పేదలే పెట్టుబడి | Poor investment | Sakshi
Sakshi News home page

పేదలే పెట్టుబడి

Published Wed, Jul 30 2014 1:57 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

పేదలే పెట్టుబడి - Sakshi

పేదలే పెట్టుబడి

  • కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
  •   హైదరాబాద్ కేంద్రంగా  కార్యకలాపాలు
  •   ఐదుగురు సభ్యులను అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు
  •   పరారీలో కీలక నిందితుడు  సాయికుమార్
  •   తెరవెనుక పలువురు వైద్యులు, రాజకీయ నేతలు!
  •   ‘సాక్షి’ వరుస కథనాలకు విశేష స్పందన
  • సాక్షి ప్రతినిధి, విజయవాడ :  పేదల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్న కిడ్నీ రాకెట్ గుట్టురట్టయింది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠాతో సంబంధాలున్న ఐదుగురు నిందితులను మంగళవారం విజయవాడ పోలీసులు అరెస్టుచేశారు. వారిలో మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్, బాలాజీసింగ్, నాగసాయిదుర్గ, గొడవర్తి ఉమాదేవి, పృథ్వీరాజ్‌సింగ్ ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన సాయి కుమార్ ఈ రాకెట్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో కూడా కిడ్నీ రాకెట్ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెల్లడైంది. తన సంతకం ఫోర్జరీ చేశారని ఈ నెల 15వ తేదీన విజయవాడ అర్బన్ తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నీ రాకెట్ విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కిడ్నీ రాకెట్ ముఠా వ్యవహారంపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలకు విశేష స్పందన లభించింది.
     
    పేదలే లక్ష్యంగా...
     
    హైదరాబాద్‌లో నివసించే సాయికుమార్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను గుర్తించి వారికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు విక్రయించేలా పురమాయిస్తాడు. ఇదే తరహాలో పలువురు కిడ్నీలు విక్రయించాడు. కిడ్నీలు ఇచ్చేవారికి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఇచ్చేవాడు. మధ్యవర్తులకు రూ.15 వేల నుంచి రూ.20వేలు వరకు అందజేస్తాడు. మరోవైపు బాధితులను కూడా మధ్యవర్తులుగా మార్చుకుని సాయికుమార్ సొమ్ము చేసుకుంటున్నాడు. అతని కోసం పోలీసులు 15 రోజులు గాలించినా దొరకలేదు. సాయికుమార్‌తోపాటు మహావీర్ అనే వ్యక్తి, మరికొందరికి కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. త్వరలోనే కీలక నిందితులను పట్టుకొని కిడ్నీ రాకెట్‌ను ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.
     
    ఫోర్జరీ సంతకాల వెనుకా ఓ ముఠా..
     
    ఎవరి సంతకాలైనా ఫోర్జరీ చేసే ముఠా సభ్యులు కూడా కిడ్నీ రాకెట్‌లో భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరైనా కిడ్నీ ఇస్తామని చెప్పిన వెంటనే ఇందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను ఫోర్జరీ సంతకాలతో వారు సిద్ధం చేస్తారు. బాలాజీ సింగ్ తండ్రి దేవరాజ్, అన్న పృథ్వీరాజ్ సింగ్‌లు ఈ వ్యవహారాన్ని నడిపిస్తారని తేలింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అమ్మినందుకు గొడవర్తి ఉమాదేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమెకు కూడా ఈ కిడ్నీ రాకెట్ కేసుతో సంబంధం ఉన్నట్లు సమాచారం. నకిలీ పత్రాలను తయారు చేస్తారని తెలిసే ఈ డాక్యుమెంట్లు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
     
    తెరవెనుక బడాబాబులు!
     
    కిడ్నీ రాకెట్‌లో పలువురు రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు సమాచారం. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖ వైద్యులతో తనకు సంబంధాలున్నట్లు సాయికుమార్ తనతో పలుమార్లు చెప్పాడని బాలాజీసింగ్ విలేకరుల ఎదుట వెల్లడించడం ఇందుకు బలాన్నిస్తోంది. అయితే అంతకుమించి తనకు పూర్తి వివరాలు తెలియవని ఆయన చెప్పాడు. దీనిని బట్టి ఈ వ్యవహారంలో రాజకీయ నేతల హస్తం కూడా ఉన్నట్లు స్పష్టమతోంది. ప్రధానంగా ఓ బడా వైద్యశాలకు చెందిన కొందరు వైద్యులు ఈ వ్యాపారంలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహిస్తే కిడ్నీ రాకెట్ ముఠా సభ్యులు పూర్తిస్థాయిలో దొరికే అవకాశం ఉంది. తెరవెనుక చక్రం తిప్పుతున్న రాజకీయ, వైద్య ప్రముఖుల వ్యవహారం కూడా వెలుగులోకి వస్తుంది. ఎలాగైనా ఈ కేసులో నిందితులందరినీ పట్టుకుంటామని ఇన్‌చార్జి ఏసీపీ గుణ్ణం రామకృష్ణ, సీఐ సత్యానందం, ఎస్‌ఐ నరేష్ తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా పేదల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నందున వదిలేది లేదని వారు స్పష్టంచేశారు.
     
