వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంపై పోలీసుల దాడులు
⇒ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వేధింపులు
⇒ పోలీసులను ఉసిగొల్పి గందరగోళం సృష్టించే యత్నం
⇒ బలం లేకపోయినా అభ్యర్థులను నిలిపిన టీడీపీ
⇒ బహిరంగంగా క్యాంపులు నిర్వహిస్తూ కొనుగోళ్లు
⇒ పట్టించుకోని పోలీసు యంత్రాంగంపై విమర్శలు
కడప: స్థానిక సంస్థలనుంచి ఎమ్మెల్సీల ఎన్నిక నేపథ్యంలో అధికారపార్టీ వేధింపులు ముమ్మరమయ్యాయి. సంఖ్యాబలం లేకపోయినా అభ్యర్థులను బరిలోకి దింపి ప్రలోభాలతో గట్టెక్కాలనుకుంటున్న టీడీపీ అందుకోసం పోలీసులను రంగంలోకి దింపింది. ఉన్నతాధికారుల ఆదేశాలంటూ కడప పోలీసులు శనివారం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడులు చేశారు. కార్యాలయంలో డబ్బులు ఉన్నాయంటూ తమకు సమాచారం వచ్చిందంటూ ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండానే గందరగోళం సృష్టించారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తమ వాహనాల్లో వేగంగా వచ్చిన పోలీసులు కార్యాలయంలోని కంప్యూటర్లను, ఇతర సామగ్రితోపాటు, బీరువాలు, సోఫాలు, వ్యక్తిగత వస్తు సామగ్రిని కూడా వదలిపెట్టకుండా తనిఖీలు చేశారు.
ఏమీ దొరకకపోవడంతో వెనుతిరిగారు. ఈ దాడుల్లో కడప ఒన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ, రూరల్, అర్బన్ ఇన్‌చార్జ్ సీఐ బీవీ శివారెడ్డి, ఎస్‌ఐలు తాలూకా రాజరాజేశ్వర్‌రెడ్డి, ఒన్‌టౌన్ ఎస్‌ఐలు నాగరాజు, మస్తాన్‌బాషా, టూటౌన్ ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డిలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల అనంతరం ఒన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో డబ్బులు పంచుతున్నారనీ తమ ఉన్నతాధికారులకు సమాచారం వచ్చిందని, వారి ఆదేశాల మేరకు తనిఖీలు చేశామని చెప్పారు. అయితే ఎలాంటి డబ్బులు దొరకలేదనీ సమాధానమిచ్చారు. టీడీపీ బహిరంగంగా కొనుగోళ్లు జరుపుతున్నప్పటికీ వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై పోలీసులు దాడులు జరపడంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. అధికారపార్టీ నేతలే ఈ దాడులు చేయించారని ఆరోపిస్తున్నారు.
టీడీపీ అడ్డదారులు
వైఎస్సార్ జిల్లాలో 845 మంది స్థానిక ప్రజాప్రతినిధులుండగా అందులో 521 మంది వైఎస్సార్సీపీ మద్దతుదారులు న్నారు. అంటే వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, టీడీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబెట్టింది. తనకు బలం లేనప్పటికీ నయానో భయానో బెదిరించో భయపెట్టో డబ్బులు వెదజల్లో ఓట్లను కొని గెలవాలని భావిస్తోంది. నెల్లూరు, కర్నూలు జిల్లాలో నూ ఇదే పరిస్థితి. నెల్లూరు జిల్లాలో మొత్తం 844 మంది స్థానిక సంస్థల ప్రతినిధు లుండగా అందులో 446 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారులున్నారు.
ఇక కర్నూలు జిల్లాలో 1,075 మంది స్థానిక ప్రజా ప్రతినిధులుండగా అందులో 580మంది వైఎస్సార్సీపీ మద్దతుదారులు న్నారు. అయినప్పటికీ టీడీపీ అక్కడ అభ్యర్థులను నిలబెట్టి నానా అరాచకాలకు పాల్పడుతోంది. అందుకోసం టీడీపీ నేతలు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులను రకరకాల ప్రలోభా లకు గురిచేస్తున్నారు. బహిరంగంగా క్యాంపు లు నిర్వహిస్తూ కొనుగోళ్లు జరుపుతున్నారు. మంత్రులు మందీ మార్బలంతో రంగంలోకి దిగిపోయి దగ్గరుండి మరీ ఈ కార్య క్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రలోభాలకు లొంగని చోట బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయినా పట్టించుకోని పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడులు జరపడం చూస్తే అధికార పార్టీ అరాచకాలు ఏస్థాయికి చేరుకున్నాయో తెలుస్తూనే ఉంది.