పచ్చి బాలింత. చేతిలో పసికందు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కడుపు మాడుతోంది. పాల కోసం చిన్నారి గుక్కపట్టి ఏడుస్తోంది.
కర్నూలు : పచ్చి బాలింత. చేతిలో పసికందు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కడుపు మాడుతోంది. పాల కోసం చిన్నారి గుక్కపట్టి ఏడుస్తోంది. ఊరు కాని ఊరులో ఆమెకు దిక్కుతోచలేదు. చేయి చాద్దామంటే ఆత్మాభిమానం అడ్డొచ్చింది. కన్నీళ్లను దిగమింగుతూ.. బిడ్డ పోరు మాన్పేందుకు శతవిధాల ప్రయత్నించింది. ఆకలికి తట్టుకోలేకపోయింది. అయిష్టంగానే తన పరిస్థితి వివరించి తినేందుకు డబ్బులివ్వమని కోరింది. ఆమె కడుపుతిప్పలు అక్కడున్న వారిని కరిగించకపోగా.. బిడ్డను అమ్మేందుకు వచ్చిందనే అపవాదును అంటగట్టింది. చివరకు పోలీసులు.. మీడియా రంగప్రవేశంతో ఆమె కళ్లనిండా నీళ్లు సుడులు తిరిగాయి.
అప్పటి వరకు బాధను పంటిబిగువున దాచుకున్న ఆమె ఒక్కసారిగా కన్నీరుమున్నీరైంది. తన మానాన తనను వదిలేయండని ప్రాధేయపడిన ఘటన నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన కృష్ణ, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు సంతానం. కూలి పనులు చేస్తున్నా కుటుంబం గడవని పరిస్థితుల్లో దయనీయ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం మరో మహిళతో కలసి పగిడ్యాలలోని బంధువులను కలిసేందుకు వెళ్తూ కర్నూలు బస్టాండ్ చేరుకుంది. బాలింత కావడంతో ఆకలికి తాళలేకపోయింది.
అప్పటికే బిడ్డ ఏడుస్తుండటంతో బస్టాండ్‌కు సమీపంలోని ఆదిత్య లాడ్జి వద్దనున్న పాన్‌షాపు వద్దకు చేరుకొని తన పరిస్థితిని తెలియజేసి డబ్బుల కోసం చేయి చాచింది. ఆ సమీపంలోని అయ్యన్న అనే వ్యక్తి ఆమెతో మాటలు కలిపి బిడ్డను ఇస్తే డబ్బులిస్తానంటూ నమ్మబలికాడు. అందుకామె ఒప్పుకోకపోవడంతో ఓ మహిళ బిడ్డను అమ్మేందుకు యత్నిస్తోందంటూ తనకు తెలిసిన పోలీసులు, మీడియా ప్రతినిధులకు సమాచారం చేరవేశాడు. ఒక్కసారిగా వీరంతా అక్కడికి చేరుకునే సరికి ఆమె బిత్తరపోయింది.
ఒకరిపై ఒకరు ప్రశ్నల వర్షం కురిపించడంతో కన్నీరు పెట్టుకుంటూ.. తానెందుకు బిడ్డను అమ్ముకుంటానని వాపోయింది. పగిడ్యాలలోని తన బంధువులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పినా సూటిపోటి మాటలతో ఆమె మనసును గాయపర్చారు. ఎట్టకేలకు ఆమె కన్నీళ్లకు కరిగిపోయిన పోలీసులు ఆమెను గద్వాల బస్సు ఎక్కించి పంపేయడంతో కథ సుఖాంతమైంది. అయితే అప్పటికే ఈ విషయాన్ని మీడియా హడావుడి చేయడంతో కలకలం రేగింది. చివరకు అసలు విషయం తెలుసుకొని ఆమె బీద పరిస్థితికి చలించిపోయారు.