సాక్షి, కడప/రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటంతో లక్ష్యాలు అందుకోవడం కార్పొరేషన్లకు అసాధ్యమనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫిబ్రవరి నెల చివరిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇదే జరిగితే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల కోడల్ అడ్డంకిగా మారనుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల స్వయం ఉపాధి కల్పన కోసం అమలు చేస్తున్న పథకాలు ఇప్పటికే అటకెక్కాయి. రాయితీ పెంపుపై ప్రభుత్వ నిర్ణయం వెలువడేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే లబ్ధిదారుల ఆశలు అడియాశలు కానున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్, వికలాంగుల సంక్షేమశాఖ అమలు చేస్తున్న స్వయం ఉపాధి ప్రోత్సాహాక పథకాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2013-14లో భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటివరకు అమలు ప్రక్రియ ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసిన పాత మార్గదర్శకాల ఆధారంగా మండల స్థాయి స్క్రీనింగ్ కమిటీలు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసినా తాజా నిర్ణయంతో ఉపయోగం లేకుండా పోయింది.
వయస్సు ఆధారంగా మళ్లీ పునః పరిశీలన జరిపి లబ్ధిదారులను ఎంపిక చేపట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులు 21 నుంచి 45 ఏళ్లు, ఇతరులు 21 నుంచి 40 ఏళ్ల వయోపరిమితి కలిగి ఉండాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది.
ఎన్నికల వేళ ఓటర్లపై వల
ఎన్నికల్లో ఓటర్లపై వల విసిరేందుకు రాయితీలను పెంచాలనుకున్న ప్రభుత్వం ఈ అంశాన్ని సుదీర్ఘకాలం పరిశీలనలో ఉంచి నాన్చింది. ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు రాయితీలను పెంచుతూ గతనెల 31వ తేదీ (జీఓనెం. 101)న ఉత్తర్వులను జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు యూనిట్ విలువలో 60 శాతం రాయితీని లక్షకు మించకుండా ఇచ్చేందుకు సర్కార్ పచ్చజెండా ఊపింది. బీసీ, మైనార్టీ, వికలాంగ లబ్ధిదారులకు యూనిట్ విలువలో 50 శాతం రాయితీ లక్షకు మించకుండా వర్తింపజేయాలని పేర్కొంది.
మళ్లీ మొదటికి
మార్గదర్శకాల్లో స్పష్టత కొరవడడంతో యూనిట్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం కాలేదు. తాజా మార్గదర్శకాలు అందడంతో ప్రక్రియలో కదలిక రానుంది. పాత మార్గదర్శకాల ఆధారంగా స్క్రీనింగ్ కమిటీలు చేసిన లబ్ధిదారుల ఎంపికలు ఉపయోగం లేకుండా పోయాయి.
కొత్తగా లబ్ధిదారుల ఎంపికలు చేపట్టాల్సి వస్తోంది. సమీప భవిష్యత్తులో లబ్ధిదారుల ఎంపికను ప్రారంభించినా మార్చిలోగా లక్ష్యాలు అందుకోవడం అసాధ్యమనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రుణాల మంజూరులో బ్యాంకర్ల ఆలస్యం తోడైతే పరిస్థితి మరింత చేజారుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.
సంక్షేమ పథకాలకు పొంచివున్న గండం
Published Tue, Jan 21 2014 2:16 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement