సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :కాలుష్య నివారణకు, తరిగిపోతున్న వనాలపై దృష్టిసారించిన అటవీశాఖ అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆన్‌లైన్ ద్వారా మొక్కల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. అటవీశాఖ వెబ్‌సైట్‌లో వ్యక్తుల పేర్లు నమోదు చేసి, ఆధార్ కార్డు నంబర్ జతచేస్తే ఆయా వివరాల ఆధారంగా మొక్కల పంపిణీ చేపట్టి వివరాల్ని ప్రభుత్వానికి పంపించనున్నారు. దీని ద్వారా ఎన్ని మొక్కలు పంపిణీ చేశామో... తెలుసుకోవడమేగాకుండా... మొక్కల పెంపకంపై అందరిలోనూ అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వెబ్‌సైట్‌లో మొక్కల పెంపకం వల్ల ఉపయోగాలు, భవిష్యత్ తరాలకు వాటి వినియోగం వివరాల్ని పొందుపర్చారు. ఇలా ప్రతి ఇంటా మొక్కలు నాటించాలన్న ఏకైక లక్ష్యంపై ఈ సారి ఎలాగైనా కనీసం 1.24కోట్ల మొక్కల్ని నాటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విద్యాసంస్థలు, స్వచ్చందసంస్థలు, పరిశ్రమల్లో మొక్కలు నాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిశ్రమల నుంచి సీఎస్‌ఆర్ నిధుల ద్వారా మొక్కల ధర మొత్తాన్ని రాబెట్టుకునేందుకు చూస్తున్నారు. విద్యా, ఇతర సంస్థలకు మాత్రం ఉచితంగానే పంపిణీ చేయనున్నారు. ఏటా జూలై 1 నుంచి వారోత్సవాలు నిర్వహించడం పరిపాటే. ఈ సారి పుష్కరాల నేపథ్యంలో ఈ నెల 17నుంచి 66వ ‘వనమహోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి ఆన్‌లైన్ సహా భారీ ఎత్తున మొక్కలు నాటించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఏం చేస్తారు?
పాఠశాలలు, విద్యా సంస్థల్లో విద్యార్థుల్లో చెట్లపై మరింత చైతన్యం కల్పించేందుకు వారినీ భాగస్వాములు చేయనున్నారు. మండల స్థాయి అధికారులు ప్రతి పాఠశాల, విద్యా సంస్థ వివరాలతో పాటు విద్యార్థుల పేర్లు, ఆధార్‌కార్డు నంబర్ వివరాలు కూడా రప్పించాలని జిల్లా యంత్రాంగం ద్వారా కోరారు. బయటి వ్యక్తులు ఆన్‌లైన్ ద్వారా మొక్కలు కోరితే 17వ తేదీన పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయానికి వచ్చినా రిజిస్ట్రేషన్ ఫారం ఆధారంగా వివరాలు అందజేస్తామని భరోసా ఇస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, మునిసిపల్ విభాగాన్ని భాగస్వామ్యం చేసేందుకు పలాస, పాతపట్నం, టెక్కలి, పాలకొండ, శ్రీకాకుళం ప్రాంతాల రేంజ్‌ల్లో సుమారు 1.25లక్షల మొక్కలు నాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నీరు అవసరం లేని వేప, నేరేడు, విప్ప, పూలమొక్కలు, పనస, చింత, రెల్ల, మామిడి, సరుగుడు, టేకు, జీడి మామిడి, కానుగ, బాదం, చెర్రీ తరహా అన్ని రకాల మొక్కల్నీ జిల్లాలోని 38 ప్రధాన పరిశ్రమల్లో ఒక్కో సంస్థ ఆవరణలో కనీసం 1000 మొక్కల్ని నాటించనున్నారు. ఇందుకోసం సంస్థ యాజమాన్యం నుంచి మొక్కల రుసుంను వసూలు చేయనున్నారు. జిల్లాలోని 282 వన సంరక్షణ సమితు(సామాజిక వన విభాగం)ల ద్వారా ప్రపంచ బ్యాంకు నిధులతో మొక్కల పెంపకం చేపట్టనున్నారు.
విత్తునాటితే...
వీఎస్‌ఎస్‌ల ద్వారా మొక్కల పెంపకం చేపట్టి రిజర్వు ఫారెస్ట్ సహా అటవీభూముల్లో మొక్కల పెంపకాన్ని చేపడుతున్న అటవీశాఖ వీటిపై కూడా మరో కొత్త ప్రయోగం చేపట్టనుంది. వేలాది టన్నుల విత్తనాల్ని రప్పించి వారం వ్యవధిలో భూమిలో పాతించి మొక్కల పెంపకం చూడాలన్నది అధికారుల లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో ప్లాస్టిక్ బ్యాగుల్లో విత్తనం వేసి మొక్క తయారయ్యాక అడవుల్లో నాటేవారు. ఈసారి నేరుగా విత్తనాన్నే అటవీభూముల్లో వేయించేందుకు సిద్ధమయ్యారు. మొక్కల పెంపకంపై విస్తృత ప్రచారం చేపట్టేందుకు, ప్రజల్లో అవగాహన మరింత పెంచేందుకు ఈ సారి వనమహోత్సవంలో విశేష కృషి చేపట్టినట్టు డీఎఫ్‌వో విజయ్‌కుమార్ సాక్షికి తెలిపారు.
ఆన్‌లైన్‌లో మొక్కలు
Published Fri, Jul 10 2015 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement
Advertisement