    బాధితుడే మధ్యవర్తిగా మారిన వైనం...
     
    తాను హైదారాబాద్‌లోని స్విమ్స్ ఆస్పత్రి వద్ద ఉండగా ఒకరోజు సాయికుమార్ కనిపించాడని, మాటామాట కలిపాడని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన బాలాజీ సింగ్ తెలిపాడు. కొద్దిసేపటి తర్వాత ఎవరైనా కిడ్నీలు దానం చేస్తే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తానని చెప్పాడని పేర్కొన్నాడు. అయితే దానం చేసేవారితోపాటు కిడ్నీలు అవసరమైన వారి బ్లడ్ గ్రూప్ ఒకటే అయి ఉండాలని తెలిపాడని వివరించారు. అరుదైన బ్లడ్ గ్రూపు ఉన్న వారికి ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తానని చెప్పాడన్నారు.

    అదే సమయంలో తన భార్య పద్మాసింగ్ కిడ్నీని రెండు లక్షల రూపాయలకు విక్రయించినట్లు బాలాజీసింగ్ వెల్లడించాడు. అప్పటి నుంచి తనకు పరిచయం ఉన్న వ్యక్తులతో మాట్లాడి కిడ్నీలు విక్రయించేలా చూస్తున్నానని తెలిపాడు. ఈ క్రమంలోనే విజయవాడలో కూలర్ల వ్యాపారం చేస్తున్న క్రాంతి దుర్గాప్రసాద్ పరిచయం కావడంతో కిడ్నీ ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పానని పేర్కొన్నాడు. ప్రస్తుతం చక్రవర్తి శ్రీనివాస్ అనే వ్యక్తికి కిడ్నీ కావాలని సాయికుమార్ చెప్పినట్లు తెలిపాడు.

    చక్రవర్తి శ్రీనివాస్ బ్లడ్ గ్రూపు ఓ పాజ్‌టివ్ కావడం, క్రాంతి దుర్గాప్రసాద్‌ది కూడా అదే గ్రూపు కావడంతో ఎంత డబ్బు అయినా ఇచ్చేందుకు చక్రవర్తి శ్రీనివాస్ వెనుకాడలేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన సత్య కిడ్నీ సెంటర్‌లో డయాలసిస్ పేషంట్‌గా ఉన్నట్లు చెప్పాడు. ఇప్పటివరకు తాను ఐదుగురి నుంచి కిడ్నీలు ఇప్పించినట్లు బాలజీసింగ్ వివరించాడు. స్విమ్స్‌లో ఒకరికి, హైదరాబాద్‌లోని సత్య కిడ్నీ సెంటర్‌లో మరో నలుగురికి కిడ్నీలు ఇప్పించానని తెలిపాడు. తనకు ఒక్కో కిడ్నీకి రూ.15 వేలు ఇచ్చాడని బాలాజీసింగ్ విలేకరుల ఎదుట వెల్లడించాడు.
     
    ఆర్థిక ఇబ్బందుల వల్లే కిడ్నీ అమ్మేందుకు సిద్ధం : క్రాంతి దుర్గాప్రసాద్
     
    ఆర్థిక ఇబ్బందుల వల్లే తాను కిడ్నీని విక్రయించుకునేందుకు సిద్ధమయ్యానని విజయవాడకు చెందిన మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ చెప్పాడు. తాను మొదట్లో ఆటో కొనుగోలుచేసి నడిపానని నష్టం వచ్చిందని తెలిపాడు. ఆ తర్వాత ఆటో విక్రయించి కూలర్ల వ్యాపారం ప్రారంభించగా, దానిలోనూ నష్టం వచ్చినట్లు పేర్కొన్నాడు. దీంతో కిడ్నీని అమ్ముకునేందుకు సిద్ధపడినట్లు వివరించాడు.  
     తాను కిడ్నీ అమ్మేందుకు తన భార్య అంగీకరించలేదని తెలిపాడు. అందువల్ల తన స్నేహితుడైన విజయవాడకు చెందిన సాయిలోకేష్ భార్య నాగసాయిదుర్గను తన భార్యగా చూపించేందుకు ఫోర్జరీ సర్టిఫికెట్లు తయారుచేసినట్లు పేర్కొన్నాడు. ఆ సర్టిఫికెట్ల సాయంతో ఆమె అంగీకారపత్రం రూపొందించి కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపాడు. చివరికి ఫోర్జరీ సర్టిఫికెట్ల వల్లే తాము ఇరుక్కున్నామని వెల్లడించాడు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement