
భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
అటవీ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గాలిలోకి కాల్పుల జరపాల్సి వచ్చిందని కోడూరు....
రైల్వేకోడూరు అర్బన్: అటవీ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గాలిలోకి కాల్పుల జరపాల్సి వచ్చిందని కోడూరు ఏసీఎఫ్ వైవీ నరసింహరావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఐదు రోజులుగా 25మందితో కూంబింగ్ చేస్తున్నామన్నారు. శనివారం రాత్రి 10గంటల ప్రాంతంలో తమిళనాడు, ఆంధ్రాకు చెందిన సుమారు 200మంది ఎర్రచందనం కూలీలు తమకు తారసపడ్డారన్నారు. తమను చూడగానే ఇరువైపులా రాళ్లతో దాడి చేశారన్నారు.
దీంతో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరపగా కూలీలు పారిపోయారన్నారు. అందులో కొంత మంది కూలీలు ‘రాళ్లతో కొట్టి చంపేయండిరా’ అంటూ తెలుగులో కేకలు వేశారన్నారు. సంఘటనా స్థలంలో ఇప్పటివరకు 200 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దుంగల కోసం ఇంకా గాలిస్తున్నామన్నారు. కాగా విషయం తెలిసిన వెంటనే డీఎఫ్‌ఓ వెంకటేష్ సంఘటనా స్థలికి చేరుకున్నారు. నిందితుల కోసం అడవి అంతా తీవ్రంగా గాలించారు. ఓబుళవారిపల్లె రైల్వేస్టేషన్‌లో ఇద్దరు తమిళనాడు కూలీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎఫ్‌ఓ తెలిపారు.