ప్రేమికులపై పోలీసుల దాష్టీకం
గుంజిళ్లు తీయించిన వైనం యూట్యూబ్‌లో ప్రత్యక్షం
విచారణకు ఆదేశించిన వెస్ట్‌జోన్ డీసీపీ
సాక్షి, హైదరాబాద్: హీరోయిజం ప్రదర్శించే క్రమంలో విలన్లుగా నిలిచిన గోల్కొండ పోలీసుల వైనమిది. హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుతుబ్‌షాహీ సమాధులు (సెవెన్ టూంబ్స్) వద్ద ప్రేమ జంటలను బహిరంగంగా గుంజిళ్లు తీయించిన వైనం యూ ట్యూబ్‌లో ప్రత్యక్షం కావడంతో విచారణకు ఆదేశించారు. నాలుగురోజుల కిందట టూంబ్స్‌ను సందర్శించేందుకు పెద్దఎత్తున సందర్శకులు వచ్చారు.
అదే సమయంలో గోల్కొండ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ నయీముద్దీన్ జావిద్ తన సిబ్బందితో అక్కడికి వచ్చారు. అక్కడ కనిపించిన ప్రేమ జంటలను పిలిపించి రకరకాల ప్రశ్నలు వేశారు. అంతేకాకుండా అమ్మాయిలను బహిరంగంగా గుంజీళ్లు తీయించారు. అబ్బాయిలు ఒకరి చెవులను ఒకరు పట్టుకొని గుంజిళ్లు తీశారు. బాధితులు తమకు జరిగిన అవమానం, అన్యాయంపై సోమవారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, సమగ్ర విచారణ జరపాలని ఆసిఫ్‌నగర్ ఏసీపీని ఆదేశించినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు వెల్లడైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, గుంజీలు తీయించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.