ఆత్మకూరు: మూడేళ్లుగా కులమతాలకు అతీతంగా పారదర్శకంగా లక్షలాది కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వాదంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న మేకపాటి విక్రమ్‌రెడ్డిని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని, దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి కలలు కన్న అభివృద్ధికి కృషి చేస్తామని పలువురు మంత్రులు అన్నారు. ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో సోమవారం పార్టీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఆర్‌కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాల్‌కృష్ణ, జోగి రమేష్, రాజ్య సభ్యుడు బీద మస్తాన్‌రావు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీతో పట్టణం జనసంద్రమైంది.
పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు జెండాలు చేతబట్టి వేలాదిగా పాల్గొనడంతో రోడ్లు కిక్కిరిశాయి. బంగ్లా సెంటర్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా ఎల్‌ఆర్‌పల్లి, జేఆర్‌పేట, సోమశిల రోడ్ సెంటర్, బస్టాండ్, వైశ్య బజారు మీదుగా సత్రం సెంటర్ వరకు సాగింది. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రజల సమస్యలను అతి తక్కువ కాలంలో దగ్గరగా పరిశీలించారని, వాటి పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారన్నారు. ప్రజలు ఇప్పటికే పార్టీ గుర్తు ఫ్యాన్‌కు వేసేందుకు స్థిర నిర్ణయం తీసుకున్నారని మెజార్టీ లక్షకుపైగా సాధించేందుకు తాము ప్రచారంలో పాల్గొంటున్నామన్నారు. మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి లేనిలోటు తీర్చేలా విక్రమ్‌రెడ్డి పని చేస్తారని ఆ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలతో అనుబంధం ఉందని, మచ్చలేని రాజకీయాలు చేస్తున్న వారిని ఆదరించి అభిమానించాలన్నారు.
ప్రతిపక్షాలు దిమ్మ తిరిగేలా భారీ మెజార్టీని అందివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి మంచి తనం చూసి ఆయన సోదరుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ మైనార్టీలతో పాటు బీసీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌తో పాటు అన్ని వర్గాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రాజకీయంగా పదవులు అందించిన ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కుతుందన్నారు.
అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు తనకు కొత్త అయినా పైనుంచి దీవిస్తున్న అన్న ఆశీర్వాదాలు, ప్రజల అభిమానం, ముఖ్యమంత్రి, మంత్రుల అండదండలు, సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపుతానన్నారు. గత నెల రోజులుగా చేస్తున్న ప్రచారంలో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం, సంతృప్తి కనిపిస్తున్నాయని, అమలు అవుతున్న నవరత్నాల పథకాలే శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసులురెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ద్వారకానాథ్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీ బల్లి కల్యాణచక్రవర్తి, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఆత్మకూరు మున్సిపల్ చైర్‌పర్సన్ జి వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ కేవీ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, షేక్ సర్ధార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, రూరల్ అధ్యక్షుడు జితేంద్రనాగ్‌రెడ్డి, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment