
మార్కాపురం: నేర నియంత్రణే లక్ష్యంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పోలీసులు ముందుకెళ్తున్నారు. పశ్చిమ ప్రకాశంలో మొత్తం 13 పోలీసుస్టేషన్లు ఉండగా 8 పోలీసుస్టేషన్ల పరిధిలో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సర్కిల్స్ ఉండగా వీటిలో మార్కాపురం పట్టణం, కంభం, గిద్దలూరు, బేస్తవారిపేట, యర్రగొండపాలెం, పెద్దారవీడు, త్రిపురాంతకం, దోర్నాల పట్టణాల్లో పోలీసుల ఆధ్వర్యంలో సుమారు 150కిపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఇవిగాక రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నుంచే మార్కాపురం, గిద్దలూరు పట్టణాల్లో జరిగే సంఘటనలు గమనించేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. మార్కాపురం పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో 74 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా అల్లూరి పోలేరమ్మ గుడి నుంచి ఎస్వీకేపీ కళాశాల వరకు, జవహర్ నగర్ కాలనీ నుంచి నాగులవరం రోడ్డు వరకు, కంభం రోడ్డు నుంచి శ్రీనివాస థియేటర్ వరకు ప్రతి 50 అడుగులకు ఒక సీసీ కెమెరా బిగిస్తున్నారు.
ఇవీ..ఉపయోగాలు
ప్రధానంగా నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, ఈవ్‌టీజర్స్ ఆటకట్టించడం, దొంగతనాలు నివారించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను తెలుసుకోవడం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో బిగించారు. మార్కాపురం, గిద్దలూరు, దోర్నాల, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లో వ్యాపారం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, క్లాత్ షాపులు, బంగారు దుకాణాల వద్ద కెమెరాలు అమర్చారు.
కనిపిస్తున్న ఫలితం
ఆయా ప్రాంతాల్లో పోలీసులు ఏర్పాటు చేసిన కెమెరాలు నేరాలను నియంత్రించేందుకు, నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. నాలుగు రోజుల కిందట పుల్లలచెరువు మండలం నరజాముల తండా వద్ద కారు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. కారు నంబర్ తెలియకపోవడంతో పుల్లలచెరువు నుంచి యర్రగొండపాలెం వచ్చే రోడ్డులో ఉన్న సీసీ కెమెరా ద్వారా కారును గుర్తించి మార్కాపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్నారు. మూడు రోజుల కిందట యర్రగొండపాలెంలో ఒక వస్త్ర దుకాణానికి వెళ్లి చీరాలకు చెందిన మహిళలు 20 చీరలు దొంగిలించి వెళ్తుండగా కుంట వద్ద పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో కంభం మండలం తురిమెళ్ల వద్ద ట్రాక్టర్ దొంగతనం జరగ్గా సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను కడపలో పట్టుకున్నారు. సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రిస్తున్నారు.
ఆరు రకాల కెమెరాల ఏర్పాటు
మార్కాపురం సబ్ డివిజన్‌లో వివిధ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఇందులో 6 రకాలు ఉన్నాయి. ప్రధానంగా వాహనాలపై ఉన్న నంబర్ ప్లేట్లు, వాహనాలు నడిపే వారి ముఖాలు గుర్తించే కెమెరాలు ఏర్పాటు చేశాం. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్, పేషియల్ రికగ్నైజేషన్ వంటి రకాలు ఉన్నాయి. వీటితో పాత నేరస్తులను కూడా సులభంగా గుర్తించవచ్చు. దొంగతనాలు, అల్లర్లకు పాల్పడిన వారి వివరాలు సీసీ కెమెరాల్లో నమోదైతే స్పష్టంగా కనిపిస్తాయి. నేర నియంత్రణ సులభమవుతుంది. – రామాంజనేయులు, డీఎస్పీ, మార్కాపురం
Comments
Please login to add a commentAdd a comment