వేసవికి ముందే కోతలు..
Published Thu, Jan 23 2014 12:16 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
సాక్షి, గుంటూరు: వేసవి రాక ముందే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా కోసమని గృహవినియోగ దారులకు కోతలు విధిస్తున్నారు. గురువారం నుంచే కోతలు అమలు చేసేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, మండల కేంద్రాల్లో అమలు పరిచే విద్యుత్ కోతల వివరాలు, సమయాలను బుధవారం సాయంత్రం ప్రకటించారు.
నేటి నుంచి అమలయ్యే
కోత వేళలు ఇలా....
= గుంటూరు నగరంలో ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకు కరెంటు సరఫరా ఉండదు.
= మున్సిపల్ పట్టణాల్లో ఉదయం 8 నుంచి 10 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కోతలు అమలు.
=మండల కేంద్రాల్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 6 గంటల వరకు సరఫరా ఉండదు.
= గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఫీడర్ల కింద సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు లైటింగ్ కోసం సరఫరా ఉంటుంది.
నిత్యం రెండు దశల్లో
వ్యవసాయానికి విద్యుత్
జిల్లాలోని వ్యవసాయ కనెక్షన్లను 4 గ్రూపులుగా విభజించిన విద్యుత్ శాఖ అధికారులు ఇక మీదట నిత్యం రెండు దశల్లో ఆయా కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
= గుంటూరు సర్కిల్‌లోని ‘ఏ’ గ్రూపు కింద ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు రాత్రి 10.45 గంటల నుంచి ఉదయం 3.45 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.45 గంటల విద్యుత్ సరఫరా చేయనున్నారు.
= గ్రూప్ ‘బి’ కింద కనెక్షన్లకు ఉదయం 3.45 గంటల నుంచి 8.45 గంటల వరకు, రాత్రి 10.45 నుంచి 12.45 వరకు సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు.
= ‘సి’ గ్రూప్ కనెక్షన్లకు ఉదయం 8.45-1.45, రాత్రి 12.45-2.45 గంటల వరకు సరఫరా ఇస్తారు.
= ‘డి’ గ్రూపులోని కనెక్షన్లకు మధ్యాహ్నం 1.45-6.45, తెల్లవారు జామున 2.45-4.45 గంటల వరకు విద్యుత్ సరఫరా జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ కోతలేంటి..
వేసవి రాక ముందే కరెంటు కోతలేంటని వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ పరిస్థితి దాపురించిందంటూ ప్రతిపక్షాలు, వామపక్షపార్టీలు ప్రత్యక్ష ఆందోళనా కార్యక్రమాలకు సమాయత్తమవుతున్నాయి. ఈ ఏడాది రబీ సీజను ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో వ్యవసాయానికి విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ మోటార్లు కారణంగా పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం జరుగుతోంది. దీంతో జిల్లాకు కేటాయించిన విద్యుత్‌ను వివిధ రంగాలకు నిర్ధేశిత ప్రమాణాల మేరకు సరఫరా చేయడం అధికారులకు ఇబ్బందిగా మారింది. డిమాండ్, సరఫరాల మధ్య వ్యత్యాసం గణనీయంగా వుండడంతో విద్యుత్ కోతలు అనివార్యమయ్యాయని అధికారులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో గృహ వినియోగానికి కోత విధించి, వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు.
Advertisement
Advertisement