పందాలేస్తే జైలుకే | Plea in high court seeks a ban on cockfights | Sakshi
Sakshi News home page

పందాలేస్తే జైలుకే

Published Tue, Dec 30 2014 12:49 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

పందాలేస్తే జైలుకే - Sakshi

పందాలేస్తే జైలుకే

 సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోడి పందాలపై కొరడా ఝుళిపిస్తామని జిల్లా ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామ్‌రెడ్డి స్పష్టం చేశారు. పందాలు నిర్వహించేవారు, ప్రోత్సహించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. సంక్రాంతి సీజన్‌లో ఎంతోమంది జీవితాలను రోడ్డుపాలు చేస్తున్న ఈ విపరీత ధోరణులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో కోడి పందాలు పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్న విషయూన్ని ‘సాక్షి’ ప్రతినిధి ఆయన దృష్టికి తీసుకువెళ్లగా పైవిధంగా స్పందించారు. పండగ రోజుల్లో కోడి పందాలకు బలయ్యే పందాల రాయుళ్ల జీవితాలే ఇతివృత్తంగా ఓ న్యాయవాది వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించిన హైకోర్టు పందాల నిర్వహణపై తీవ్రంగా స్పందించిందని ఎస్పీ చెప్పారు.
 
 పందాల నిర్వహణ చట్ట విరుద్ధమన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన పోలీస్ ఉన్నతస్థాయి సమావేశంలో డీజీపీ జేవీ రాముడు కోడి పందాల నిర్వహణను అడ్డుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ‘ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలోనే సంక్రాంతి రోజుల్లో కోడి పందాలు, జూదాల పేరిట రూ.కోట్లు చేతులు మారతాయి. ఈసారి ఇటువంటి పం దాలపై పోలీస్ యాక్షన్ పక్కాగా ఉం డాలి’ అని డీజీపీ ఆదేశాలిచ్చారని ఎస్పీ వెల్లడించారు. పండగ ముందు వరకు పోలీసులు ఇటువంటి హెచ్చరికలు జారీ చేయడం, పండగ చివరి మూడు రోజుల్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అనధికారిక అనుమతులు ఇవ్వడం షరా మామూలుగానే జరుగుతోంది కదా అని ‘సాక్షి’ ప్రతినిధి ప్రశ్నించగా.. ఈసారి అటువంటి పరిస్థితులకు తావులేదని ఎస్పీ తెగేసి చెప్పారు. ఇప్పటివరకు అధికార పార్టీ నేతల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవన్నారు. ఉన్నా సరే హైకోర్టు ఉత్తర్వులు, డీజీపీ ఆదేశాల నేపథ్యంలో ఎవరూ చేసేదేమీ లేదని వ్యాఖ్యానించారు.
 
 పందాల రాయుళ్లపై  బైండోవర్ కేసులు
 జిల్లావ్యాప్తంగా గతంలో కోడి పం దాల కేసులు ఉన్న వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా చాలామందిపై కేసులు పెట్టామని పేర్కొన్నారు. గేమింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయూల్టీ టువార్డ్స్ యాని మల్స్ యూక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు. కోడి పందాల బరులు ఏర్పాటు చేసేవారు, కోళ్లకు కత్తులు కట్టేవారు, పందెం కోళ్లు పెంచేవారితోపాటు పందాలను ప్రోత్సహించే వారిపై కూడా కేసులు పెడతామని చెప్పారు. పండగ సీజన్‌లో అప్పటి పరిస్థితులను బట్టి ముందస్తు అరెస్టులు కూడా చేస్తామన్నారు. ప్రశాంతమైన పండగ వాతావరణాన్ని కోడిపందాల రూపంలో కలుషితం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
 
 విలీన మండలాలకు
 అదనపు సిబ్బంది
 ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని పోలీస్ స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించుకోవాల్సిందిగా డీజీపీ జేవీ రాముడు ఆదేశాలిచ్చారని ఎస్పీ వెల్లడించారు. ఇందుకు సంబంధించి డీఐజీ పి.హరికుమార్  చేసిన ప్రతిపాదనలకు డీజీపీ ఆమోదం తెలిపారన్నారు. త్వరలోనే ఆయా మండలాల్లోని పోలీస్ స్టేషన్లను సందర్శించి అక్కడ ఏ మేరకు పోలీస్ సిబ్బంది అవసరమో గుర్తించి నియామకాలు చేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement