ఆర్టీసీ ఆదాయానికి  బ్రేకులు | Prakasam District RTC Lost Revenue Of Rs 113 Crore Due To The Lockdown | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఆదాయానికి  బ్రేకులు

Published Fri, Jul 3 2020 10:27 AM | Last Updated on Fri, Jul 3 2020 10:27 AM

Prakasam District RTC Lost Revenue Of Rs 113 Crore Due To The Lockdown - Sakshi

ఒంగోలు: లాక్‌డౌన్‌తో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడింది. కరోనా మహమ్మారి కారణంగా గడిచిన 103 రోజుల్లో ఆర్టీసీ 113 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది. అయినా ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం ప్రభుత్వం వేతనం చెల్లిస్తోంది. గతంలో ఆదాయం లేక ఆర్టీసీ బస్టాండులను సైతం అద్దెకు ఇస్తూ జీతం చెల్లించేందుకు యాజమాన్యాలు తిప్పలు పడేవి. మరో వైపు ఆరీ్టసీని ప్రైవేటీకరించేందుకు సైతం పెద్ద ఎత్తున కుట్రలు జరిగాయి. నాడు వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఆర్టీసీకి జీవం పోస్తే.. నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపారు.

ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి..   
జిల్లాలో 4 వేల మంది ఆర్టీసీ కారి్మకులు పనిచేస్తున్నారు. మొత్తం 761 బస్సులున్నాయి. రోజువారీ ఆదాయం సరాసరిన రూ.1.10 కోట్లు వస్తుంది. ఇక వేసవి రోజుల్లో అయితే మరో రూ.10 లక్షలు అదనంగా వచ్చేవి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆ వెంటనే లాక్‌డౌన్‌ ప్రకటించిన దరిమిలా ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఈ క్రమంలో వలస కూలీలను స్వస్థలాలకు పంపడంతో ఆరీ్టసీకి రూ.2.50 కోట్ల ఆదాయం వచ్చింది.

మే నుంచి ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు అవకాశం రావడంతో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు బస్సులు నడపడం ప్రారంభించారు. కానీ అది కూడా మూడునాళ్ల ముచ్చటే అయింది. కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోవడంతో కంటైన్‌మెంట్‌ జోన్లు ప్రకటించినందున బస్సులు నడవలేని పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రమైన ఒంగోలు ఆర్టీసీ డిపో కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉండటంతో బస్సులు నిలిచిపోయాయి. ఒంగోలు శివారు నుంచి బస్సులు నడపడం ప్రారంభించినా నగరం మొత్తం కంటైన్మెంట్‌గా ప్రకటించినందున కొద్ది రోజులకే అవి కూడా నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ పరిస్థితి ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది.  

నెలవారీ వేతనాలు రూ.14.83 కోట్ల పైనే.. 
ఆర్టీసీ ప్రకాశం రీజియన్‌లో మొత్తం 761 బస్సులు ఉన్నాయి. వీటిలో గత ఏడాది సరాసరిన అద్దంకి డిపో బస్సు రూ.11,554, గిద్దలూరు రూ.12,782, కందుకూరు రూ.13,051, కనిగిరి రూ.14,463, పొదిలి డిపో బస్సు రూ.13,219 ఆదాయం ఆర్జించేవి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ పీరియడ్‌లో ఈ ఐదు డిపోల నుంచి బస్సులు నడుపుతున్నప్పటికీ వస్తున్న ఆదాయం అత్యంత తక్కువగా ఉంది. అద్దంకి డిపో రోజుకు సుమారుగా వెయ్యి కిలోమీటర్లు, గిద్దలూరు 4 వేలు, కందుకూరు 3 వేలు, కనిగిరి 9 వేలు, పొదిలి వెయ్యి కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతున్నాయి. దీనికి సంబంధించి ఆదాయాన్ని పరిశీలిస్తే అద్దంకి డిపో రూ.19 వేలు, గిద్దలూరు రూ.99 వేలు, కందుకూరు రూ.68 వేలు, కనిగిరి రూ.2.34 లక్షలు, పొదిలి డిపో రూ.18 వేలు మాత్రమే ఆర్జిస్తున్నాయి. సరాసరిన అద్దంకి డిపో నుంచి ప్రతి బస్సుకు రూ.227, గిద్దలూరు రూ.1,153, కందుకూరు రూ.598, కనిగిరి రూ.1,965, పొదిలి రూ.211 మాత్రమే కావడం గమనార్హం. వలస కార్మికులను తరలించడం మొదలు ఇప్పటి వరకు ప్రకాశం రీజియన్‌ సాధించిన ఆదాయం మొత్తం రూ.5 కోట్ల లోపే. అయితే రీజియన్‌ పరిధిలోని 4 వేల మంది ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెలా రు14,83,75,000 చెల్లిస్తోంది. అంటే గత మూడు నెలలకు సంబంధించి ఆదాయంతో సంబంధం లేకుండా ఉద్యోగుల జీతాలకు ప్రభుత్వం రూ.44,51,25,000 చెల్లించింది. 

మూడు డిపోల నుంచి సర్వీసులు నిల్‌ 
ఒంగోలు నగర పాలక సంస్థ, చీరాల, మార్కాపురం మున్సిపాల్టీలు కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉండటంతో బస్సులు మొత్తం డిపోలకే పరిమితమయ్యాయి. కార్గోను నడిపేందుకు చేపట్టిన చర్యలు కూడా అనుకూలించకపోవడంతో ఆదాయం క్షీణించింది. తాజాగా సివిల్‌ సప్లయిస్‌కు సంబంధించి బియ్యాన్ని రేషన్‌ డిపోలకు తరలించే ప్రక్రియలో ఆర్టీసీ ఒక బిడ్డర్‌గా పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్న ముఠా కూలీలు, వాహనాల సంసిద్ధత తదితరాల కారణంగా ఇది దాదాపు సా«ధ్యం కాకపోవచ్చనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా ఏ ఆర్టీసీ కారి్మకుడిని కదిలించినా ఒకటే మాట.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకపోయుంటే ఆర్టీసీ మూతపడేదని, బస్సు సైరన్లకు బదులుగా కారి్మకుల ఆకలికేకలు వినిపించేవని పేర్కొంటున్నారు.  

జగన్‌ జనం గుండెల్లో నిలిచారు 
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకపోయుంటే నేటి పరిస్థితిని ఊహించుకుంటేనే కారి్మకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. లాభనష్టాలతో సంబంధం లేకుండా బస్సు తిప్పినా, తిప్పకపోయినా క్రమం తప్పకుండా వేతనం తీసుకోగలుగుతున్నాం. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల గుండెల్లో చిరకాలం నిలుస్తారు.
– ఎస్‌.ప్రసాదరావు, ఆర్టీసీ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ రీజినల్‌ కార్యదర్శి  

ప్రభుత్వంలో విలీనం కాకుంటే ఆర్టీసీ మనుగడే కష్టం 
కార్మికులు బస్సులు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నా బస్సులు నడపలేని పరిస్థితి తలెత్తితే ఆర్టీసీ కార్మికులకు సెలవు కిందే లెక్క. 103 రోజులుగా బస్సులు నడపకపోతే ఆర్టీసీ మనుగడే ఊహించుకోవడం కష్టం. ఆర్టీసీ ఉద్యోగులను పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌ ఉద్యోగులుగా ప్రకటించడం వల్ల నేడు ఉద్యోగులందరూ నాటి కష్టాలను మరిచి హాయిగా ఉండగలుగుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్కరూ జీవితకాలం రుణపడి ఉంటారు.  
– ఆవుల రాధాకృష్ణ, ప్రజారవాణా సంస్థ వైఎస్సార్‌ ఉద్యోగుల అసోసియేషన్‌  రాష్ట్ర ఉపాధ్యక్షుడు 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement