సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్నాయి. వచ్చే మార్చిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులకు స్వయం ఉపాధి కల్పన కోసం అమలు చేస్తున్న పథకాలు ఇప్పటికే చతికిలపడ్డాయి. రాయితీ పెంపుపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే సరికి తీవ్ర ఆలస్యం జరిగిపోయింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగా సత్వర చర్యలు తీసుకోకపోతే లబ్ధిదారుల ఆశలు అడియాశలు కానున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు, వికలాంగ సంక్షేమ శాఖలు అమలు చేస్తున్న స్వయం ఉపాధి ప్రోత్సాహక పథకాలు పడకేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2013-14)లో భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటి వరకు అమలు ప్రక్రియే ప్రారంభానికి నోచుకోలేదు. ఎన్నికల్లో ఓటర్లపై వల విసిరేందుకు రాయితీలను పెంచాలనుకున్న ప్రభుత్వం ఈ అంశాన్ని సుదీర్ఘ పరిశీలనలో ఉంచింది. ఆరునెలల నాన్చిన తర్వాత ఎట్టకేలకు రాయితీలను పెంచుతూ గత నెల 31న ఉత్తర్వులు(జీవో ఎం.ఎస్ నెం.101) జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు యూనిట్ విలువలో 60 శాతం రాయితీని రూ.లక్షకు మించకుండా ఇచ్చేందుకు సర్కార్ అంగీకారం తెలిపింది. బీసీ, మైనారిటీ, వికలాంగ లబ్ధిదారులకు యూనిట్ విలువలో 50 శాతం రాయితీని రూ.లక్షకు మించకుండా వర్తింపజేయనుంది. అయితే, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 21-45 ఏళ్లు, ఇతరులు 21-40 ఏళ్ల వయోపరిమితి
కలిగి ఉండాలని సర్కార్ తన ఉత్తర్వుల్లో సూచించింది.
పాత మార్గదర్శకాల ఆధారంగా మండల స్థాయి స్క్రీనింగ్ కమిటీలు ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక పూర్తి చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. వయస్సు ఆధారంగా మళ్లీ దరఖాస్తుల పునః పరిశీలన జరిపి మళ్లీ లబ్ధిదారుల ఎంపికను చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గదర్శకాల్లో స్పష్టత కొరవడడంతో ఈ ప్రక్రియే ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నుంచి తాజా మార్గదర్శకాలు అందితేనే ఈ ప్రక్రియలో కదలిక రానుంది. సమీప భవిష్యత్తులో లబ్ధిదారుల ఎంపికను ప్రారంభించినా మార్చిలోగా లక్ష్యాలను అందుకోవడం దాదాపు అసాధ్యమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణాల మంజూరులో బ్యాంకర్ల ఆలస్యం తోడైతే పరిస్థితి మరింత చేజారనుంది.
కూతవేటులో ‘కోడ్’
Published Sat, Jan 18 2014 12:17 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement