ఒంగోలు నగరంలో అధికార పార్టీ దిగజారుడు రాజకీయానికి దిగింది. ఓటమి భయంతో ఆ పార్టీ నేతలు విచక్షణ కోల్పోయారు. పోలీసుల అండతో పేట్రేగిపోయారు. స్థానిక కమ్మపాలెంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు అడ్డు తగిలారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు కార్యాలయ ప్రారంభానికి వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. నగరంలోని రెండవ పోలీస్ స్టేషన్ గేటు వద్దే పచ్చ పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగారు. పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలోనే వైఎస్‌ఆర్ సీపీ నేతలపై చెప్పులు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇద్దరు పోలీసులకు సైతం దెబ్బలు తగిలాయి. ప్రజాస్వామిక బద్ధంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి వెళతామని బాలినేనితో పాటు మిగిలిన నేతలు పదేపదే కోరినా పోలీసులు వినలేదు. చివరకు బాలినేనితో పాటు వైఎస్‌ఆర్ సీపీ నేతలను బలవంతంగా అరెస్టు చేసి టంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలినేని అరెస్టుకు నిరసగా వైఎస్‌ఆర్ సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. షేక్ సాధిక్ అనే కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అధికార పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలకు దిగగా పోలీసులు వారికి వంతు పాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికార పార్టీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఒంగోలు నగర పరిధిలో కొత్తపట్నం బస్టాండు సమీపంలోని కమ్మపాలెంలో సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. స్థానిక నేతలు ఇందుకు ఏర్పాట్లు చేశారు. కమ్మపాలెంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనిచ్చేది లేదని అధికార పార్టీ నేతలు హుకుం జారీ చేశారు. కాదు, కూడదు అని వస్తే అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగక ఉదయం నుంచే బాలినేనితో పాటు వైఎస్‌ఆర్‌సీపీ నేతలను రాకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు సైతం బాలినేని రాకముందే అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు. ఒంటిగంట సమయానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వేలాదిగా అనుచరగణంతో కొత్తపట్నం బస్టాండు సెంటర్‌కు చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలను సైతం రానివ్వమంటూ రోడ్డుపైకి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏఎస్పీ లావణ్య లక్ష్మితోపాటు పోలీసు అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను చూసిన టీడీపీ శ్రేణులు తొడలు కొట్టి, మీసాలు మెలివేసి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఫ్లెక్సీలు చూపిస్తూ సవాళ్లు విసిరారు. తేల్చుకుందామంటూ రెచ్చగొట్టారు.
అంతు తేలుస్తామంటూ హెచ్చరికలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు సైతం ఇందుకు ప్రతిస్పందించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. టీడీపీ శ్రేణులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా పోలీసులు నిశ్చేష్టులుగా చూస్తుండి పోయారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి వెళ్తామని, తనతోపాటు స్థానిక నేతలను మాత్రమే అనుమతించాలని బాలినేని పదేపదే విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఒక్కసారిగా అధికార పార్టీ కార్యకర్తలు చెప్పులు, రాళ్లతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులపై దాడులకు దిగారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు పలువురు పెద్ద ఎత్తున గాయపడ్డారు. ఇరువర్గాలకు మధ్యన ఉండడంతో కొందరు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి లాఠీలతో చితకబాదారు. ఈ దాడిలో మరి కొందరు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసుల అండ చూసుకుని అధికార పార్టీ కార్యకర్తలు సైతం వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై పలుమార్లు రాళ్లు, చెప్పులతో దాడికి దిగారు. సాక్షాత్తు 2 టౌన్ పోలీస్‌స్టేషన్ గేటు వద్దే గంటల కొద్ది అధికార పార్టీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డా పోలీసు అధికారులు, సిబ్బంది చోద్యం చూస్తూ గడిపారు. పైగా వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులపైనే దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయం ప్రారంభించుకునేందుకు అనుమతిస్తామంటూ పోలీసులు ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. దీనికి వైఎస్‌ఆర్‌సీపీ నేత బాలినేనితో పాటు మిగిలిన వారు అంగీకరించారు. అనంతరం వ్యూహాత్మకంగా పోలీసులు అధికార పార్టీ నేతలను అక్కడి నుండి తరలిస్తున్నట్లు చెప్పి ఒక్కసారిగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించి పార్టీ శ్రేణులను చెదరగొట్టి మాజీ మంత్రి బాలినేనితో పాటు మిగిలిన నేతలను అరెస్టు చేశారు. ఆ తర్వాత బాలినేనిని, కొందరు నేతలను కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆదిలోనే బాలినేనిని అడ్డుకునే కుట్ర: స్థానిక నేతల కోరిక మేరకు కమ్మపాలెంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించాలని మాజీ మంత్రి బాలినేని నిర్ణయించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సూచన మేరకు స్థానిక అధికార పార్టీ నేతలు కార్యాలయ ప్రారంభాన్ని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రే ఇందుకు వ్యూహం రచించారు. బాలినేని కమ్మపాలెం వచ్చే పక్షంలో దాడులకు తెగబడాలని వ్యూహం రచించారు. అనుకున్న మేరకు ఉదయాన్నే తన అనుచరగణంతో బాలినేని బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగిన పోలీసు అధికారులు బాలినేనిని అడ్డుకునేందుకు ఉదయమే ప్రయత్నించారు. ఇందులో భాగంగా సీఐలు రాంబాబు, గంగా వెంకటేశ్వర్లు, సుబ్బారావులు బాలినేని ఇంటికి వెళ్లారు. కమ్మపాలెం కార్యక్రమాన్ని విరమించుకోవాలని చెప్పారు. అనుమతి తీసుకుని కార్యక్రమం పెట్టుకున్నామని, కార్యక్రమాన్ని వాయిదా వేసేది లేదని బాలినేని తేల్చి చెప్పారు. బాలినేనిని హౌస్ అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికే వేలాదిగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు బాలినేని ఇంటి వద్దకు చేరడంతో పోలీసులు హౌస్ అరెస్టును విరమించుకుని వెళ్లిపోయారు.
పోలీసుల సమక్షంలోనే సంబరాలు..బాణాసంచా పేలుళ్లు
ఒక వైపు వ్యవహారం సద్దుమణుగుతుందని భావించిన క్రమంలో టీడీపీ నేతలు మరోమారు రెచ్చిపోయారు. ఎన్‌టీఆర్ బొమ్మ వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున బాణాసంచా పేలుళ్లతో సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో వారిని వారించడంలో వైఫల్యం చెందిన పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. ఈ క్రమంలో కుర్రకారు చేస్తున్న హడావుడిని అడ్డుకోబోయిన స్పెషల్ పార్టీ పోలీసులపై ఇరువురు యువకులు విరుచుకుపడ్డారు. దీంతో స్పెషల్ పార్టీ పోలీసులు చేతికి పనిచెప్పారు. ఇద్దరిని లాక్కుంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment