పోలీసు ‘పవర్’ | police power favour to congress | Sakshi
Sakshi News home page

పోలీసు ‘పవర్’

Published Mon, Mar 31 2014 11:46 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

police power favour to congress

ఆలూరు రూరల్, న్యూస్‌లైన్: అత్తారింట్లో ప్రజాదరణ కోల్పోయిన మహిళా నేత పుట్టింట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. భర్త కేంద్ర మంత్రి కాగా.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విభజన నిర్ణయం నేపథ్యంలో ఆయనచే రాజీనామా చేయిస్తానని బహిరంగంగా స్థానిక ప్రజలకు మాటిచ్చిన ఆమె నిలబెట్టుకోలేకపోయారు.
 
ఈ పరిస్థితుల్లో రాజకీయ భిక్ష పెట్టిన డోన్ నియోజకవర్గాన్ని కాదని.. ఆలూరు నియోజకవర్గానికి మకాం మార్చారు కోట్ల సుజాతమ్మ. రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టేందుకు సిద్ధమవడం తెలిసిందే. జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కయిన కోట్ల కుటుంబం గెలుపు కోసం అధికార దర్పాన్ని పావుగా వాడుకుంటోంది. ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో అధికారగణంతో పాటు పోలీసు శాఖ సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తుండటం విస్తుగొలుపుతోంది.
 
తప్పు ఎవరు చేసినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకోవడం పరిపాటిగా మారింది. ఫలితంగా పచ్చని పల్లెల్లో ఫ్యాక్షన్ చిచ్చు రగులుతోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే నీరజారెడ్డితో కోట్ల కుటుంబానికి రాజకీయ వైరం ఉంది. గతంలో సుజాతమ్మ సోదరుడు నీరజారెడ్డిని ఓడించేందుకు తెరవెనుక పావులు కదిపారు. ఆ తర్వాత కూడా పలు విషయాల్లో ఆమెకు వ్యతిరేకంగా కోట్ల తీసుకున్న నిర్ణయాలను నీరాజరెడ్డి బహిరంగంగా ఎండగట్టారు.
 
వీటన్నింటి దృష్ట్యా రానున్న ఎన్నికల్లో సుజాతమ్మ ఓటమే ధ్యేయంగా నీరాజరెడ్డి తన రాజకీయ చతురత చాటుతారనే చర్చ జరుగుతోంది. దీంతో కోట్ల కుటుంబం ఆచితూచి అడుగులేస్తోంది. పోలీసులను తమ గుప్పిట్లో ఉంచుకుని ప్రత్యర్థులను అణచివేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు కుట్ర జరుగుతోంది.
 
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గెలుపొందేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆదివారం అరికెర గ్రామంలో చోటు చేసుకున్న ఘటన ఇందుకు బలం చేకూరుస్తోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య ఇక్కడ ఆధిపత్య పోరు సాగుతోంది. విషయం తెలిసీ కోట్ల సుజాతమ్మ ప్రత్యర్థి గ్రూపును వెంటబెట్టుకొని మరో గ్రూపు నివాసాల మధ్య ప్రచారానికి వెళ్లడం రాళ్ల వర్షానికి దారితీసింది. ఇదే అదనుగా పోలీసులు ఏకపక్షంగా వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులకు తమదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇవ్వడం గమనార్హం.
 
సీఐ, ఎస్‌ఐలు ఇద్దరూ కాంగ్రెస్ అనుకూలురే
ఆలూరు సీఐగా పని చేస్తున్న శంకరయ్య గతంలో వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందులలో పని చేశారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో వైఎస్‌ఆర్‌సీపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. అదేవిధంగా హాలహర్వి ఎస్‌ఐ ధనుంజయ పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి ఎస్‌ఐగా పని చేస్తున్న సమయంలో కోట్ల కనుసన్నల్లో పని చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిరువురి గత చరిత్ర నేపథ్యంలోనే కోట్ల ఏరికోరి ఆలూరుకు రప్పించుకున్నట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అరికెర ఘటనలో వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులను మాత్రమే టార్గెట్ చేసుకోవడం అందుకు బలం చేకూరుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement