంత వరకు గతంలోనే అండర్ గ్రౌండ్ డ్రైయినేజీ పైపులు ఏర్పాటు చేయడమే కాకుండా రోడ్డు చివరి భాగంలో మ్యాన్‌హోల్స్ ఏర్పాటు చేశారు. తాజాగా వందలాది గజాల స్థలాన్ని ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేస్తుండటంతో ప్రయివేటు వ్యక్తుల స్థలాలకు ప్రభుత్వ శాఖల నుంచే ముంపు ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.