తెలంగాణ ముద్దుబిడ్డ కాళోజీ
కళా కేంద్రం జిల్లాకు అతుకుతున్న తునక
నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు
కాళోజీ కుటుంబానికి చేయూత
జయశంకర్ పట్టుదలకు కాళోజీయే స్ఫూర్తి
మహనీయుడి ఆశయూలను కొనసాగిద్దాం
కాళోజీ శత జయంతి సభలో సీఎం కేసీఆర్
తెలంగాణ ముద్దు బిడ్డ కాళోజీ విశ్వమానవుడు, విశ్వకవి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొనియాడారు. జీవిత పయనంలో ఏ సందర్భంలోనూ పదవులకు, డబ్బుకు ఆయన లొంగలేదని పేర్కొన్నారు. కాళోజీ లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వాల వారు వరంగల్ జిల్లాలోనే ఎక్కువ అని కొనియాడారు. మహోన్నత వ్యక్తిత్వానికి కొలమానం లేదని కేసీఆర్ అన్నారు. ప్రజాకవి కాళోజీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. అంతకుముందు కాళోజీ సెంటర్‌లోని విగ్రహానికి పూలతో నివాళర్పించారు. బాలసముద్రంలో మూడున్నర ఎకరాల్లో నిర్మించనున్న కాళోజీ కళా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిట్ ఆడిటోరియంలో జరిగిన సభలో మాట్లాడుతూ... ‘కాళోజీ మహనీయుడికి చంద్రునికో నూలుపోగులా కాళోజీ కళా కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. ఒక మంచి సంస్థను మూడున్నర ఎకరాల్లో కాళోజీ పేరు మీద నిర్మించే కళాకేంద్రం వరంగల్ పట్టణానికే అద్భుతమైన ఒక కానుక. కళా కేంద్రం ప్రపంచ స్థాయిలో ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ముఖద్వారం నుంచి లోపలికి పోగానే కాళోజీ కాంస్య విగ్రం, 1500 మంది కూర్చునే ఎయిర్ కండిషనర్ కళాక్షేత్రం ఉంటుంది. రూ.12 కోట్లు మంజూరు చేస్తున్నాం.
అక్కడే అర ఎకరంలో కాళోజీ ఫౌండేషన్ భవన్ ఉంటుంది. అర ఎకరం రిజిస్ట్రేషన్ సైతం ఫౌండేషన్ పేరిటే ఉంటుంది. రేపు కలెక్టర్లు మారొచ్చు... తర్వాత వచ్చేవాళ్లు ఫౌండేషన్‌ను చిన్నచూపే చూస్తరో, సన్నచూపే చూస్తరో.. దేనిది దానికి ఉంటే లెక్క అయిపోతది. ఫౌండేషన్ భవన నిర్మాణానికి రూ.12 కోట్లలోనే రూ.50 లక్షలు కేటాయిస్తం. ఈ భవనంలో కాళోజీ పుస్తకాలు, ఫొటోలు చరిత్ర అంశాలు ఉంటాయి. వచ్చినవాళ్లు చూసుకునేందుకు వీలుంటుంది. మొత్తంగా కళా కేంద్రం వరంగల్‌కు అతుకుతున్న అందమైన తునక. ఇది వరంగల్ నగరానికి కాళోజీ గౌరవం. కార్యక్రమం ఎక్కడ జరిగిందయ్యా అంటే... కాళోజీ కళా కేంద్రంలో అంటే నా హృదయం పొంగిపోతది. నాకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఆ మహనీయుడి పేరు ఉండాలే. కాళోజీ వారి స్ఫూర్తి చిస్థాయిగా ఉంటది’ అని కేసీఆర్ అన్నారు.
