'పొలిటికల్ గెస్ట్‌హౌజ్‌గా ఖమ్మం ఎంపీ సీటు'
ఖమ్మం : కాంగ్రెస్లో ఖమ్మం లోక్సభ సీటు పొలిటికల్ గెస్ట్హౌజ్గా మారిందని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మం నుంచి ఇన్నాళ్లు ఇతర జిల్లాల నేతలే ఎంపీగా గెలిచారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేశారు. అధిష్టానం ఆదేశిస్తూ ఖమ్మం నుంచి పోటీ చేస్తానని ఆయన తెలిపారు.
పెద్ద మనసుతో టీఆర్ఎస్ను కలుపుకుని పోయేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పొంగులేటి అన్నారు. ప్రజలను గందరగోళపరిచేందుకే చంద్రబాబు నాయుడు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి బీసీలకే అంటున్నారని ఎద్దేవా చేశారు. బీసీలపై తీపీ ఉంటే సీమాంధ్ర సీఎం పదవి బీసీకి ఇవ్వాలని పొంగులేటి ఈ సందర్భంగా బాబుకు సూచించారు. మరోవైపు ఖమ్మం జిల్లా సీనియర్ నేత రేణుకా చౌదరి కూడా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ఆమె డిగ్గీ రాజాను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఖమ్మం ఎంపీ టిక్కెట్ కోసం రేణుకా ముమ్మర ప్రయత్నాలు చేసున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.