కష్టాలు, కన్నీళ్లే.. తోడూనీడ! | poor people's problems | Sakshi
Sakshi News home page

కష్టాలు, కన్నీళ్లే.. తోడూనీడ!

Published Tue, Jun 24 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

కష్టాలు, కన్నీళ్లే.. తోడూనీడ!

కష్టాలు, కన్నీళ్లే.. తోడూనీడ!

వంగర(లక్ష్మీపేట):శుష్కించిన శరీరాలతో అస్థిపంజారాల్లో కని పిస్తున్న ఆ పండుటాకులను చూసే వారెవరికైనా గుండె బరువెక్కక మానదు. వారు పడుతున్న కష్టాలు వింటే కన్నీరు పెట్టక మానరు. అందులో ఒక పండుటాకు పేరు దూబ అప్పారావు(85), రెండో పండుటాకు పేరు పారమ్మ(80). వంగర మండలం లక్ష్మీపేట గ్రామానికి చెందిన ఈ భార్యాభర్తలను చూస్తే.. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అంటే ఇదేనని స్పష్టమవుతుంది. నిరుపేదలైన ఈ దంపతులకు పిల్లలు లేరు. వెనకాముందూ ఆస్తులు లేవు.. ఆదరించే వారూ లేరు. వయసులో ఉన్నప్పుడు కులవృత్తి అయిన చేనేత పని చేసుకుంటూ జీవనం సాగించారు. తర్వాత వయసు మీద పడింది. శ్రమకు శరీరం సహకరించలేదు. దాంతో పదేళ్ల నుంచి పని చేయలేకపోతున్నారు.
 
 తిండికి తిప్పలు
 పని చేయలేరు.. ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. ఫలితంగా నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లడం కష్టంగా మారింది. అంత్యోదయ కార్డు ఉండటంతో నెలకు 35 కేజీల బియ్యం, అప్పారావుకు నెలకు 200 రూపాయులు వృద్ధాప్య పింఛను వస్తున్నాయి. ఈ రెండే వీరికి జీవనాధారం. వాటితోనే ఒక పూట తింటూ రెండోపూట నీళ్లతో సరిపెట్టుకుంటున్నారు. దీంతో వారి శరీరాలు చిక్కి శల్యమయ్యాయి. ఆరోగ్యాలు క్షీణించాయి.
 
 పొట్టకొట్టిన సదరం
 పారమ్మకు పదేళ్ల క్రితం కళ్లు పని చేయకపోవడంతో చూపు కోల్పోయింది. దాంతో ఆమెకు వికలాంగ పింఛను వచ్చేది. అయితే సదరం ద్వారా వికలాంగులు గుర్తింపు పొందాలన్న నిబంధనతో ఆమె పెన్షన్ నిలిచిపోయింది. సదరం శిబిరానికి తీసుకువెళ్లేవారు లేక పోవడంతో లబ్ధిదారుల జాబితా నుంచి ఆమె పేరు తొలగించి ఏడాది క్రితం పింఛను నిలిపివేశారు.
 
 గూడూ కరువే
 ఉండేందుకు ఇళ్లంటూ లేదు. ఇంతకుముంద పగటి పూట చెట్టు నీడలో కాలక్షేపం చేసి రాత్రి పూట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తలదాచుకునేవారు. అయితే లక్ష్మీపేట మారణకాండ కేసు విచారణ కోసం ప్రభుత్వం ఈ పాఠశాలను ప్రత్యేక కోర్టుగా మార్చింది. దీంతో వృద్ధ దంపతులు ఆశ్రయం కోల్పోయారు. గ్రామం నుంచి కొందరు వలస వెళ్లగా ఖాళీగా ఉండి పాడుబడిన ఒక ఇంట్లో ప్రస్తుతం తలదాచుకుంటున్నారు.
 
 శరీరం సహకరించకున్నా భార్యకు సపర్యలు
 జవసత్వాలు ఉడిగిపోయాయి. సరైన తిండి లేదు. శరీరాలు అస్థిపంజరాల్లా తయారయ్యాయి. పైగా పారమ్మకు చూపు లేదు. అడుగు కూడా ముందుకు వేయలేని దుస్థితి. దాంతో అప్పారావుపై మరింత భారం పడింది. తన పనులతోపాటు భార్యకు అన్నీ తానే అన్నట్లు సేవ చేస్తున్నాడు. ప్రతి రోజు ఆమెకు కాలకృత్యాలు చేయించడం నుంచి అన్నం తినిపించడం వరకు అన్నీ తనే చేస్తున్నాడు.
 
 ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
 ఏ ఆధారం లేని అప్పారావు దంపతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఏ కష్టం వచ్చినా చిల్లిగవ్వ కూడా చేతిలో లేని పరిస్థితి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి వారిని ఆదుకోవాలని వీరిని దుస్థితిని చూసిన గ్రామస్తులు కోరుతున్నారు.        
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement