సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఓ పోలీస్ సెల్యూట్ కొట్టి... ‘సార్... నాకు మంచి డ్యూటీ ఇచ్చేందుకు ఈ ఇన్‌స్పెక్టర్ రూ.12వేలు లంచం అడుగుతున్నారు. మీరైనా న్యాయం చేయండి...’ అని ఓ కానిస్టేబుల్ ఆకస్మిక తనిఖీలకు వచ్చిన ‘బడా బాస్’ను వేడుకున్నాడు.
‘అసలేం అనుకుంటున్నావ్. నా ఎదుటే నిలబడి ఫిర్యాదు చేస్తావా... హౌ డేర్ యూ... సస్పెండ్ హిమ్...’- అని పక్కనే ఉన్న మరో అధికారిని పురమాయించారు బడా బాస్. ఇదీ ఈయన స్టైల్. తనను లంచం డిమాండ్ చేస్తున్నట్లు స్వయంగా కానిస్టేబుల్ మొరపెట్టుకుంటే విచారణకు ఆదేశించి.. సదరు ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన అధికారి రివర్స్ గేర్‌లో పిచ్చుక మీద బ్రహ్మస్త్రం విసిరిన తీరు జిల్లా పోలీసు విభాగంలో హాట్ టాపిక్‌గా మారింది. లంచగొండి అధికారిపై ఫిర్యాదు చేసినందుకు తనపై సస్పెన్షన్ వేటు పడనుండడంతో కానిస్టేబుల్ కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిల కొట్టుకుంటున్నాడు. ఇంతకీ బడా బాస్ ఆకస్మిక తనిఖీలకు ఎందుకొచ్చారు..? ఆరా తీస్తే మరో ఆసక్తికరమైన బ్యాంక్ గ్రౌండ్ ఉంది.
‘సార్ మీరు సమర్థవంతంగా పని చేస్తున్నారు. కానీ... మీ ఆఫీసులో మీ పేరు ఖరాబ్ చేస్తున్నారు. మీ పేరు చెప్పి మీ సీసీ లంచాలకు కౌంటర్ తెరిచారు. పోలీస్ స్టేషన్లకు తనిఖీలకు వెళ్లినప్పుడు మీకు తెలియకుండా వసూళ్లకు పాల్పడుతున్నాడు. ప్రొబేషనరీ ఎస్సైలను సైతం వదిలిపెట్టడం లేదని ప్రచారం జరుగుతోంది. స్పెషల్ బ్రాంచీ రిపోర్టు చేసింది...’ అని బడా బాస్‌ను అదే విభాగంలోని మరో బాస్ ఫోన్‌లోనే అలర్ట్ చేశారు. వెంటనే సొంత ఇంటిని చక్కదిద్దుకొని అవినీతి కౌంటర్‌ను బంద్ చేయించాల్సిన సదరు అధికారి మళ్లీ రివర్స్ గేర్‌లోనే వెళ్లారు. అసలు తానేంటో.. తన స్టైల్ ఏమిటో చాటిచెప్పి.. దడ పుట్టించేందుకు ఆకస్మిక తనిఖీలకు బయల్దేరారు.
ఇలాంటి రివర్స్ గేర్ చర్యలతో పాటు... వరుస అవినీతి ఆరోపణలతో ఈ బడా బాస్ పేరు ఇప్పటికే రాష్ట్ర స్థాయికి వెళ్లింది. పోలీసు విభాగంలో లోకల్ అభ్యర్థులకు తమ సొంత జిల్లాలో ఎస్సైలు, సీఐలు పోస్టింగ్ ఇచ్చిన దాఖలాలు లేవు. అదే జోన్‌లో పొరుగు జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వడం ఆనవాయితీ. కానీ.. తన కార్యాలయ సిబ్బంది పైరవీతో బడా బాస్ జిల్లాకు చెందిన ఓ ఎస్సైకి జగిత్యాల డివిజన్‌లోనే పోస్టింగ్ ఇవ్వడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎస్సైలే కాదు.. ఇటీవల ఓ క్లర్క్ సస్పెన్షన్‌ను పక్కన పడేయడం... అవినీతి ఆరోపణలపై జిల్లా నుంచి బయటకు పంపించిన ఒక ఆఫీసు సూపరింటెండెంట్‌ను ఇటీవల జిల్లా పోలీసు ఆఫీసులో తాను కోరిన సెక్షన్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం... ఇవన్నీ అటు అధికారుల స్థాయి నుంచి పోలీస్ కానిస్టేబుల్ వరకు అందరి నోటా నానుతున్నాయి.
పోలీస్ బాస్.. అంతా రివర్స్!
Published Fri, Dec 27 2013 3:40 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM
Advertisement
Advertisement