ప్రభుత్వ పొలం మింగిన టీడీపీ ఎమ్మెల్యే
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అవినీతి, అక్రమాలకు చిరునామాగా మారాడు. ఏకంగా నిషిద్ధ భూమిని తండ్రి, అత్తల పేరిట కొనుగోలు చేసినట్లు రెవెన్యూ రికార్డులో నమోదు చేయించాడు. తండ్రి, అత్త పేరిట 21 ఎకరాలు భూ ఆక్రమణకు పాల్పడ్డాడు. ఇద్దరినీ బినామీగా చేసి కొడవలూరు మండలంలోని బొడ్డువారిపాళెం మజరా కమ్మపాళెం పంచాయతీ పైడేరు కట్ట పక్కనే ఉన్న నిషిద్ధ భూమిని ఆక్రమించాడు.
గెజిట్లో నిషిద్ధ భూమి:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం కమ్మపాళెం పంచాయతీ బొడ్డువారిపాళెం మజరాలోని పైడేరు కట్ట పక్కన దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ నిషిద్ధ భూమి ఉంది. దీనికి సంబంధించి ఆర్సీ నంబరు బీ.119/2007 పేరిట మార్చి 14వ తేదీన 2007లో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. అయితే అందులో 20.76 ఎకరాల నిషిద్ధ భూమి కబ్జాకు గురైంది.
ఆక్రమణదారులు పోలంరెడ్డి తండ్రి, అత్తలే
ప్రభుత్వ నిషిద్ధ భూమిని కబ్జా చేసింది సాక్షాత్తు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి పోలంరెడ్డి వెంకురెడ్డి, అత్త కోటంరెడ్డి పద్మావతి. ఆక్రమణ చేసిన భూమిలో 664–2ఏలో 1.51 ఎకరాలు , 658–2ఏలో 0.50 ఎకరా , 651–1లో 7.0 ఎకరాలు, 656–1ఏలో 1.55 ఎకరాలు భూమి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి వెంకురెడ్డి పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. అలాగే 664–2బీలో 0.40 ఎకరా, 664–1లో 1.90 ఎకరా, 657–2లో 2.07 ఎకరాలు , 656–3లో 2.13 ఎకరాలు, 656–2లో 2.57 ఎకరాలు, 656–1బీలో 0.93 ఎకరా భూమి ఇందుకూరుపేట మండలం లేబూరులో నివాసముంటున్న పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అత్త కోటంరెడ్డి పద్మావతి( శ్రీనివాసులు రెడ్డి భార్య అరుణ తల్లి ) పేరిట రెవెన్యూ రికార్డు 1బీలో నమోదు చేసి ఉంది. నిషిద్ధ భూమిని ఇరువురూ కొనుగోలు చేసినట్లుగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు ధవీకరిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన 1బీలో పొందుపరిచారు. భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలతో పాటు ఆక్రమణదారులకు 1బీ కూడా తహసీల్దార్ వెంకటేశ్వర్లు మంజూరు చేశారు. 2004లో వీటిని కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసినా ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేసిందీ సమాచారం లేదు. అయితే ఈ భూముల కొనుగోలు నిషిద్ధమని సబ్–రిజిస్ట్రార్ రెవెన్యూ కార్యాలయానికి లేఖ పంపి ఉండటం గమనార్హం.
తల్లి సమాధికి మరో 60 సెంట్లు భూఆక్రమణ
పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తన తల్లి సమాధి కోసం నార్తురాజు పాళెం వద్ద 60 సెంట్ల భూమిని ఆక్రమించాడు. సర్వే నంబరు 324/3 కాలువ పోరంబోకు స్థలంలో మొత్తం విస్తీర్ణం రెండున్నర ఎకరా ఉండగా, అందులో 60 సెంట్ల భూమిని ఆక్రమించి తల్లి కష్ణమ్మ సమాధిని అందులో ఏర్పాటు చేశాడు. అంతటితో ఆగక చిన్నాన్న సమాధిని కూడా అందులో ఉంచాడు. పోలంరెడ్డి ఘాట్ అనుకునే తరహాలో కాలువ పోరంబోకు స్థలాన్ని ఆక్రమించడంపై నార్తురాజుపాళెం ప్రజలు మండిపడుతున్నారు.
2004 నుంచి ప్రయత్నం
ప్రభుత్వ నిషిద్ధ భూమి 20.70 ఎకరాల స్థలాన్ని తన కుటుంబ సభ్యుల పేరిట మార్చుకునేందుకు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 2004 నుంచి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు తమ ఉద్యోగాలకు సమస్య వస్తుందని మౌనం వహించారు. అయితే ప్రస్తుత తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఈ నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయనుండటంతో ఈ తంతు పూర్తిచేశారు. వీఆర్వో మొదలు డిప్యూటీ తహసీల్దార్ వరకు ఎవరూ ఈ వ్యవహారంలో వేలు పెట్టేందుకు సాహసించలేదు. సంతకం పెట్టేందుకు నిరాకరించారు. అయితే తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాత్రం ఏకంగా అన్నీ తానై 20.70 ఎకరాల నిషిద్ధ భూమిని పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి, అత్తలకు ధారాధత్తం చేశాడు. దీనిపై కలెక్టర్ జానకి ఏ మేరకు స్పందిస్తారో వేచిచూడాల్సిందే.