ముర్‌ు పర్ రహం కరో..!
ముర్‌ు పర్ రహం కరో..!
అరచేతిలో వైకుంఠం చూపడం అధికారులకు అలవాటే. సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తున్నామంటూ ప్రకటనల ద్వారా ప్రగల్భాలు పలకడం వారికి పరిపాటే. పలువురు పేదల జీవితాల్లో తొంగిచూస్తే అధికారులు చెప్పుకుంటున్నదంతా ఉత్తిదే అనిపిస్తుంటుంది.
నగరానికి చెందిన జాన్‌బీ పరిస్థితి అలాంటిదే. పుట్టుకతో మూగ అయినప్ప టికీ ఆమెను కనికరించే వారు కరువయ్యారు. ‘ముర్‌ు పర్ రహం కరో..’ (నాపై కరుణ చూపండి) అంటూ పలకని గొంతుకతో ఆమె వేడుకుంటోంది.
నగరంలోని ఆర్డీఓ కార్యాలయం సమీప హైమద్‌నగర్‌కు చెందిన జాన్‌బీ పుట్టుకతో మూగ. నిరుపేద కుటుంబంలో ఆమె 1978లో జన్మించింది. తండ్రి షేక్ హిదాయతుల్లా. బండరాళ్లు, కంకర సరఫరా చేస్తూ పిల్లలను పోషించుకున్నాడు. జాన్‌బీకి ఇద్దరు పిల్లలు. భర్త షేక్ మునీర్‌పాషా వెల్డింగ్‌షాపులో పనిచేస్తున్నాడు.
చాలీచాలని రోజువారీ వేతనంతో బతుకుబండిని లాగుతున్నాడు. జాన్‌బీకి వంద శాతం వైకల్యం ఉందంటూ 1990లో జిల్లా ప్రభుత్వాస్పత్రి సర్టిఫికెట్ మంజూరు చేసింది. అనంతరం ఆమెకు రైల్వే శాఖ రాయితీ పాస్ కూడా ఇచ్చింది. తనకు పింఛను కూడా ఇవ్వాలంటూ జాన్‌బీ అధికారులకు పలుమార్లు కోరింది. గ్రీవెన్స్‌సెల్‌లో దరఖాస్తు చేసుకుంది. అయినప్పటికీ పట్టించుకున్న దాఖలాలులేవు. ఈ నేపథ్యంలో ఎంపీ నామా నాగేశ్వరరావును కలిసి జాన్‌బీ తన గోడు వినిపించింది. భర్త పనిచేయగా వచ్చే డబ్బుతో కుటుంబం గడవడం కష్టంగా ఉందని, పిల్లల చదువులు భారంగా మారాయని సైగలతో వివరించింది. అయినా ఆమెకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో జాన్‌బీ కన్నీటి పర్యంతమవుతోంది.
తనకు పింఛను ఇప్పిస్తే ఆసరాగా ఉంటుందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. చివరకు వికలాంగుల శాఖ సంక్షేమ అధికారిని కూడా జాన్‌బీ కలిసిందని, అయినా పింఛను మంజూరు కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తన పట్ల ఇప్పటికైనా అధికారులు కనికరం చూపాలని జాన్‌బీ మూగభాషతో వేడుకుంటోంది.