జిల్లాల్లో అవసరమైనంత కరెంటు అందుబాటులో ఉందని, ముందు చూపుతో వ్యవహరించడం వల్ల వ్యవసాయానికి ఏడు గంటలు కచ్చితంగా సరఫరా చేసి తీరుతామని ఇటీవల గుంటూరులో ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర ప్రకటించారు.
సాక్షి, గుంటూరు: జిల్లాల్లో అవసరమైనంత కరెంటు అందుబాటులో ఉందని, ముందు చూపుతో వ్యవహరించడం వల్ల వ్యవసాయానికి ఏడు గంటలు కచ్చితంగా సరఫరా చేసి తీరుతామని ఇటీవల గుంటూరులో ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర ప్రకటించారు. రైతులు మాత్రం ఏడు గంటల మాట దేవుడెరుగు మూడు గంటలకే దిక్కులేదని వాపోతున్నారు. వ్యవసాయానికి కరెంటు వినియోగం తక్కువగా ఉన్నా.. కోతలు మాత్రం గణనీయంగా ఉన్నాయంటున్నారు. జిల్లాలో వ్యవసాయానికి 0.9 మిలియన్ల యూనిట్లు వినియోగం జరుగుతోంది.
ప్రస్తుతం రెండు విడతల్లో సరఫరా జరుగుతోంది. రాత్రి 11 గంటల తర్వాత నుంచి ఉదయం 4 గంటల లోపు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు ఏడు గంటలు సరఫరా చేస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నా, ఏడు గంటల్లో ఎడాపెడా కోతలు అమలవుతూ రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. మూడు నుంచి నాలుగు గంటలే గగనంగా ఉందని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న పంటలకు సరిగా నీరందక, దిగుబడులపై ప్రభావం చూపుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆయిల్ ఇంజన్లతో అదనపు భారం.. గుంటూరు జిల్లాలో 69 వేల ఉచిత విద్యుత్తు కనెక్షన్లున్నాయి. ఈ బోర్ల కింద 1.80 లక్షల హెక్టార్లలో అరటి, పసుపు, పత్తి, మిరప, మొక్కజొన్న వంటి వాణిజ్యపంటలు సాగు చేస్తున్నారు. నరసరావుపేట, మాచర్ల సబ్ డివిజన్లలోని వినుకొండ, శావల్యాపురం. దుర్గి, బండ్లమోటు, రేమిడిచర్ల ప్రాంతాల్లో పత్తి, మిరప, తెనాలి, బాపట్ల సబ్ డివిజన్లలోని రేపల్లె, కొల్లూరు, కొల్లిపర ప్రాంతాల్లో అరటి, పసుపు పంటలపై ఈ కోతలు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. పల్నాడు, డెల్టాల్లోని రెండు ప్రాంతాల్లో మొక్కజొన్న భారీ విస్తీర్ణంలో సాగవుతోంది. కరెంటుకోతలతో మొక్కజొన్నకు నీటి తడులు సమయానికి అందడం లేదు. ఆయిల్ ఇంజన్లతో నీటి తడులు ఇవ్వడం వల్ల అధికంగా ఖర్చవుతోంది.
అధికారులేమంటున్నారు.. ఉచిత సర్వీసులకు కరెంటు సరఫరా సరిగా లేకపోవడానికి ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్‌ఆర్) కారణమని అధికారులు చెబుతున్నారు. తమకు సంబంధం లేకుండానే స్టేట్ లెవల్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) నుంచే కోతలు అమలవుతున్నట్లు చెబుతున్నారు. సాంకేతిక కారణాలతో థర్మల్ యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోతే ఉచిత సరఫరాకు కరెంటోళ్లు కనిష్ట ప్రాధాన్యత ఇస్తున్నారు. పదిహేను రోజుల నుంచి సింహాద్రిలో 250 మెగావాట్ల సామర్ధ్యం గల ఒక యూనిట్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, రామగుండంలలో 200 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న యూనిట్లు రెండు సార్లు ట్రిప్ కావడంతో ఉచిత విద్యుత్తుకు ఎడా పెడా కోతలు అమలు చేస్తున్నారు.