వెలగపూడిలో పోలీసు జులుం
వైఎస్సార్‌సీపీ, సీపీఎం నేతల అరెస్టు
సాక్షి, విజయవాడ బ్యూరో/తుళ్లూరు: గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక ఏపీ సచివాలయ నిర్మాణ ప్రాంతంలో బుధవారం మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయ నిర్మాణ పనుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడు దేవేందర్ దుర్మరణం పాలైన ఘటన వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ, సీపీఎం నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధులను రోడ్డుపైకి నెట్టేశారు. కార్మికుల సమస్యలు తెలుసుకోవడం తన బాధ్యతని గౌతమ్‌రెడ్డి అనడంతో డీఎస్పీ వాగ్వాదానికి దిగారు. పోలీసులు నేతలను ఇష్టానుసారంగా ఈడ్చేసి వ్యాన్‌లో పడేశారు. పి.గౌతమ్‌రెడ్డి, పి.మధు, ఇతర వామపక్ష నేతలను అరెస్టు చేసి, మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలీస్ స్టేషన్ వద్ద కార్యకర్తల ధర్నా
కార్మికులకు మద్దతు తెలపడానికి వెళ్లిన నేతలను అరెస్టు చేయడం తగదని వైఎస్సార్‌సీపీ, సీపీఎం శ్రేణులు మంగళగిరి పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో 2గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది.
పేదల పక్షాన పోరాడుతాం
పేద కార్మికుల పక్షాన పోరాడుతామని వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. కాగా రాష్ర్టం సీఎం చంద్రబాబు జాగీరా? ప్రజలను బతకనివ్వరా? ఇతర పార్టీల నేతలను ఎక్కడికీ వెళ్లనివ్వారా? అని పి.మధు ప్రశ్నించారు. పోలీసుల తీరును ఎండగట్టారు.