కాళోజీ కుటుంబానికి చేయూత
కాళోజీ కుటుంబానికి కేసీఆర్ కొంత సహకారం అందించారు. ‘కాళోజీ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. మనకు తలవంపులు తెచ్చే విషయం. అలా ఉండదానికి వీల్లేదు. ఇయ్యాల ఎవడు అవునన్నా.. కాదన్నా ఇది తెలంగాణ రాష్ట్రం. కాళోజీ లాంటి మహనీయుని కుటుంబం ఇలా ఉండవద్దు. రూ.10 లక్షలు కాళోజీ ఫౌండేషన్ పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. ఫౌండేషన్ వారు ఆ మొత్తం ద్వారా వచ్చే డబ్బులను కాళోజీ కుటుంబానికి ఇవ్వాలి. కాళోజీ రచనలను ఇతర, జాతీయ భాషల్లోకి అనువదిస్తాం. ఆంధ్రావాళ్లు మామూలు పొట్టోన్ని కూడా పొడుగోనిగా చేసి చూపించిన్రు. మన కాళోజీని, దాశరథిని పట్టించకోలేదు. మన పాల్కురికి సోమనాథుడే ఆదికవి. నన్నయ్య ఆది కవి అని అబద్ధాలు చెప్పిన్రు. ఇది కాళోజీ శతజయంతి కాబట్టి చేబుతున్నా.. లేకుంటే ఆయన ఆత్మ నా మీద కోపానికి వస్తంది. సీరియల్ అంటే బాగుంది గని సిల్‌సిలా(ఉర్దూలో) అంటే వికారమా అని కాళోజీ అన్నడు. చెప్పాలంటే చానా దూరం ఉంటది. నాకు కూడ జరంత కవిత్వం పైశ్చం ఉంది. కాళోజీకి స్వార్థం లేదు కాబట్టి భయం లేదు. మనందరికీ ఆదర్శప్రాయుడు. కేబినెట్‌లో తీర్మానం చేసి కాళోజీ పేరిట పోస్టల్ స్టాంప్ ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తాం. తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతిని ఈ రోజే ప్రకటిస్తున్నా. ప్రతి జయంతి తెలంగాణ నుడికారాన్ని, యాసను అతిగా ప్రేమంచిన వ్యక్తి. నా భాషే గొప్పది అని చెప్పిన వ్యక్తి’ అని వివరించారు.
వరంగల్‌కు రావాలనే వచ్చా...
కాళోజీ శత జయంతి ఉత్సవాల కార్యక్రమం హైదరాబాద్‌లో రాష్ట్ర తరఫున ఉన్నా... కాళోజీ సొంత ప్రాంతంలో పాల్గొనాలనే ఇక్కడికి వచ్చానని కేసీఆర్ చెప్పారు. ‘నేను ఉద్యమం ప్రారంభించిన తర్వాత వారి ఇంటికి వెళ్లి కలిశాను. కంట నీరు పెట్టుకుని ఆశీర్వదించారు. అప్పటి నుంచి కాళోజీకి నాగిళ్ల రామశాస్త్రి ప్రధాన సన్నిహితుడిగా ఉన్నారు. కాళోజీ ఫౌండేషన్ తరఫున రామశాస్త్రి, అంపశయ్య నవీన్, ప్రభాకర్‌రావులను అభినందిస్తున్నా’ అని అన్నారు.
జయశంకర్ పట్టుదలకు కాళోజీయే...
ఏదైనా అంశంపై మొదలుపెడితే కొసదాకా పట్టుబట్టే అలవాటు కాళోజీ నుంచే తనకు వచ్చిందని జయశంకర్‌సార్ చెప్పేవారని కేసీఆర్ వివరించారు. ‘జయశంకర్ సార్ శనివారం ఉపవాసం ఉండేవారు. మంచినీళ్లు మాత్రమే తాగేవారు. 72 ఏళ్ల వయసులో అలాగే ఉండేవారు. నేను వారించేవాన్ని. సార్ మా కోసం మీరు బతికి ఉండాలే అని నచ్చజెప్పగా మజ్జిగ తీసుకునేవారు. ఎందుకు ఇంత మొండిగ ఉంటరు అని అడిగిన. కాళోజీ నుంచి అబ్బిన అలవాటు అని జయశంకర్‌సార్ అన్నరు. ఏదైనా అంశాన్ని ఎత్తుకోకూడదు. ఎత్తుకుంటే చివరిదాకా పోరాడాలి. రాజీ పడవద్దు. అని జయశంకర్‌సార్ చెప్పేవారు’ అని కేసీఆర్ తెలిపారు. మనమంతా కాళోజీ ఆశయూలను కొనసాగిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో స్పీకర్ సరికొండ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు కె.కేశవరావు, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, కొండా సురేఖ, ఎ.చందులాల్, డి.ఎస్.రెడ్యానాయక్, దొంతి మాధవరెడ్డి, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, నాగపురి రాజలింగం, బి.వెంకటేశ్వర్లు, కలెక్టర్ జి.కిషన్, ప్రభుత్వ సలహాదారులు బి.వి.పాపారావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి టి.రామచంద్రునాయక్, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ.ఆచార్య తదితరులు పాల్గొన్నారు.