Laksmipeta
-
ఇల్లాలికి ప్రేమతో
కన్న కూతురికి గోరు ముద్దలు పెట్టినంత ప్రేమగా ఆయన ఆమెకు తినిపిస్తారు. చిన్న పాపకు లాల పోస్తున్నంత శ్రద్ధగా స్నానం చేయిస్తారు. కొత్త పెళ్లికూతురితో నడుస్తున్నట్టు జాగ్రత్తగా చేయి పట్టి నడిపిస్తాడు. ఆయన వయసు 85. ఆమె వయసు 82. వారి ప్రేమ వయసు దాదాపు 60 ఏళ్లు. తాళికట్టిన వేళ నుంచి ఆమే ఆయన ఊపిరి. చేయి పట్టిన నాటి నుంచి ఆయనే ఆమె లోకం. కష్టమైనా కలిసే అనుభవించారు. కన్నీరైనా కలిసే పంచుకున్నారు.పెళ్లి మంత్రాలకు అర్థం తెలీకపోయినా, ప్రతి మంత్రానికీ పరమార్థంగా బతుకుతున్నారు. మాటలకు అందని ఆ ప్రేమ, వర్ణణకు అందని ఆ ఆప్యాయత అక్షరాల్లో... వంగర మండలంలోని లక్ష్మీపేట గ్రామానికి చెందిన వంజరాపు సత్యంనాయుడు(85), వంజరాపు వరహాలమ్మ(82)ల కథ ఇది. కాలానికి అతీతంగా, ఊహలకు కూడా అందంగా, కష్టాలను కలిసి అనుభవిస్తూ జీవిస్తున్న ప్రేమికుల గాథ ఇది. లక్ష్మీపేట గ్రామాన్ని 2001లో మడ్డువలస ప్రాజెక్టు జాతికి అంకితం చేసే సమయంలో వీళ్లకు ఉన్న రెండెకరాలు పొలం ప్రాజెక్టు నీటిలో కలిసిపోయింది. దీంతో ఆ గ్రామాన్ని వీడి ప్రభుత్వం భూమికి మంజూరు చేసిన నష్టపరిహారంతో ఎం.సీతారాంపురంలో ఓ చిన్న శ్లాబు ఇంటిని నిర్మించుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఉన్న పొలాన్ని మడ్డువలసకు ఇచ్చేసిన తర్వాత వీరి స్థితి మారిపోయింది. అప్పటి వరకు కుటుంబాన్ని పోషిస్తూ వచ్చిన చిన్నకుమారుడు చనిపోయాడు. పెద్ద కుమారుడు ఇళ్లు విడిచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వీరిద్దరే ఒకరికి ఒకరు తోడుగా జీవిస్తున్నారు. కన్న కొడుకు వదిలేసిన తర్వాత వరహాలమ్మ చూపు కోల్పోయింది. అప్పటి నుంచి భర్తే ఆమెకు లోకమైపోయారు. ఉదయం లేచిన నాటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు కాలకృత్యాలు తీర్చడం, స్నానపానాలు చేయడం, మందులు ఇవ్వడం, వంట చేయడం, తినిపించడం వంటి పనులన్నీ ప్రేమగా చేస్తారు. అలా అని వీరు ధనవంతులేం కాదు. పింఛన్ ద్వారా వచ్చే వెయ్యి రూపాయలే వీరికి జీవనాధారం. ఆ డబ్బుతోనే బియ్యం, మందులు కొనుగోలు చేసుకుని రోజులు గడుపుతున్నారు. సత్యం నాయుడు గ్రామ పరిసర ప్రాంతాల్లో కట్టెలు తెచ్చి వంట చేస్తారు. ఓ చెయ్యి సక్రమంగా పని చేయకపోయినా కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ప్రేమంటే కానుకలు ఇవ్వడం కాదని, ప్రేమంటే తల్లిదండ్రులను విలన్లుగా మార్చడం కాదని, ప్రేమ వయసులో ఉండే వారి హక్కు కాదని రోజూ నిరూపిస్తున్నారు. అసలు సిసలు ప్రేమకు అర్థాల్లా ఉండే ఈ దంపతులు ఇప్పుడు కాసింత సాయం కోరుతున్నారు. కాసింత మెరుగైన తిండి, మరికాసింత నీడ కోరుతున్నారు. -
రెండు నెలల్లో లక్ష్మీపేటలో ప్రత్యేక కోర్టు
లక్ష్మీపేట(వంగర) : లక్ష్మీపేట గ్రామంలో రెండు నెలల్లో ప్రత్యేక కోర్టు ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సీబీసీఐడీ విభాగం డీఐజీ ఆలూరి సుందర్‌కుమార్‌దాస్ వెల్లడించారు. 2012 జూన్ 12వ తేదీన ఇరువర్గాల మధ్య జరిగిన మారణహోమంలో ఐదుగురు దళితులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పోలీస్ పికెట్ పాయింట్లను పరిశీలించి శాంతిభద్రతలపై ఆరా తీశారు. ప్రత్యేక కోర్టు నిర్వహణకు అవసరమైన నిధుల మంజూరుకు మార్గం సుగుమం కావడంతో ఏప్రిల్, మే నెలల్లో కోర్టు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 14 ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులున్నాయని..వీటి ద్వారా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విభాగంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం దళిత బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రేషన్, పింఛన్, గృహనిర్మాణ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. స్పందించిన డీఐజీ రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబుతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు డీఐజీ దళిత బాధిత కుటుంబాలకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు దేవానంద్‌శాంతో, సీహెచ్ పెంటారావు, సీఐ ఎంవీవీ రమణమూర్తి, ఎస్ఐ భాస్కరరావు ఉన్నారు. -
కష్టాలు, కన్నీళ్లే.. తోడూనీడ!
వంగర(లక్ష్మీపేట):శుష్కించిన శరీరాలతో అస్థిపంజారాల్లో కని పిస్తున్న ఆ పండుటాకులను చూసే వారెవరికైనా గుండె బరువెక్కక మానదు. వారు పడుతున్న కష్టాలు వింటే కన్నీరు పెట్టక మానరు. అందులో ఒక పండుటాకు పేరు దూబ అప్పారావు(85), రెండో పండుటాకు పేరు పారమ్మ(80). వంగర మండలం లక్ష్మీపేట గ్రామానికి చెందిన ఈ భార్యాభర్తలను చూస్తే.. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అంటే ఇదేనని స్పష్టమవుతుంది. నిరుపేదలైన ఈ దంపతులకు పిల్లలు లేరు. వెనకాముందూ ఆస్తులు లేవు.. ఆదరించే వారూ లేరు. వయసులో ఉన్నప్పుడు కులవృత్తి అయిన చేనేత పని చేసుకుంటూ జీవనం సాగించారు. తర్వాత వయసు మీద పడింది. శ్రమకు శరీరం సహకరించలేదు. దాంతో పదేళ్ల నుంచి పని చేయలేకపోతున్నారు. తిండికి తిప్పలు పని చేయలేరు.. ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. ఫలితంగా నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లడం కష్టంగా మారింది. అంత్యోదయ కార్డు ఉండటంతో నెలకు 35 కేజీల బియ్యం, అప్పారావుకు నెలకు 200 రూపాయులు వృద్ధాప్య పింఛను వస్తున్నాయి. ఈ రెండే వీరికి జీవనాధారం. వాటితోనే ఒక పూట తింటూ రెండోపూట నీళ్లతో సరిపెట్టుకుంటున్నారు. దీంతో వారి శరీరాలు చిక్కి శల్యమయ్యాయి. ఆరోగ్యాలు క్షీణించాయి. పొట్టకొట్టిన సదరం పారమ్మకు పదేళ్ల క్రితం కళ్లు పని చేయకపోవడంతో చూపు కోల్పోయింది. దాంతో ఆమెకు వికలాంగ పింఛను వచ్చేది. అయితే సదరం ద్వారా వికలాంగులు గుర్తింపు పొందాలన్న నిబంధనతో ఆమె పెన్షన్ నిలిచిపోయింది. సదరం శిబిరానికి తీసుకువెళ్లేవారు లేక పోవడంతో లబ్ధిదారుల జాబితా నుంచి ఆమె పేరు తొలగించి ఏడాది క్రితం పింఛను నిలిపివేశారు. గూడూ కరువే ఉండేందుకు ఇళ్లంటూ లేదు. ఇంతకుముంద పగటి పూట చెట్టు నీడలో కాలక్షేపం చేసి రాత్రి పూట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తలదాచుకునేవారు. అయితే లక్ష్మీపేట మారణకాండ కేసు విచారణ కోసం ప్రభుత్వం ఈ పాఠశాలను ప్రత్యేక కోర్టుగా మార్చింది. దీంతో వృద్ధ దంపతులు ఆశ్రయం కోల్పోయారు. గ్రామం నుంచి కొందరు వలస వెళ్లగా ఖాళీగా ఉండి పాడుబడిన ఒక ఇంట్లో ప్రస్తుతం తలదాచుకుంటున్నారు. శరీరం సహకరించకున్నా భార్యకు సపర్యలు జవసత్వాలు ఉడిగిపోయాయి. సరైన తిండి లేదు. శరీరాలు అస్థిపంజరాల్లా తయారయ్యాయి. పైగా పారమ్మకు చూపు లేదు. అడుగు కూడా ముందుకు వేయలేని దుస్థితి. దాంతో అప్పారావుపై మరింత భారం పడింది. తన పనులతోపాటు భార్యకు అన్నీ తానే అన్నట్లు సేవ చేస్తున్నాడు. ప్రతి రోజు ఆమెకు కాలకృత్యాలు చేయించడం నుంచి అన్నం తినిపించడం వరకు అన్నీ తనే చేస్తున్నాడు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు ఏ ఆధారం లేని అప్పారావు దంపతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఏ కష్టం వచ్చినా చిల్లిగవ్వ కూడా చేతిలో లేని పరిస్థితి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి వారిని ఆదుకోవాలని వీరిని దుస్థితిని చూసిన గ్రామస్తులు కోరుతున్నారు.