దర్శనానికి దారేది? | Planning to order? | Sakshi
Sakshi News home page

దర్శనానికి దారేది?

Published Sat, Feb 15 2014 2:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

Planning to order?

  •      రెండో రోజూ 6 గంటలకు పైగానే..
  •      క్యూ లైన్లలో భక్తుల బారులు
  •      మా వాళ్లకే ముందంటూ పోలీసులు
  •      సామాన్యులకు తప్పని తిప్పలు
  •      గంటల తరబడి ఆలస్యం
  •      ముఖ ద్వారం వద్దే మొక్కులు
  •  మేడారం, న్యూస్‌లైన్ బృందం :  సమ్మక్క కో... సారక్క కో... అంటూ భక్తిభావంతో ఉప్పొంగాల్సిన గద్దెల ప్రాంగణం పోలీసుల దౌర్జన్యం నశించాలి... పోలీసులు డౌ న్... డౌన్ నినాదాలతో శుక్రవారం దద్దరిల్లింది. పోలీసుల వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది.  భక్తులకు ఇబ్బందులు రానీయమంటూ రెండు నెలలుగా వంద కోట్లు ఖర్చు పెట్టి హడావుడి చేసిన అధికార యంత్రాంగం... తీరా సమయంలో పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా ఇద్దరు తల్లులు కొలువై ఉన్న రెండో రోజూ దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వచ్చింది.

    చంటి పిల్లలు, వృద్ధులు క్యూ లైన్లలో నరకయాతన పడ్డారు. తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. లైన్లలో ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది మహిళలు పిల్లలను తీసుకుని బయటకు వచ్చేశారు. ఆలయ ముఖం ద్వారం ఎదుటే కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు చల్లి, బంగారం కూడా అక్కడే సమర్పించి తల్లులను చూడకుండానే అసంతృప్తితో వెనుదిరిగారు. కొంతమంది క్యూ లైన్ల వద్ద ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కూడా వారి బంధువర్గం, ఉన్నతాధికారుల బంధువులు, కుటుం బాలకు సపర్యలు చేయడంలో నిమగ్నమై భక్తులను గాలికొదిలేశారు.
     
    అదే తీరు... దక్కని దర్శనం
     
    గురువారం ఉదయమే క్యూ లైన్లలో సంజయ్ అనే బాలుడు ఊపిరాడక చనిపోగా... 500 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. అయినప్పటికీ.. క్యూ లైన్లలో ఉన్న ఇబ్బందులను గుర్తించేందుకు అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం గంటల తరబడి నిలబడి ఉన్న వారికి మంచినీళ్లు కూడా అందించే వారు కరువయ్యారు.

    పోలీసులు లేకపోవడం, క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులు పడుతుండడంతో.. ఎమ్మెల్యే సీతక్క సాయంత్రం 5.30 గంటలకు స్వయంగా వచ్చి గద్దెల వద్ద మైక్‌లో పోలీసులు రావాలని పదేపదే కోరారు. ఎట్టకేలకు ఐజీ రవిగుప్తా వచ్చి భక్తులను ముందుగా చెదరగొట్టారు. రూరల్ ఎస్పీ కాళిదాసుతో సహా సీఆర్‌పీఎఫ్ బలగాలు భక్తులను విసురుగా వెనక్కి నెట్టారు. దీంతో కలసివచ్చిన భక్తులు చెల్లాచెదురయ్యారు. ఒకరి కోసం ఒకరు ఆతృతగా వెతుకుతూ కనిపించారు. సర్వ దర్శనం లైన్‌లోని భక్తులు ఓపిక నశించి వీఐపీ దర్శనం బారికేడ్లు కింద పడేసి అటు వైపు వెళ్లారు.
     
    ముందుగా మా సేవ..

     సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించేం దుకు పోలీసుల కుటుంబ సభ్యులు సైతం బారులుదీరారు. దీంతో పోలీసులు కూడా వారి బంధువులు, ఉన్నతాధికారుల బంధువర్గాన్ని ప్రత్యేక దర్శనం లైన్‌లో తీసుకెళ్లారు. ఉదయం నుంచి భక్తుల ఇబ్బందులను పట్టించుకోని పోలీసులు... వారి బంధువర్గం సేవలో మా త్రం నిమగ్నమయ్యారు. బారికేడ్ల నుంచి తప్పించుకుంటూ తీసుకెళ్లి దర్శనం చేయించారు.  
     
    బంగారం కోసం పరుగులు

     మొక్కులు చెల్లించిన తర్వాత గద్దెల వద్దే బంగారం (బెల్లం) తీసుకోవడం ఆనవాయితీ. అయితే బంగారం తీసుకోవడానికి భక్తులు ఎక్కువగా అక్కడే ఉంటున్నారనే కారణంతో... గద్దెల వద్ద కాకుండా బయట ప్రత్యేకంగా విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ... దీనిపై ఎలాంటి ప్రచారం చేయడం లేదు. రెండు గంటలకోసారి మైక్‌ల్లో చెప్పి వదిలేస్తున్నారు. దీంతో ప్రసాదం కోసం  భక్తులు గద్దెల వద్దే కొంత సమయం ఉంటున్నారు. ఫలితంగా క్యూ లైన్ల వేగం మందగిస్తోంది. పోలీసులు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం భక్తుల ఇబ్బందులను తొలగించలేకపోయింది.
     
     భక్తులకు సేవలు అందిస్తున్నాం
     జాతరకు వచ్చిన భక్తులకు అధికారులు సేవలందిస్తున్నారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. భక్తుల ఇబ్బందులు తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
     - సంజీవయ్య, ఏజేసీ, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ   
     
     పొద్దుగాల పోతే గిప్పుడచ్చినం
     అమ్మలకు మొక్కులు చెల్లించుకోవడానికి పొద్దుగాల లైన్లకు పోతే గిప్పుడు బయటకు వచ్చినం. తాగుదామంటే నీళ్లు కూడా దొరకకపాయె. క్యూ ముందుకు కదలకపోవడంతో అవస్థలు పడుతూనే అందులో ఉండాల్సి వచ్చింది. అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
     - బంగారు మహేశ్వరి, ఖమ్మం  
     
     రోడ్లపైనే పడిగాపులు
     మొక్కులు చెల్లించుకోవడానికి క్యూలైన్ వద్దకు వస్తే రోడ్డుకు ఇరువైపులా భక్తులు ఉండడంతో షాపులకు వేసిన షెడ్ల వద్ద సేదదీరుతున్నాం. రద్దీ తగ్గితే వెళ్దామని అనుకుంటున్నాం. వీవీఐపీ, వీఐపీ, సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్లు కిక్కిరిసిపోవడంతో రోడ్లపైనే ఎండలో అవస్థలు పడుతున్నాం.
     - కీర్తి మధుకర్, చెన్నూరు, ఆదిలాబాద్
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement