రాజ్యసభకు ఆ ఆరుగురు.. | Polling underway for six Rajya Sabha seats in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు ఆ ఆరుగురు..

Published Sat, Feb 8 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

Polling underway for six Rajya Sabha seats in Andhra Pradesh

కేవీపీ, టీఎస్సార్, ఎంఏ ఖాన్ (కాంగ్రెస్), గరికపాటి, సీతారామలక్ష్మి (టీడీపీ), కేకే (టీఆర్‌ఎస్)లు ఎన్నిక
 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి రంగం నుంచి తప్పుకోవడంతో రాజ్యసభ ఎన్నికల్లో ఆరు స్థానాలకు అభ్యర్థుల ఎన్నిక  శుక్రవారం లాంఛ నంగా ముగిసింది. కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్, టీడీ పీ నుంచి గరికపాటి మోహన్‌రావు, తోట సీతారామలక్ష్మి, టీఆర్‌ఎస్ నుంచి కె.కేశవరావు (కేకే) ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజసదారాం శుక్రవారం రాత్రి విజేతలకు ధ్రువపత్రాలు అందించారు. అసెంబ్లీ కమిటీ హాల్-1లో శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. అసెంబ్లీలోని 294 స్థానాలకు గాను 15 ఖాళీగా ఉన్నాయి. ముగ్గురికి (సుమన్‌రాధోడ్, జనార్దన్ థాట్రాజ్, చెన్నమనేని రమేష్) ఓటు హక్కు లేదు.
 
 వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన 17 మందితో పాటు ఆపార్టీకి మద్దతిస్తున్న ఆరుగురు ఎమ్మెల్యేలు (ఆదినారాయణరెడ్డి, రాజన్నదొర, పినిపె విశ్వరూప్, మోపిదేవి వెంకటరమణ, కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి, కాటసాని రామిరెడ్డి), బీజేపీ, దాని అనుబంధ ఎమ్మెల్యేలు (కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎన్నం శ్రీనివాసరెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి), సీపీఎంకు చెందిన జూలకంటి రంగారెడ్డి ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మిగతా 248 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రథమ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఎంఏ ఖాన్‌కు 49, కేవీపీ రామచంద్రరావుకు 46, టి.సుబ్బిరామిరె డ్డికి 46, గరికపాటి మోహన్‌రావుకు 38, తోట సీతారామలక్ష్మికి 38, కేశవరావుకు 26 ఓట్లు వచ్చాయి.
  గురువారం రంగం నుంచి తప్పుకున్న తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి ఒక్క ఓటు కూడా రాలేదు. దీంతో తప్పింపు పద్ధతిలో ప్రథమ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే ఆదాల ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు ఆయన తన మొదటి ప్రాధాన్య ఓటును సుబ్బిరామిరెడ్డికి వేశారు. రెండో ప్రాధాన్య ఓటును కేవీపీకి వేయాలని ఆదాలకు సూచించినప్పటికీ, ఆయన ఆ ఓటును వినియోగించుకోలేదు. ఆరు స్థానాలకు ఆరుగురే బరిలో ఉండటంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సిన అవసరం లేకుండాపోయింది. ఎవరికెన్ని ప్రథమ ప్రాధాన్య ఓట్లు వచ్చాయో లెక్కించిన తర్వాత అధికారులు విజేతలను అధికారికంగా ప్రకటించారు. ఓట్లు వేసినప్పుడు తప్పితే మిగతా సమయంలో ఎమ్మెల్యేలను సైతం పోలింగ్ కేంద్రం, అసెంబ్లీ లాబీల్లోకి కూడా అనుమతించలేదు.
 
 తొలి ఓటు స్పీకర్‌దే
 ముందుగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీనియర్ మంత్రులు ఓట్లు వేశారు. అనారోగ్యంతో ఉన్న మణెమ్మకు సహాయకారిగా ఆమె కుమార్తె, పి.శంకర్రావుకు సహాయంగా సీఎల్పీ ఇన్‌చార్జి శ్రీకాంత్‌లు వారి సూచనల మేరకు ఓటు వేశారు. చిట్టచివరగా జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఓటు వేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ద్వితీయ ప్రాధాన్య ఓటును కె.కేశవరావుకు వేయగా, కొందరు తృతీయ ప్రాధాన్య ఓటును కేవీపీ రామచంద్రరావుకు వేశారు.
 
 గ్రూపులతో హడావుడి.. ఓటింగ్‌లో అందరూ ఒక్కటై
 రాజ్యసభ ఎన్నికల పొలింగ్‌కు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రూపులుగా విడిపోయి కొద్దిసేపు హడావుడి చేశారు. అయితే, ఓటింగ్‌కు వచ్చేసరికి అందరూ పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకున్నారు. ఎవరు ఎవరికి ప్రథమ, ద్వితీయ ప్రాధాన్య ఓట్లు వేయాలో పార్టీ నేతలు స్పష్టంగా నిర్దేశించారు. అనుబంధ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌తో కలుపుకొని కాంగ్రెస్ తెలంగాణ  ఎమ్మెల్యేలు 50 మంది ఉన్నారు. వీరిలో 46 మంది ఎం.ఎ.ఖాన్‌కు ప్రథమ ప్రాధాన్య ఓటు వేయాలని నిర్ణయించారు. దానం నాగేందర్, జయసుధలను కేవీపీ రామచంద్రరావుకు, కూన శ్రీశైలం గౌడ్, సుధీర్‌రెడ్డిలను టి.సుబ్బిరామిరెడ్డికి కేటాయించారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలతో కేవీపీ, సుబ్బిరామిరెడ్డిలకు ప్రథమ, ద్వితీయ ప్రాధాన్య ఓట్లు వేయించారు. ఓట్ల కేటాయింపునకు సీఎం శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు జూబ్లీహాల్‌లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలెవరూ ఈ విందుకు హాజరుకాలేదు. దీంతో సీఎం సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఓట్లు ఎవరికి ఎలా వేయాలో సూచనలు చేశారు.
  మరోవైపు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు గోల్కొండ హోటల్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాంతానికే చెందిన రాజ్యసభ అభ్యర్థులకే ఓటు వేయాలని నిర్ణయించారు. పార్టీ అభ్యర్థి విజయానికి పోగా మిగిలిన ఓట్లను టీఆర్‌ఎస్ అభ్యర్థికి వేయాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసి పీసీసీ అధ్యక్షుడు బొత్స అక్కడికి వచ్చారు. పార్టీ అభ్యర్థులకు మాత్రమే మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని, రెండో ప్రాధాన్య ఓటు ఎవరికీ వేయొద్దని సూచించారు. బొత్స వెళ్లిపోగానే టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.కేశవరావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు అక్కడికి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, జానారెడ్డి తదితరులతో చర్చించారు. కనీసం ఏడు లేదా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేశవరావుకు మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని నిర్ణయించారు. తీరా ఓటింగ్‌కు వచ్చేసరికి ఒక్కరు మినహా టీ ఎమ్మెల్యేలందరూ మొదటి ప్రాధాన్య ఓటును పార్టీ
 సూచించిన అభ్యర్థులకే వేశారు.
 
 మేయర్ పదవితో ఎంఐఎం ఓట్లు
 పోలింగ్ జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ఆవరణకు వచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓట్లు వేయకుండా తమ కార్యాలయంలోనే కూర్చున్నారు. దీంతో మంత్రులు జానారెడ్డి, సారయ్య, కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎ ఖాన్‌లు వారితో చర్చించారు. హైదరాబాద్ మేయర్ పదవిని పూర్తి కాలం ఎంఐఎంకే వదిలిపెడతామని, తమకు ఓటు వేయాలని కోరారు. చివరకు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు.
 
 జేపీ, చిన్నం రామకోటయ్య ఓటు టీడీపీకే
 టీడీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను మినహాయిస్తే అసెంబ్లీలో టీడీపీ బలం 75 మాత్రమే. అందులో సుమన్ రాథోడ్‌పై కోర్టు కేసు కారణంగా ఆమెకు ఓటు హక్కు లేకుండా పోయింది. మిగిలిన 74 మందికిగాను ఆ పార్టీ ఇద్దరు అభ్యర్థులకు 76 ఓట్లు వచ్చాయి. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య టీడీపీ అధికారిక అభ్యర్థికే ఓటు వేశారు. లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ కూడా టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో గరికపాటి, తోట సీతారామలక్ష్మిలకు చెరో 38 ఓట్లు వచ్చాయి. రాజ్యసభ సీటు ఇవ్వలేదని అలకబూనిన మోత్కుపల్లి నర్సింహులుకు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డిలు నచ్చజెప్పడంతో ఆయన ఆఖరి నిమిషంలో వచ్చి ఓటు వేశారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోలేదని, సీనియర్లకు న్యాయం చేయలేదని మోత్కుపల్లి విమర్శించారు.
 
 కేకేకు మొదటి ఓటేసిన ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే
 కాంగ్రెస్  తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల నుంచి ఎన్నో కొన్ని మొదటి ప్రాధాన్యత ఓట్లు ఆశించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కేకేకు ఆ ఆశ నెరవేరలేదు.  కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కరు మాత్రమే ప్రథమ ప్రాధాన్య ఓటు వేశారు. టీఆర్‌ఎస్ 16 (17లో చెన్నమనేనికి ఓటు హక్కు లేదు), సీపీఐ 4, ఆ పార్టీకి మద్దతిస్తున్న మరో నలుగురు టీడీపీ అసంతృప్తులు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కలిపి కేకేకు 26 మాత్రమే మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. మెదక్ జిల్లా గద్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నరసారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటేశారని ప్రచారం ఉంది. 42మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేకేకు రెండో ప్రాధాన్య ఓటు వేశారు. సీపీఐ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్య ఓటు మాత్రమే వినియోగించుకున్నారు.
 
 మీ సబ్‌కాంట్రాక్టర్ ఆదాల
 పోలింగ్ జరుగుతున్న సమయంలో టి.సుబ్బిరామిరెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఎదురుపడ్డారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా తనకే ఓటు వేశారని సుబ్బిరామిరెడ్డి గొప్పగా చెప్పబోతుండగా.. ‘‘చాల్లెండి. ఆయన మీ సబ్‌కాంట్రాక్టర్‌గా అనేక పనులు చేస్తున్నాడు. మీకు కాకుండా వేరే వాళ్లకు వేస్తాడా’’ అని వివేకానందరెడ్డి అనడంతో సుబ్బిరామిరెడ్డి మారు మాట్లాడలేదు.
 
 చెల్లని ఓట్లు ఎవరివి?
 కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరస్కరణ ఓటు వేశారు. నాలుగు ఓట్లు చెల్లలేదు. ఈ నాలుగూ ఎవరిదన్న విషయంపై పెద్ద చర్చే జరిగింది. గంగుల కమలాకర్‌రెడ్డి, హనుమంత్ షిండేలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడంతో వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోరాదని టీడీపీ ఎన్నికల అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అలాగే విద్యాసాగర్‌రావు, జేసీ దివాకర్‌రెడ్డిలు బ్యాలెట్ పత్రాలను అందరికీ చూపించినందుకు వారి ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలన్న డిమాండ్ వచ్చింది. అయితే ఎన్నికల అధికారులు టీడీపీ ఫిర్యాదుతోపాటు జేసీ, విద్యాసాగర్‌రావులపై వచ్చిన డిమాండ్‌లను తోసిపుచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాండ్రు కమల తొట్రుపాటు పడి ప్రాధాన్య ఓటును గుర్తించకుండానే వట్టి బ్యాలెట్ పత్రాన్ని బాక్సులో వేశారు. మరో ఎమ్మెల్యే నీరజారెడ్డి కూడా ఓటు వేయకుండా బ్యాలెట్ పత్రాన్ని బాక్సులో వేసినట్లు ప్రచార ం జరిగింది. బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ, ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్‌లు ప్రాధాన్య ఓటు కింద అంకెలు వేయకుండా టిక్కులు పెట్టడంతో వారి ఓట్లు చెల్లలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement