సాక్షి, గుంటూరు : జిల్లాలో పోలీస్ అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. తమ వారికి అనుకూలంగా వ్యవహరించాలంటూ ఒక వైపు అధికారపార్టీ నేతలు ఒత్తిళ్లు, మరోవైపు నిక్కచ్చిగా విధులు నిర్వర్తించాలంటూ ఎస్పీల ఆదేశాలు. ఉన్నతాధికారుల ఆదేశాలతో చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొంత మంది పోలీస్ అధికారులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతుండటంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. కొందరు వారికి భయపడి రాజీ పడుతుండగా, మరికొందరు సీఐలు, ఎస్సైలు మాత్రం వారితో రాజీ పడలేక సిక్‌లీవ్‌లు, లూప్‌లైన్ పోస్టుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఓ హత్య కేసులో తాము చెప్పిన వారిని ఇరికించలేదనే కొపంతో అధికార పార్టీ ముఖ్యనేత ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని తట్టుకోలేక నరసరావుపేట రూరల్ సీఐ శోభన్‌బాబు సిక్‌లీవ్ పెట్టారు.
పిడుగురాళ్ల రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి సైతం సిక్‌లీవ్ పెట్టేందుకు ప్రయత్నించగా ఉన్నతాధికారులు వారించినట్లు సమాచారం. ఇదే దారిలో రూరల్ జిల్లాకు చెందిన నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు సిక్‌లీవ్‌లో వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. జిల్లాలోకి అడుగుపెట్టినప్పటి నుంచి రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీరియస్‌గా దృష్టి సారించడంతో నెలవారీ మామూళ్లకు అలవాటుపడిన కొందరు పోలీసు అధికారులకు కంటిమీద కునుకు లేదు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించి ఏ ఏరియాలోనైతే అక్రమ రవాణాకు సహకరిస్తారో ఆ పోలీస్‌స్టేషన్ అధికారిని బాధ్యులుగా చేస్తూ చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటికే ఇసుక, బియ్యం అక్రమ రవాణాదారులు, క్రికెట్ బెట్టర్లకు సహకరిస్తున్నారనే కారణంతో అనేక మంది సీఐలు, ఎస్సైలపై వీఆర్, సస్పెన్షన్ వేటు వేశారు. అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ కూడా నగరంలో వ్యభిచార గృహాలు, క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలు, సింగిల్ నంబర్ లాటరీ వంటి అక్రమార్కులతో చేతులు కలిపితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేయడంతో ఉలిక్కిపడుతున్నారు. ఇప్పటి వరకు బియ్యం, ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న చీకటి వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్న అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొందరు పోలీసు అధికారులు మాత్రం అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్పీలు సీరియస్‌గా ఉన్నారని తాము చేయగలిగింది ఏమీలేదని కొందరు తేల్చి చెబుతున్నారు.
మేం చెప్పినట్లు చేయాల్సిందే ....
ఇదిలాఉంటే అధికార పార్టీ నేతలు మాత్రం పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చాం.. మా కార్యకర్తలు గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. ఇప్పుడైనా వారికి అనుకూలంగా పనులు చేయకపోతే ఎలా.. పెద్ద పనులైతే ఎస్పీలతో మేం మాట్లాడతాం... చిన్నచిన్న పనులు కూడా చేయకపోతే ఎలా ఊరుకుంటాం.. మా మాట వింటేనే ఇక్కడ ఉండండి.. లేదంటే సెలవుపెట్టి వెళ్లిపోండి.. ఇదీ పోలీస్ అధికారులపట్ల అధికారపార్టీ నేతల తీరు. దీంతో విసిగిపోయిన కొందరు పోలీస్ అధికారులు ఈ ఉద్యోగాలు మాకొద్దు బాబోయ్ అంటూ సెలవుపై వెళ్లిపోతున్నారు.
అడకత్తెరలో పోలీస్ అధికారులు
Published Fri, Feb 27 2015 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement
Advertisement