గోదావరిలో గరళం | Pollution Water Mixing In Godavari water | Sakshi
Sakshi News home page

గోదావరిలో గరళం

Published Mon, Mar 12 2018 12:44 PM | Last Updated on Mon, Mar 12 2018 12:44 PM

Pollution Water Mixing In Godavari water - Sakshi

పేపరుమిల్లు వదిలిన రసాయనాలు కలిసిన నీటి నుంచి వస్తున్న నురగ

సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం నగర ప్రజలు మంచినీరే తాగుతున్నారా? పేపర్‌ మిల్లు రసాయనిక జలాలు నేరుగా గోదావరిలో కలుస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. పేపర్‌మిల్లు వెనుక నుంచి గోదావరిలోకి  పెద్ద కాలువ ఉంది. ఇరువైపులా దట్టమైన చెట్లు, పొదల వల్ల ఆ కాలువ వెతికితే  తప్ప ఎవరికీ కనిపించదు. ఆ కాలువ నుంచి పేపర్‌ తయారీ అనంతరం విడుదలవుతున్న రసాయనిక జలాలు నేరుగా కోటిలింగాల ఘాట్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపు పక్కన నదిలో కలుస్తున్నాయి. నిరంతరంగా 10 హెచ్‌పీ(హార్స్‌పవర్‌) మోటారు ద్వారా ఎంత నీరు వస్తుందో ఆ స్థాయిలో 24 గంటల పాటు పేపర్‌ మిల్లు రసాయనిక వ్యర్థ జలాలు నదిలో కలుస్తున్నాయి. ప్రస్తుతం గోదావరిలో  ఇన్‌ఫ్లో లేకపోవడంతో నదీ జలాలు మరింత కలుషితమువుతున్నాయి.

23 వేల కిలో లీటర్ల నీటి వినియోగం
కోటిలింగాల ఘాట్‌ వద్ద నదిలో ఏర్పాటు చేసిన ఇన్‌టేక్‌ పాయింట్‌ నుంచి పేపర్‌ మిల్లు ప్రతి రోజూ 23 వేల కిలో లీటర్ల నీటిని ఉపయోగించుకుంటోంది. పేపర్‌ తయారీకి వివిధ దశల్లో సల్ఫర్‌ డై ఆక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వంటి దాదాపు 40 రకాల రసాయనాలను ఉపయోగించి అనంతరం ఆ నీటిని వెంకటనగరం పంచాయతీ పరిధిలోని లంకల్లో విడుదల చేస్తోంది. దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలోకి పైపుల ద్వారా అధికారికంగా వ్యర్థ జలాలను తరలిస్తోంది. అక్కడ ఇసుకలో రసాయనిక జలాలు కలిపేలా ఏర్పాట్లు చేశారు. అయితే అది ఎంత మేర అమలు జరుగుతుందోనన్నది ప్రశ్నార్థకమే. దానితోపాటు అనధికారికంగా కోటిలింగాల ఘాట్‌ ఇసుక ర్యాంపు వద్ద రసాయనిక వ్యర్థ జలాలను కలుపుతుండడంతో నది కలుషితం అవడంతోపాటు నగర ప్రజల తాగునీరు ఎంత మేరకు సురక్షితం అనేది ప్రశ్నగా మారింది. కోటిలింగాల ఘాట్‌ వద్ద ఉన్న 10 ఎంఎల్‌డీ ప్లాంటుతోపాటు మరో మూడు ప్లాంట్ల ద్వారా నగరంలోని దాదాపు 5 లక్షల మంది జనాభాకు ప్రతి రోజూ 65 మిలియన్‌ లీటర్లు (ఒక మిలియన్‌= 10 లక్షల లీటర్లు) నగరపాలక సంస్థ సరఫరా చేస్తోంది. వాటర్‌ ప్లాంట్లలో సాధారణ ప్రక్రియలో బ్లీచింగ్, క్లోరినేషన్‌ చేసి సరఫరా చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా రసాయనిక వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగిపోవని రసాయన శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వ్యర్థాలు నీటిలో కలిస్తే వచ్చే వ్యాధులు
పేపర్‌ తయారీ అనంతరం విడుదలయ్యే రసాయన వ్యర్థ జాలాలు తాగునీటిలో కలవడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులతోపాటు మానవ అవయవాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. సాధారణంగా తాగే నీటిలో పీహెచ్‌ విలువ ఏడు ఉండాలి. రసాయన జలాలు కలవడం వల్ల నీటి రంగు మారడంతోపాటు ఆ నీటిలో పీహెచ్‌ విలువ రెండు లేదా మూడుకు పడిపోతుంది. దీని వల్ల ఆ నీరు తాగిన వారిలో హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. జీర్ణకోశ, శ్వాసకోస వ్యాధులు, ఊపిరి తిత్తులు, కాలేయం, మూత్రపిండాలపై దుష్ప్రభావం పడుతుంది. క్యాన్సర్‌ వస్తుంది. కళ్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా జల చరాలు ఆ నీటిలో మనుగడ సాగించలేవు. బైలాజికల్‌ ఆక్సిన్‌ డిమాండ్‌ కలవడం వల్ల నీటిలోని చేపల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతిని క్రమంగా చనిపోతాయి. కోటిలింగాల ఘాట్‌ వద్ద రసాయన వ్యర్థ జాలాలు కలిసే ప్రాంతం చుట్టు పక్కల చేపలు సంచరించడంలేదు. మత్య్సశాఖ గతేడాది నవంబర్‌లో దాదాపు రెండు కోట్ల చేప పిల్లలను వేసినా అవి ఇక్కడ జీవించే అవకాశం లేకపోవడంతో పాపికొండలు,పోలవరం లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతాయనిమత్య్సకారులు చెబుతున్నారు.

వేట మానేశాం
నదిలో నీరు తేడా వల్ల చేపలు వాటిని తాగవు. దీంతో చేపలు పాపికొండలు, భద్రాచలం వైపునకు వెళ్లిపోతున్నాయి. అధికారులు చాలా చేపలు వదిలారు. కానీ మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. వేట మానేసి చాలా రోజులైంది. ఎవరిని అడగాలో తెలియదు.– బొడ్డు పోసయ్య, మల్లాడి ఆదినారాయణ,మత్స్యకారులు, కోలిటింగాల ఘాట్‌

తనిఖీ చేసి చర్యలు చేపడతాం
గోదావరిలో వ్యర్థనీటిని కలుపుతుండం మా దృష్టికి రాలేదు. పరిశీలించి చర్యలు చేపడతాం. మా సిబ్బంది ప్రతి నెలా తనిఖీ చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో అధికారులను రాజమహేంద్రవరం పంపిస్తాం.
– ఎ.రామారావునాయుడు,పర్యావరణ ఇంజనీర్, కాకినాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement