
గుంటూరు ఈస్ట్: ఆన్‌లైన్‌లో సెక్స్ రాకెట్ నడుపుతున్న ముఠా గుట్టు రట్టయింది. ఆన్‌లైన్‌లో అశ్లీల చిత్రాలు పెట్టి విటులను ఆకర్షించి వ్యభిచారం నడుపుతున్న ముఠాకు సంబంధించి నలుగురు నిర్వాహకులను ఇక్కడి కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు ఈస్ట్ డీఎస్పీ కండే శ్రీనివాసులు, కొత్తపేట ఎæస్‌హెచ్‌ఓ వంశీధర్‌లు శుక్రవారమిక్కడ విలేకరులకు వివరాలు వెల్లడించారు. విశాఖ కేంద్రంగా తిరుపతి, నెల్లూరు, గుంటూరులలో మధ్యవర్తులద్వారా ఈ సెక్స్‌రాకెట్ కొనసాగినట్టు తెలిపారు.
వివరాలివీ... విశాఖపట్నానికి ఇటంశెట్టి సూర్యవెంకట శివప్రసాద్ అలియాస్ బాలాజీ ఆన్‌లైన్ ద్వారా సెక్స్ రాకెట్ నిర్వహించే బడావ్యక్తుల వద్ద కొంతకాలం పనిచేశాడు. ఆ అనుభవంతో నాలుగు నెలలక్రితం గూగుల్‌లో ఓ వెబ్‌సైట్ తెరిచాడు. అందమైన అమ్మాయిలు అర్ధనగ్నంగా ఉన్న చిత్రాలు పెట్టి విటులను ఆకర్షించాడు. ఇందుకోసం పలు జిల్లాల్లో మధ్యవర్తులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆన్‌లైన్‌లో సంప్రదించినవారిని వారు కోరుకున్నచోట మధ్యవర్తులతో మాట్లాడించి ఏర్పాట్లు చేయించేవాడు. ఈనెల మొదటివారంలో ఆన్‌లైన్ ద్వారా సంప్రదించి వారు సూచించిన మేరకు గుంటూరులోని నెహ్రూనగర్‌లో వ్యభిచార గృహానికెళ్లి డబ్బులు మోసపోయిన ఓ వ్యక్తి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ నేపథ్యంలో పోలీసులు గుంటూరు నెహ్రూనగర్ 10వ లైనులోని ఓ ఇంటిపై ఈ నెల ఏడున దాడిచేసి నిర్వాహకులు అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు, అన్నపురెడ్డి ఆంజనేయులు, ఓరుగంటి సాయి భరత్‌లతోపాటు ఇద్దరు విటులు, ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. వారిని విచారించగా ఈ సెక్స్ రాకెట్ నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ప్రధాన సూత్రధారి సూర్యవెంకట శివప్రసాద్‌తోపాటు అన్నపురెడ్డి దుర్గా, అన్నపురెడ్డి పద్మావతి, గోవింద బుడ్డోళ్ళ సరోజలను పోలీసులు శుక్రవారం గుంటూరులోని రామిరెడ్డితోట వద్ద అరెస్టు చేశారు. తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో ఆన్‌లైన్‌తో సంబంధమున్న మధ్యవర్తులను కూడా అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నెల్లూరులోని ముఠా తప్పించుకుందని, త్వరలో వారినీ అరెస్టు చేస్తామని చెప్పారు.