ఉదయం పోయిన కరెంటు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. పట్టణాలు మొదలు.. పల్లెల వరకు ఇదే విషయమై చర్చ. ఇలా సాయంత్రం గడచిపోయినా.. రాత్రి అయ్యే కొద్దీ ఒక్కటే ఆందోళన. తెలిసిన వారందరికీ ఫోన్లు చేయడం.. మీ వద్ద ఎలాగుందని తెలుసుకోవడంలో ప్రతి ఒక్కరూ బిజీబిజీ. కనీసం టీవీల ద్వారా విషయం తెలుసుకుందామన్నా వీలుపడని పరిస్థితి. జిల్లా అంతటా గాడాంధకారం. ఎట్టకేలకు రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా.. సోమవారం తెల్లారితే ఏమవుతుందోననే బెంగ ప్రజలను నిద్రకు దూరం చేసింది. టీనోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో విద్యుత్ శాఖ జేఏసీ మెరుపు సమ్మె చేపట్టడంతో ఆదివారం జనజీవనం స్తంభించగా.. చీకట్లో మిద్దెపై పడుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు జారిపడి మృత్యువొడి చేరిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది.
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రెండు నెలల నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టినా వెనక్కి తగ్గని కేంద్రం తీరుకు నిరసనగా విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మె చేపట్టారు. సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల(సేవ్) సెంట్రల్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు విధులకు గైర్హాజరయ్యేందుకు నిర్ణయించారు. ముఖ్యంగా జెన్‌కోతో పాటు ట్రాన్స్‌కో, ఏపీసీపీడీసీఎల్ సిబ్బంది విధులకు దూరంగా ఉన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ, మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో కుడిగట్టు ఉత్పత్తి కేంద్రంలోని ఏడు జనరేటర్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఒక్కో జనరేటర్ ద్వారా 110 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉండగా సమ్మె కారణంగా 770 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో పాటు కర్నూలు నరగ శివారులోని పందిపాడు వద్ద గ్రీన్ ఎనర్జీ పవర్ ప్లాంట్‌లో ఉత్పత్తి పడిపోవడంతో 6 మెగావాట్లు, ఆత్మకూరులోని సాగర్ పవర్ హౌస్, ఎన్‌సీఎల్ పవర్ ప్లాంట్‌ల ద్వారా 8 మెగావాట్లు, వెలుగోడు వద్ద ఉన్న 2, గడివేముల వద్ద ఉన్న కేఎం హైడల్ పవర్ ప్లాంట్ నుంచి 15 మెగా వాట్లు, కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె వద్ద ఉన్న సాయి సింధు పవర్ ప్లాంట్ నుంచి 10 మెగా వాట్లు, కోడుమూరు మండలం లద్దగిరి వద్ద ఉన్న గజానన సోలార్ ప్లాంట్ నుంచి ఒక మెగా వాట్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మొత్తం 840 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచే కోతలు మొదలయ్యాయి.
క్రమంగా మండల, తాలుకా, మునిసిపాలిటీలకు తాకి జిల్లా అంతటా అంధకారం ఏర్పడింది. జిల్లాలో 10.3 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటి నుంచి నెలకు రూ.70 కోట్లకు పైగా ఆదాయం సంస్థకు వస్తుంది. సరఫరా నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు తాగునీటి పథకాలకు, రైల్వే శాఖకు కరెంటు షాక్ తప్పలేదు. విద్యుత్ లేక జిల్లాలో ఉన్న 1.11 లక్షల మంది వ్యవసాయ దారులు పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలాఉండగా విద్యుత్ కోత కారణంగా చీకట్లో మిద్దెపై నుంచి కింద పడి కర్నూలు నగరంలోని కుమ్మరి వీధికి చెందిన సుందర్(24) మరణించాడు. ఆదివారం రాత్రి విద్యుత్ సరఫరా లేకపోవడంతో 8 గంటల్లోపు భోజనం చేసి నిద్రించేందుకు మిద్దె పైకి వెళ్లిన ఇతను చీకట్లో మిద్దె అంచులు సరిగ్గా కనపడకపోవడంతో అదుపు తప్పి పైనుంచి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతనిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
‘సమైక్య సమ్మెకు’ సహకరించండి: విద్యుత్ జేఏసీ చైర్మన్ ఉమాపతి
సమైక్యాంధ్ర పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన విద్యుత్ జేఏసీ చేసట్టిన సమ్మెకు సహకరించాలని సమైక్యాంద్ర విద్యుత్ ఉద్యోగులు(సేవ్) జేఏసీ జిల్లా చైర్మన్ ఎం.ఉమాపతి కోరారు. ఆదివారం స్థానిక విద్యుత్ భవన్ ఎదుట ఆందోళన నిర్వహించిన ఇంజినీర్లు, జేఏసీ నాయకులు, ఉద్యోగులు, కార్మికులు అనంతరం ఓర్వకల్లు మండలంలోని నన్నూరు 400 కేవి, సోమయాజుల పల్లె ట్రాన్స్‌కో సబ్ స్టేషన్ల ఎదుట ధర్నా చేశారు. అనంతరం కర్నూలు చేరుకున్న బృందం నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఉమాపతి మాట్లాడుతూ తమ ఉద్యోగుల వేతనాలు పెంపు, ఇతర అలవెన్స్, సౌకర్యాల కోసం సమ్మె చేయడం లేదని, తెలుగు ప్రజల సమైక్యం కోసమే చేస్తున్నామన్నారు. విభజన జరిగితే భవిష్యత్తులో ఏర్పడే చీకటి కష్టాల కంటే ఇప్పుడు సమ్మెతో ఎదురయ్యే సమస్యలు పెద్దవి కావన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తమ సమ్మెకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా చరిత్రలో ప్రప్రథమం
జిల్లాలో ఇంత పెద్ద విద్యుత్ సమస్య తలెత్తడం ఇదే మొదటి సారి అని విద్యుత్ శాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. గతంలో డిమాండ్ల పరిష్కారానికి ఒకటి లేదా రెండు యూనియన్లు సమ్మె బాట పడితే మిగిలిన యూనియన్లకు చెందిన ఉద్యోగులు, కార్మికుల చేత పనులు చేయించేవారు. ఎన్నడూ లేని విధంగా ఇంజినీరింగ్ సంఘాలతో పాటు కార్మిక, ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై జేఏసీగా ఏర్పడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడడం ఇదే ప్రప్రథమం. సమ్మెతో అన్ని ఎమర్జేన్సీ విభాగాలకు సైతం విద్యుత్ సమస్య ఏర్పడింది.
విభజన చీకటి
Published Mon, Oct 7 2013 3:30 AM | Last Updated on Wed, Sep 5 2018 1:52 PM
Advertisement
Advertisement