సాక్షి, అమరావతి : రాజధాని అమరావతి ప్రాంతంలో అధికారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అమరావతి సాక్షిగా ఓ రైతుపై పోలీసులు దాష్టీకానికా పాల్పడ్డారు. రాజధానికి భూమి ఇవ్వని గద్దె మీరా ప్రసాద్ అనే రైతు పొలంలో రోడ్డు వేసేందుకు అధికారులు శనివారం ప్రయత్నించగా అందుకు అతడు అడ్డుకోవడంతో పోలీసుల దౌర్జన్యానికి దిగారు. రైతును బలవంతంగా ఈడ్చుకుంటూ వ్యాన్‌లోకి ఎక్కించి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ఈ పెనుగలాటలో మీరా ప్రసాద్ కిందపడిపోయి అస్వస్థతకు గురయ్యారు. అయినా నిర్దయగా వ్యవహరించిన పోలీసులు... అలాగే ఆయన్ని పట్టుకుని వ్యాన్ ఎక్కించారు. అంతేకాకుండా మీరా ప్రసాద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
చదవండి.....(నాకేం జరిగినా వాళ్లదే బాధ్యత: మీరా ప్రసాద్)
అనంతరం బెయిల్‌పై విడుదలైన మీరా ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నేను రాజధానికి భూమి ఇవ్వకపోయినా అధికారులు ఈరోజు నాపై దౌర్జన్యం చేసి...నా పొలంలో రోడ్డు వేశారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకున‍్నందుకు పోలీసులు నాపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఏమీ చేసినా నేను భయపడను. ఇవాళ పోలీసులు నాపట్ల అత‍్యంత దారుణంగా వ్యవహరించారు. నా అనుమతి లేకుండా పొలంలో రోడ్డు వేస్తూ నాపై దురుసుగా ప్రవర్తించారు. అధికారుల తీరుతో పాటు, నా మీద పెట్టిన అక్రమ కేసుపై కోర్టుకు వెళతాను. ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం. నాలుగేళ్ల నుంచి నా భూమిని కాపలా కాస్తూ కాపాడుకుంటూ వచ్చాను. కానీ ఇవాళ దౌర్జన్యం చేసి పొలంలో రోడ్డు వేశారు. దీనిపై పోరాటం చేస్తా. వదిలిపెట్టను. నన్ను ఎన్నిరోజులు జైల్లో పెడతారు. మళ్లీ బెయిల్ మీద విడుదల అవుతా. పోరాటం చేస్తాను. నా పొలాన్ని నేను దక్కించుకుంటా. ఎన్నికలు అయ్యేవరకూ ఉండి...ఇప్పుడు మళ్లీ నాటకాలు వేస్తున్నారు.’ అంటూ మీరా ప్రసాద్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment