సహనానికీ హద్దుంటుంది
Published Wed, Sep 11 2013 2:55 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
హన్మకొండ కల్చరల్ న్యూస్‌లైన్ : సహనానికీ ఓ హద్దు ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, గోవారాష్ట్ర లోకాయుక్త జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. కోటిమందితో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌సలో ప్రదర్శన నిర్వహిస్తామని సమైక్యవాదులు ప్రకటించడం భావప్రకటన స్వేచ్ఛా లేక ఆధిపత్య భావజాలమా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు శత జయంతి ఉత్సవాలను సోమవారం సాయంత్రం నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి సమావేశాన్ని ప్రారంభించారు.
సినీ దర్శకుడు బి.నర్సింగరావు గౌరవసంపాదకుడిగా గుడిపాటి వెంకటేశ్వరరావు సంపాదకుడిగా ప్రచురించిన పాలపిట్ట కాళోజీ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. భాగ్యనగరం మీద దండయాత్రలాగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి సమైక్యవాదులకు అనుమతి ఎలా లభించిందన్నారు. ఈ విషయంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ఇతర తెలంగాణప్రాంత మంత్రుల బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఆధిపత్య భావజాలాన్ని వ్యతిరేకించిన కాళోజీ ఇవాళ ఉండిఉంటే తీరుతీరుగా స్పందించేవారన్నారు. తెలంగాణ పోరాటం తుదిదశకు చేరుకుందనుకుంటే నవ్వులపాలు కాకతప్పదన్నారు. కాళోజీ పట్ల మనకు ఏపాటి గౌరవం ఉందో తేల్చుకోవాల్సిన సమయం ఇదేనన్నారు. ఆయనిప్పుడు జీవించి ఉంటే ఎలా ఉండేవారు.. ఎలా స్పందించేవారు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే.. ప్రస్తుత సమయంలో ఏం చేయాలనే విషయం తెలుస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రపై విస్తృత చర్చ జరగాలని సూచించారు.
బుద్ధిజీవులు వైఖరి మార్చుకోవాలి
కాలగమనంలో పార్టీలు, సిద్ధాంతాలు పోతాయికానీ ప్రతికూలతలు పోవని విప్లవకవి, రచయిత డాక్టర్ పెండ్యాల వరవరరావు అన్నారు. బుద్ధి జీవులు తమ వైఖరి మార్చుకోవాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. తెలంగాణ ప్రాంతం ఏనాడూ ఢిల్లీ చక్రవర్తుల పాలనలో లేదని, 1948లో సైనిక చర్య తరువాత ఢిల్లీ పాలన ప్రారంభమైందన్నారు. సైనిక చర్యలో వేలాదిమంది కమ్యూనిస్టులను, రజాకార్లను కాల్చిచంపారన్నారు.
విలీనమా... సయోధ్యా
హన్మకొండలోని బ్రాహ్మణవాడలో తనకు కాళోజీతో తనకు పరిచయం ఏర్పడిందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ చుక్కా రామయ్య తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలిసిపోయిన సందర్భంగా ఇది విలీనమా లేక సయోధ్యా అని కాళోజీ ప్రశ్నించారన్నారు. కాళోజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన సిద్ధాంతాలపై ప్రచారం జరగాలని సూచించారు. హైదరాబాద్ తమదని ఆంధ్రావాళ్లు అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళా ఉద్యమకర్త, అస్మిత వ్యవస్థాపకులు వసంత కన్నాబిరాన్ మాట్లాడుతూ కాళోజీ మానవ సంబంధాలను ఎలాంటి దృక్పథంలోంచి అవగాహన చేసుకున్నారో అధ్యయనం జరగాలన్నారు. యువత కాళోజీ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.
కాళోజీ గొప్ప ఉదారవాదని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ అన్నారు. పార్టీ ఏదైనా సొంత గొంతుక వినిపించాలని అనేవారని గుర్తుచేశారు. పార్టీవ్రత్యం అనే పదాన్ని మొదటిసారి ఆయనే ప్రవేశపెట్టారన్నారు. సినీ దర్శకుడు, చిత్రకారుడు, కవి బి.నర్సింగరావు మాట్లాడుతూ కాళోజీని విశ్వకవిగా పిలుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. గతనెల 29న కాళోజీ శతజయంతి ఉత్సవ కమిటీ ఏర్పాటైందని, అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఏడు భాషల్లో కాళోజీ రచనలు ప్రచురించామన్నారు. కాళోజీకి పద్మవిభూషణ్ ఇచ్చిన ప్రభుత్వానికి ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు.
రామక లక్ష్మణమూర్తికి కాళోజీ పురస్కారం
సమావేశానికి అధ్యక్షత వహించిన కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి మాట్లాడుతూ కాళోజీ స్మారక భవన నిర్మాణానికి జిల్లాయంత్రాంగం ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదన్నారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య పంపిన సందేశాలను చదివి వినిపించారు. అనంతరం ప్రముఖ వైద్యుడు, మానవతావాది డాక్టర్ రామక లక్ష్మణమూర్తికి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా కాళోజీ పురస్కారం అందజేశారు. తెలంగాణ గాంధీ, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భూపతి కృష్ణమూర్తి, ప్రముఖ ఫొటోగ్రాఫర్ జి.భరత్‌భూషణ్‌లకు ఆత్మీయ సత్కారం చేశారు. కార్యక్రమంలో విమలక్క బృందం పాడిన పాటలు అలరించాయి. శతజయంతి ఉత్సవాల సమన్వయకర్త జీవన్‌కుమార్, కాళోజీ కుమారుడు రవికుమార్, కాళోజీ ఫౌండేషన్ కోశాధికారి పందిళ్ల అశోక్‌కుమార్, సంయుక్త కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాసారావు, టి.జితేందర్, సభ్యులు నమిలికొండ బాలకిషన్‌రావు, మహ్మద్ సిరాజుద్దీన్, కాళోజీ ఫౌండేషన్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యులు టి.ప్రభాకర్, కె.హరినాథ్, అమ్మంగి వేణుగోపాల్, శ్రీశైలం, కాళోజీ మిత్రుడు, వకీలు కె.ప్రతాప్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు వద్దిరాజు నర్సింహారావు, పద్మశ్రీ నేరేళ్లవేణుమాధవ్, బండారు ఉమామహేశ్వరరావు, బన్నా అయిలయ్య, విశ్రాంతాచార్యులు కె.మురళీమనోహర్, డీపీఆర్వో కె. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement