సాక్షి, సంగారెడ్డి: సంక్షేమ పథకాలపై ఎన్నికల కోడ్ ప్రభావం పడింది. కోడ్ అమల్లోకి రావడంతో ఈ నెల 2 నుంచి అన్నీ పథకాల కింద కొత్త మంజూరులు నిలిచిపోయాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ శాఖల ఆధ్వర్యంలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పన కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రాయితీలను పెంచినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. రాయితీల పెంపుపై నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యం.. ఆ తర్వాత లభించిన రెండు నెలల వ్యవధిని జిల్లా యంత్రాంగం సద్వినియోగం చేసుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఎన్నికల కోడ్ రాకకు ఒకటీ రెండు రోజులు ముందు ఆయా శాఖల జిల్లాధికారులు హడావుడి చేసినా ..లక్ష్యాలు మాత్రం అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఇక సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు దరఖాస్తుదారులు (జూన్ నాటికి) వేచి చూడాల్సిందే.
101 కష్టాలు
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు, వికలాంగ సంక్షేమ శాఖలు అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాల ప్రోత్సాహకాలు పెంచాలని యోచించింది. ఈ అంశాన్ని దాదాపు అరు నెలల పాటు పరిశీలనలో ఉంచింది. ఎట్టకేలకు రాయతీలను పెంచుతూ గతేడాది డిసెంబర్ 31న ఉత్తర్వులు(జీఓ ఎం.ఎస్ నెం.101) జారీ చేసింది.
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రాయితీని రూ.లక్షకు మించకుండా యూనిట్ విలువలో 60 శాతం వరకు పెంచింది. అదే విధంగా బీసీ, మైనారిటీ, వికలాంగ లబ్ధిదారులకు రాయితీని రూ.లక్షకు మించకుండా యూనిట్ విలువలో 50 శాతం వరకు పెంచింది. గత సంవత్సరం (2013-14) ఆయా వర్గాల లబ్ధిదారుల కోసం రాయితీ బడ్జెట్‌ను భారీగా పెంచి దానికి అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించింది. ఈ జీవోలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక చేసే సరికి ఎన్నికలు ముంచుకొచ్చాయి. దీంతో లక్ష్యాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
హడావుడి ఫలితమిచ్చేనా?
ఎన్నికల కోడ్ అమల్లోకి రాకకు కొన్ని రోజుల ముందు జిల్లా యంత్రాంగం హడావుడి చేసింది. బ్యాంకుల నుంచి రుణ అంగీకార పత్రం పొందిన దరఖాస్తుదారులందరికీ చివరి రోజు వరకు రాయితీలు మంజూరు చేశారు. ఇంకా బీసీ, గిరిజన లబ్ధిదారులకు అయితే ఒక్కరికీ రాయితీలు అందలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బ్యాంకులు రుణాల చెల్లింపుపై సందిగ్ధం నెలకొంది.
కోడ్ కొరడా
Published Thu, Mar 6 2014 11:51 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement