కుమారకాల్వ(చక్రాయపేట)న్యూస్‌లైన్ : చేతికి వచ్చిన పంటకు నీళ్లు కట్టేందుకు వెళ్లిన రైతన్నను వేకువజామున వచ్చిన కరెంటు ప్రాణం తీసింది. ఊడి కింద పడ్డ మోటారు వైరును తగిలించబోయిన ఆ రైతు ప్రాణాన్ని తీసి ఆయన కుటుంబాన్ని వీధిన పడేసింది. ఈసంఘటన చక్రాయపేట మండలంలోని కుమారకాల్వ గ్రామంలో గురువారం జరిగింది.
కుటుంబీకులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా.. కుమారకాల్వకు చెందిన రైతు ఆలా ఈశ్వరయ్య(45) తెల్లవారుజామున 4గంటలకు విద్యుత్ వస్తుందని తన పొలంలో వేరుశనగ పంటకు నీళ్లు పెట్టాలని భార్యకు చెప్పి వెళ్లాడు. అక్కడికి వెళ్లే సరికి వైర్లు ఊడి కింద పడటంతో దాన్ని తగిలించ బోయి ప్రాణాలు వదిలాడు. తెల్లవారాక ఆయన బావమరది కాఫీ తీసుకెళ్లి చూసే సరికి ఈశ్వరయ్య శవమై కనిపించాడు. దీంతో అతడు ఇంటికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో విషయం గ్రామమంతా తెలిసి అందరూ పరుగున అక్కడికి చేరుకున్నారు.
విగత జీవుడై పడిఉన్న ఈశ్వరయ్యను చూడగానే ఆప్రాంత మంతా రోదనలతో నిండుకొంది. మృతుడికి భార్య రామలక్షుమ్మతో పాటు భాస్కర్, జగదీష్ అనే ఇద్దరు కుమారులున్నారు. భాస్కర్‌కు బుధవారం ఇంటర్ పరీక్షలు మొదలు కావడంతో తండ్రి మృతిచెందిన విషయం పరీక్ష ముగిసిన తర్వాత తెలియ జేయడంతో ఆ విద్యార్థి కన్నీటి పర్యంతమయ్యాడు. సంఘటనపై వీఆర్వో శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని వేంపల్లెకు తరలించారు.
తరలి వచ్చిన గ్రామస్తులు
మృతుడు ఈశ్వరయ్య కుమారకాల్వతోపాటు పక్క గ్రామాలైన సిద్దారెడ్డిపల్లె, వెన్నపల్లె వాసులకు తలలోని నాలుక వంటి వాడని ఆ గ్రామాల ప్రజలు కంట తడిపెట్టారు. కువైట్‌కు వెళ్లి వచ్చి పొలం కొని కష్టాన్ని నమ్ముకొని బతికేవాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా గ్రామాల్లో జరిగే అల్లెం గుండు పోటీల్లో పాల్గొని బహుమతులు గెలిచేవాడని ఆయన స్మృతులను నెమరు వేసుకొంటూ గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈశ్వరయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చెన్నారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సూరి, బయా రెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కరెంట్ కాటు
Published Thu, Mar 13 2014 2:33 AM | Last Updated on Tue, May 29 2018 2:26 PM
Advertisement