సమావేశంలో మాట్లాడుతున్న సబ్ కలెక్టర్ మహేష్‌కుమార్
సాక్షి, చంద్రగిరి రూరల్: నియోజకవర్గంలోని సెక్టోరల్ మేజిస్ట్రేట్‌లను 42 నుంచి 64కు పెంచామని, సమస్యాత్మక కేంద్రాలపై అవగాహన కలిగి ఉండాలని తిరుపతి సబ్ కలెక్టర్, చంద్రగిరి ఆర్‌ఓ మహేష్‌కుమార్ అన్నారు. ఆదివారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలోని తహసీల్దార్లు, సెక్టోరల్ అధికారులతో ఆయన సమావేశమై మండలాల వారీగా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించి 325 పోలింగ్ కేంద్రాలకు 42 మంది సెక్టోరల్ అధికారులను నియమించామని, అయితే కొంత ఇబ్బందులు తలెత్తడంతో మరో 22 మంది అదనంగా నియమించినట్లు తెలిపారు.
సెక్టోరల్ మేజిస్ట్రేట్‌లు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పట్టు సాధించాలని, సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించాలన్నారు. ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కలిగించి, పోలింగ్ శాతాన్ని పెంచాలన్నారు. పోలింగ్ కేంద్రాల వసతుల కల్పన, వికలాంగులకు ర్యాంపు ఏర్పాట్లు పూర్తి చేసి రోజువారీ నివేదికను ఇవ్వాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో జాగ్రత్తలు వహించి, సెక్టోరల్ అధికారులు పోలీసులతో సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు. ఈసీ సూచించిన సెక్టోరల్ అధికారులు విధులను అవగాహనతో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు హరికుమార్, సత్యనారాయణ, ముని, రామ మోహన్, శ్రీనివాసులు, దస్తగిరయ్య, జయరాములు, సబ్ కలెక్టర్ కార్యాలయ ఏఓ కిరణ్ కుమార్, డీటీలు లక్ష్మీనారాయణ, అశోక్ పిళ్‌లై ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment