ఆ రెండు రోజులూ.. సీటు కష్టమే | Poling Day RTC Rush Will Effect Exam Writers | Sakshi
Sakshi News home page

ఆ రెండు రోజులూ.. సీటు కష్టమే

Published Mon, Apr 1 2019 10:38 AM | Last Updated on Mon, Apr 1 2019 10:38 AM

Poling Day RTC Rush Will Effect Exam Writers - Sakshi

సాక్షి, బద్వేలు : పెద్ద పండుగ వచ్చిందంటే బస్సులో సీటు కోసం ముందస్తుగానే రిజర్వేషన్‌ చేసుకోవాలి. లేదంటే ప్రయాణానికి ఇక్కట్లే. అదనపు డబ్బులు చెల్లించాల్సిందే. ఇప్పుడు ఏ పండుగ ఉందనుకుంటున్నారా... ఏప్రిల్‌ 11... ఓట్ల పండుగ. రాష్ట్రంలో ఒకేసారి శాసనసభ, పార్లమెంట్‌ అభ్యర్థుల ఎన్నికలు జరిగే రోజు. ఈ నెల పదో తేదీన ఎన్నికల తేదీలను ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. మరుసటి రోజు నుంచి ఆర్టీసీ బస్సు సీట్ల రిజర్వేషన్లు ఊపందుకున్నాయి. చాలామంది హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చేం దుకు ముందస్తు రిజర్వేషన్లు ప్రారంభించారు.  
   
ఈ నేపథ్యంలో ప్రయివేట్‌  బస్సు ఆపరేటర్లు కూడా పదో తేదీ టిక్కెట్ల ధరలను అమాంతం రెండు నుంచి మూడు రెట్లు పెంచేశారు. అయినా ఓటు వేసేందుకు రిజర్వేషన్లు ఆగడం లేదు. బస్సులతో పాటు రైళ్లలో కూడా బెర్తులు ముందుగానే నిండిపోయాయి. ఓటర్లలో చైతన్యం పెరిగింది.  ఓటింగ్‌ శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. దీంతో పాటు ఎన్నికల కమిషన్, స్వచ్ఛంధ సంస్థలు, సెలెబ్రెటీలు సైతం ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. రాజకీయ చైతన్యం కూడా పెరిగింది. ఓటేసేందుకు యువత ఉత్సాహంగా ఎదురు చూస్తుండగా, ఇతరులు కూడా సొంతూళ్లలో ఓటు వేయాలని సిద్ధమవుతున్నారు.

పదో తేదీ సీటు గగనమే
11వ తేదీ పోలింగ్‌ సందర్భంగా పదో తేదీనే బయలుదేరి సొంతూళ్లకు రావడానికి సన్నద్ధమవుతున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రయివేట్‌ బస్సుల్లోను సీట్లకు గిరాకీ ఏర్పడింది. హైదరాబాద్‌ నుంచి కడపకు 26 ఆర్టీసీ బస్సులుండగా 20 బస్సుల్లో సీట్లు బుకింగ్‌ అయిపోయాయి. మిగిలిన సర్వీసుల్లో కూడా అరకొరసీట్లు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి వంటి ప్రాంతాలకు ఉన్న ఆర్టీసీ బస్సుల్లోనూ సీట్లు బుకింగ్‌ 90 శాతం అయింది. ఆర్టీసీ 50 వరకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులు
ప్రస్తుతం జిల్లాకు చెందిన  పలువురు హైదరాబాద్, విజయవాడ, విశాఫపట్నం వంటి సిటీలలో ఉద్యోగ శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 21న గ్రూపు–4 పంచాయతీ సెక్రటరీ ప్రిలిమ్స్‌ పరీక్ష ఉంది. పదో తేదీ బస్సుల్లో సీట్లు లేకపోవడంతో వారంతా 8, 9వ తేదీలలో ఇళ్లకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 11, 12 తేదీలలో కూడా రద్దీగా ఉండే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఓటు వేసేందుకు రావాలంటే నాలుగైదు రోజులు వృథా అవుతాయని వారు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష పది రోజుల ముందు ఉండటం కూడా ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు. పరీక్షను కొద్ది రోజులు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 15 వేల మంది గ్రూపు–4 అభ్యర్థులు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు.

ప్రయివేట్‌ ట్రావెల్స్‌ దోపిడి
ఇదే అదనుగా భారీ ఆర్జనకు ప్రయివేట్‌ ట్రావెల్స్‌ సిద్ధమయ్యాయి. 8 నుంచి ఛార్జీలను కొద్దిగా పెంచుతూ పదోతేదీకి పూర్తిస్థాయిలో పెంచేశాయి. హైదరాబాద్‌ నుంచి కడపకు తొమ్మిదో తేదీ రూ.1200 నుంచి రూ.1500 మధ్య ఉండగా పదో తేదీకి ఇవి రూ.1500 నుంచి రూ.2వేలకు చేరాయి. 10వ తేదీకి హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరుకు రూ.1000 నుంచి రూ.1500, రాయచోటికి రూ.1800 నుంచి రూ.2 వేలు, పోరుమామిళ్ల, బద్వేలుకు రూ.1200 నుంచి రూ.2 వేలకు చేరింది. బెంగళూరు, చెన్నై, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఓటర్లు తరలిరానున్నారు. ఇక్కడి నుంచి కూడా ట్రావెల్స్‌ టిక్కెట్ల ధరలను రెండింతలు పెంచేశాయి. 

టిక్కెటు ధర పెంచేశారు
ప్రయివేట్‌ ట్రావెల్స్‌ టిక్కెట్‌ ధరను పెంచేశాయి. ఓటు వేయడానికి వచ్చే విద్యార్థులు, ఉద్యోగ శిక్షణకు వచ్చిన అభ్యర్థులు దీంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ఇరుపార్టీలకు కీలకం కావడంతో ఓటర్లు కూడా ఆసక్తిగా ఓటేసేందుకు అసక్తిగా చూస్తున్నారు. – బాలగోపాల్‌రెడ్డి, మిద్దెల, కాశినాయన మండలం

ఆసక్తిగా ఉన్నాం
మేం ఉద్యోగ శిక్షణ కోసం వచ్చాం. ఓటింగ్‌ ముందు రోజు సొంతూళ్లకు వచ్చేం దుకు సిద్ధమవుతున్నాం. టిక్కెట్‌ ధరలు చూస్తే గుండె గుభేల్‌ మంటోంది. దీనిపై అధికారులు స్పందించాలి.    – గౌస్‌ బాష, 
పోరుమామిళ్ల

గ్రూపు–4 అభ్యర్థుల ఆందోళన
ఓటు వేసేందుకు వచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 వేల గ్రూపు–4 పరీక్షకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. నాలుగు రోజులు ఓటింగ్‌ నేపథ్యంలో రానుపోను నాలుగు రోజులుపైనే అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో మరోపది రోజులు పరీక్ష వాయిదా వేయాలి.– సుదర్శన్‌ రెడ్డి, బద్వేలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement