పోలవరం.. భూకంప ప్రాంతం: కేసీఆర్ | Polavaram region earthquake region, says KCR | Sakshi
Sakshi News home page

పోలవరం.. భూకంప ప్రాంతం: కేసీఆర్

Published Mon, Mar 10 2014 4:50 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

పోలవరం.. భూకంప ప్రాంతం: కేసీఆర్ - Sakshi

పోలవరం.. భూకంప ప్రాంతం: కేసీఆర్

భారీ ప్రాజెక్టు వల్ల విపత్తులొస్తే నష్టం సీమాంధ్ర ప్రజలకే: కేసీఆర్
ముంపు ప్రాంతాల్లోని గిరిజనుల సంక్షేమానికి సీమాంధ్ర సర్కారుతో చర్చిస్తా
తెలంగాణలో జర్నలిస్టులకు పక్కాఇళ్లు, అక్రిడేషన్లు, బస్‌పాసులు ఇస్తాం
ఉద్యమకాలంలో జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని హామీ

 
 సాక్షి,హైదరాబాద్: దేశంలో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పోలవరం ఒకటని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. విద్వేషంతోనో, ఊహించో తాను ఈ మాట చెప్పడంలేదని, భూకంపాలు వచ్చే ప్రాంతాలపై కేంద్రం రూపొందించిన జాబితాలో పోలవరం ప్రాంతమూ ఉందన్నారు. భారీప్రాజెక్టు నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఏవైనా విపత్తులు సంభవిస్తే అందరికన్నా ఎక్కువ నష్ట పోయేది సీమాంధ్ర ప్రజలేనని చెప్పారు. సీమాంధ్ర రైతులు, ప్రజలకు తాము వ్యతి రేకం కాదన్నారు. గోదావరి మిగులు జలాలు సీమాంధ్ర ప్రజలు వాడుకోవాల్సిందేనని చెప్పారు. పోలవరం ముంపుప్రాంతాల్లోని గిరిజనుల సంక్షేమం, సంరక్షణ కోసం సీమాంధ్రలో ఏర్పడబోయే ప్రభుత్వంతో చర్చించి, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
 
 తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆవిర్భావ సభ ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగింది. టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ఎంతో కీలకపాత్ర పోషించారని చెప్పారు. జర్నలిస్టు మిత్రులంతా బలహీనవర్గాల జాబితా కిందకే వస్తారన్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారందరినీ జర్నలిస్టులుగా గుర్తిస్తామని, వారికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇస్తామని, పక్కాఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు, బస్‌పాసులు ఇప్పిస్తామన్నారు. జర్నలిస్టులకు రెండు బెడ్ రూమ్‌లు, ఒక హాలుతో కూడిన ఇంటిని నిర్మించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉద్యమ సమయంలో జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల సంఘానికి హైదరాబాద్‌లో అన్ని హంగులతో అధునాతన భవనాన్ని నిర్మిస్తామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా తెలంగాణలోని మిగిలిన జిల్లాలు నేటికీ వెనుకబడే ఉన్నాయని తెలిపారు.
 
 కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్‌ను సమర్థంగా అభివృద్ధిచేస్తే హైదరాబాద్ పరిధి, ఖ్యాతి మరింత విస్తరిస్తాయని, వ చ్చే ఇరువై ఏళ్లలో 50 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు ఇంకా వాటి ధోరణి మార్చుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో హైదరాబాద్‌లోని పరిశ్రమలన్నీ సీమాంధ్రకు తరలిపోయే అవకాశం ఉందంటూ కనీసం బిల్లు పూర్తిగా చదవకుండానే ఇష్టం వచ్చినట్లు కథనాలు వండివార్చుతున్నాయ ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సీమాంధ్రకు ఇచ్చిన రాయితీలు తెలంగాణకు కూడా వర్తిస్తాయని తెలిపారు. తెలంగాణ కోసం ఎన్నో అవమానాలు భరించానని, ఇక ఆంక్షలు లేని తెలంగాణ కోసం పోరాడతానని చెప్పారు. ఇకపై ఢిల్లీలో వచ్చేవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలేనన్నారు. వచ్చే ఎన్నికల్లో 17ఎంపీ సీట్లు సాధించి కేంద్రంనుంచి మరిన్ని నిధులు తెప్పించుకుని అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు.
 
 అధికారం కోసం ప్రత్యేక రాష్ట్రం తేలేదు:  జానారెడ్డి
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక అనేక మంది త్యాగాలు, పోరాటాలు, కష్టాలు, నష్టాలు ఉన్నాయని మాజీమంత్రి కె.జానారెడ్డి చెప్పారు. అధికారం కోసమే తాము ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నట్లు సీమాంధ్రకు చెందిన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది సరైనది కాదని అన్నారు.  జర్నలిస్టులు ఉద్యమంలో చూపిన తెగువే రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ చూపాలని ఆయన కోరారు.
 
 ఉద్యమకారుడు విచ్ఛిన్నకారుడెలా అవుతాడు?: అల్లం  
 ఏపీయూడబ్ల్యూజేకు చెందిన కొందరు పాత్రికేయులు తనను విచ్ఛిన్నకారునిగా ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమాన్ని ఏకం చేసిన ఉద్యమకారుడు విచ్ఛిన్నకారుడెలా అవుతాడని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రశ్నించారు. ఏ వ్యక్తికో, సంఘానికో తాను వ్యతిరేకం కాదని, సంఘాలను చీల్చాల్సిన అవసరం తెలంగాణ పాత్రికేయులకు లేదని చెప్పారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేందుకే టీయూడబ్ల్యూజేను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
 
  కార్యక్రమంలో  టీ-జేఏసీ చైర్మన్ కోదండరామ్, ఎంపీలు కేశవరావు, రాపోలు ఆనందభాస్కర్, ప్రజాగాయకుడు గద్దర్, సీపీఐ కార్యదర్శి నారాయణ, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎంటీవీ ఎడిటర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ టంకసాల అశోక్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, విఠల్, శ్రీనివాస్‌గౌడ్, కృష్ణయాదవ్, కళాకారులు విమలక్క, రసమయి బాలకిషన్, గోరంటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement