
సాక్షి, నెల్లూరు సిటీ : స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనయుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోసారి అసెంబ్లీలోకి నేడు అడుగుపెట్టనున్నారు. కోవూరు ఎమ్మెల్యేగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమరావతిలోని సచివాలయంలో ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరుకానున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఘన విజయం
కోవూరు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు నల్లపరెడ్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. నాడు నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి వరుసగా మూడు సార్లు కోవూరు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. తండ్రి మరణం తరువాత రాజకీయాల్లోకి వచ్చిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇప్పటికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. తాజాగా 39,891 ఓట్ల మెజార్టీతో గెలుపొంది కోవూరు నియోజకవర్గ చరిత్రలో ఘన విజయాన్ని కైవసం చేసుకున్నారు.