సాక్షి, విజయవాడ: ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా జిల్లాలోని మున్నేరు, పాలేరు, కీసర వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వీరులపాడు-దోమలూరు మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కంచికచెర్ల మండలంలో నల్లవాగు, సద్దవాగు ఉధృతి కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల నీటి ప్రవాహంతో ప్రకాశం బ్యారేజ్‌కి సుమారు 21 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. ప్రస్తుతం బ్యారేజ్‌లోని నీటిమట్టం సాధారణ స్థాయి కంటే పెరిగింది. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అదేశాలతో అధికారులు అలారం మోగించి.. ప్రకాశం బ్యారేజ్‌లోని 10 గేట్లు ఎత్తి దాదాపు 7,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పరీవాహక ప్రాంత అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు.
ఒడిస్సాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలలో శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార, మహేంద్రతనయ నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో నదుల్లో నీటి మట్టం బాగా పెరిగింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment