- జన్మభూమిలో టీడీపీ ఇన్‌చార్జ్‌ల పెత్తనం
- ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు దక్కని గౌరవం
- ప్రొటోకాల్‌కు విరుద్ధంగా టీడీపీ నేతల చేతుల మీదుగా అధికారిక కార్యక్రమాలు
- చోద్యం చేస్తున్న అధికార యంత్రాంగం
పార్టీ ఏదైనా.. హోదా ఏదైనా.. ఆ ప్రాంతంలో ప్రజలు ఎన్నుకున్న వారికి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఇది వార్డు సభ్యుడి నుంచి ప్రధానమంత్రి వరకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే జిల్లా అధికారులు ప్రస్తుతం ప్రొటోకాల్ మరిచి అధికార పార్టీ నాయకులకు పెత్తనం కట్టబెడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమం ‘జన్మభూమి-మాఊరు’లో ప్రజాప్రతినిధులు కాని వారు వేదికపై ఆసీనులవుతున్నారు. అధికారులు కూడా పింఛన్లు ఇతరత్రా పత్రాలను వారి హస్తాలతోనే అందజేస్తున్నారు.
సాక్షి, చిత్తూరు: ‘జన్మభూమి-మా ఊరు’ ఈ నెల 2న ప్రారంభమైంది. 4వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా పల్లెసీమల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే, మండలాధ్యక్షులు చదవాలి. లేదా జెడ్పీటీసీ సభ్యులు చదవాలి. ఆపై గ్రామాల్లోని ప్రజల సమస్యలు ఆలకించి, వాటికి పరిష్కారమార్గాన్ని చూపాలి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవైనా ప్రజలకు చేరాల్సి ఉంటే వాటిని ప్రజాప్రతినిధుల చేతులమీద అందించాలి. కానీ జిల్లాలో మాత్రం ‘ప్రజాప్రతినిధి’అనే మాటతో పనిలేకుండా టీడీపీ నేతల ఆధ్వర్యంలో అధికారులు జన్మభూమిని నడిపిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి... టీడీపీ కార్యకర్తలు, నాయకులంతా ప్రజాప్రతినిధులే అనే భ్రమలో అధికారులు ఉన్నారేమో జిల్లా వ్యాప్తంగా వారి ఆధ్వర్యంలో సభలు నడుస్తున్నాయి.
ఇవిగో ఉదాహరణలు
గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి జన్మభూమిలో ఆయన పాల్గొనాలి. అధికారిక కార్యక్రమాలు ఆయనతో పాటు ఆయా మండల ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ ఆధ్వర్యంలో జరగాలి. కానీ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కుతూహలమ్మ జన్మభూమి వేదికపై ఆశీసునులై ఆమె ప్రజా సమస్యలు ఆలకిస్తున్నారు. ఆమె చేతులమీదుగా కొత్త పింఛన్లు ఇతర పథకాల పత్రాలు అందజేస్తున్నారు అక్కడి అధికారులు.
పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌కు బదులుగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే లలితకుమారి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ సునీల్ కంటే ఆమెకే పెద్దపీట వేయడం గమనార్హం
చిత్తూరులో ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ, మేయర్‌కఠారి అనురాధ పాల్గొంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో టీడీపీ నేతలు దొరబాబు, కఠారి మోహన్, వైవీ రాజేశ్వరి, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ కూడా పాల్గొంటున్నారు. వీరి చేతుల మీదుగా పింఛన్ల పత్రాలు పంపిణీ చేస్తున్నారు.
నగరి నియోజకవర్గంలో నగరి టీడీపీ ఇన్‌చార్జి ముద్దుకృష్ణమనాయుడు జన్మభూమిలో అధికారికంగా పాల్గొంటున్నారు.
పలమనేరులో అమరనాథరెడ్డి ఎమ్మెల్యే అనే విషయం కూడా మరిచిపోయి, జన్మభూమి కార్యక్రమానికి ఆహ్వానించకుండా అధికారులు కార్యక్రమాన్ని నడుపుతున్నారు. దీనికి నిరసనగా ఎమ్మెల్యే మంగళవారం జవ్వునిపల్లెలో నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ నియోజకవర్గంలో బోస్ అధికారికంగా పాల్గొంటున్నారు.
ఇలా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ జన్మభూమి టీడీపీ నేతల చేతులమీదుగానే కొనసాగుతోంది. ఇది పూర్తిగా ప్రజాప్రతినిధులను అగౌరవపరచడమేనని ప్రతిపక్షపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలను అధికారులు ప్రోత్సహించి, వేదికపైకి తీసుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం మరీ దారుణమని మండిపడుతున్నారు. జన్మభూమికి ముందు ప్రతీ మండలానికి ప్రత్యేకాధికారులను నియమించారు. జిల్లాకు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌తో పాటు ప్రత్యేకాధికారి జేసీ శర్మ పర్యవేక్షిస్తున్నారు. రోజూ ప్రొటోకాల్‌కు విరుద్ధంగా సభలు నడుస్తుంటే వీరి పర్యవేక్షణ ఎలా ఉందో...రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవిస్తున్నారో ఇట్టే తెలుస్తోంది.